తిరువనంతపురం: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్ బై పోల్ బరిలోకి దిగుతారని ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలపడంతో ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇవాళ (2024 అక్టోబర్ 25) అఫిషియల్‌గా ప్రకటించారు. తద్వారా ప్రియాంక గాంధీ ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు.
కాగా, ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు స్థానాల నుండి పోటీ చేసిన విషయం తెలిసిందే. తన సిట్టింగ్ స్థానమైన వయనాడ్‌తో పాటు కాంగ్రెస్ కంచుకోటైనా రాయ్ బరేలి నుండి బరిలోకి దిగారు. పోటీ చేసిన రెండు చోట్ల రాహుల్ గాంధీ ఘన విజయం సాధించడంతో ఏదో ఒక సీటుకు రాజీనామా చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెస్‌కు పెట్టని కోటైన రాయ్ బరేలి స్థానం నుండి కొనసాగాలని రాహుల్ డిసైడ్ అయ్యారు.
ఈ మేరకు వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ రిజైన్ చేయడంతో వయనాడ్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఈ క్రమంలో 2024 అక్టోబర్ 15వ తేదీన వయనాడ్ పార్లమెంట్ బై పోల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 2024, నవంబర్ 13వ తేదీన వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. రాహుల్ రాజీనామా అనంతరం ప్రియాంక గాంధీ వయనాడ్ ఉప ఎన్నిక బరిలోకి దిగుతోందని కాంగ్రెస్ అనధికారంగా ప్రకటించింది.
అయితే, ఇవాళ అధికారికంగా ప్రియాంక గాంధీ పేరును ఏఐసీసీ కన్ఫామ్ చేసింది. సిట్టింగ్ స్థానాన్ని నిలుబెట్టుకోవడానికి కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ముందే ఉప ఎన్నిక కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించి ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. వయనాడ్‌లో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని.. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీని బీట్ చేయడం కోసమే గట్టిగా ప్రయత్నం చేయాలని హస్తం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ | ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే ఈవీఎంలు మంచివి.. లేకపోతే చెడ్డవా: ఎలక్షన్ కమిషన్