
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితర స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి ప్రియాంక చోప్రా ఈమధ్య హాలీవుడ్ లో కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. దీంతో అక్కడ కూడా ప్రియాంక చోప్రాకి ఆఫర్లు బాగానే వరిస్తున్నాయి. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా ముంబైలో ఉన్నటువంటి విలువైన ఆస్తులని విక్రయించింది. ఇందులో దాదాపుగా రూ.16.5 కోట్లు విలువచేసే 4 ఖరీదైన ఇళ్లు అమ్మేసినట్లు సమాచారం.
అయితే నటి ప్రియాంక చోప్రా అమెరికాకి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నికోలస్ జెర్రీ జోనాస్ ని 2018లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ఎక్కవగా హాలీవుడ్ పై దృష్టి సారిస్తోంది. దీంతో మెల్లమెల్లగా బాలీవుడ్ ని వదిలేసి అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈమధ్య హిందీ సినిమాల్లో నటించడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో ముంబైలో ఉన్నటువంటి తన ఆస్తులని ఒక్కొక్కటిగా అమ్మేస్తోందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ప్రియాంక చోప్రా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న SSMB29లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ హిట్ అందుకున్న రాజమౌళి ఈ సినిమాని హాలీవుడ్ కి పరిచయం చేసేందుకు యత్నిస్తున్నాడు. ఇందులోభంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమాని దాదాపుగా రూ.1200 కోట్లు బడ్జెట్ వెచ్చించి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.