మొన్న పాలస్తీనా.. నిన్న బంగ్లా బ్యాగ్​ .. పార్లమెంట్​లో ప్రియాంకా గాంధీ వినూత్న నిరసన

మొన్న పాలస్తీనా.. నిన్న బంగ్లా బ్యాగ్​ .. పార్లమెంట్​లో ప్రియాంకా గాంధీ వినూత్న నిరసన
  • బంగ్లాదేశ్​లో మైనార్టీలపై దాడులను ఖండిస్తున్నట్టు స్లోగన్స్​
  • ఆమెతోపాటు అలాంటి బ్యాగులే వేసుకొచ్చిన ప్రతిపక్ష ఎంపీలు

న్యూఢిల్లీ: పార్లమెంట్​ సమావేశాలకు తొలిసారిగా హాజరవుతున్న కాంగ్రెస్​ అగ్రనేత, వయనాడ్​ ఎంపీ ప్రియాంకా గాంధీ  రోజూ వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ‘పాలస్తీనా’ అనిరాసి ఉన్న బ్యాగ్‌‌తో సోమవారం పార్లమెంట్‌‌ ప్రాంగణంలో కనిపించిన ఆమె.. మంగళవారం కొత్త బ్యాగ్‌‌తో దర్శనమిచ్చారు. 

బంగ్లాదేశ్‌‌ రాతలున్న బ్యాగుతో ప్రియాంక కనిపించారు. ఆ బ్యాగ్​పై బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులను ఖండిస్తున్నట్టు స్లోగన్స్​ఉన్నాయి. ప్రియాంకతో పాటు ప్రతిపక్ష ఎంపీలు కూడా అలాంటి బ్యాగులతోనే పార్లమెంటులో అడుగుపెట్టారు. ప్రాంగణం వెలుపల ప్లకార్డులు, బ్యాగులు పట్టుకుని పొరుగుదేశం బంగ్లాదేశ్​లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నేనేం ధరించాలో వాళ్లే డిసైడ్​ చేస్తరా?: ప్రియాంక

సోమవారం పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా,  మంగళవారం బంగ్లా బ్యాగుతో ప్రియాంక నిరసన తెలపడం చర్చనీయాంశమైంది. పాలస్తీనా, బంగ్లాదేశ్​ ప్రజల గురించి ఏనాడూ మాట్లాడని ప్రియాంకాగాంధీ.. ఇప్పుడు జాతీయ అంశాల కంటే అంతర్జాతీయ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ బీజేపీ విమర్శించింది.  దీనిపై ప్రియాంక ధీటుగా స్పందించారు. తాను ఎలా ఉండాలి? ఏం ధరించాలనేది వేరేవాళ్లు నిర్ణయిస్తారా? అని మండిపడ్డారు. ‘‘నేను ఇప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఎవరు నిర్ణయిస్తారు? మహిళలు ఏమి ధరించాలో మీరే నిర్ణయించడమనేది విలక్షమైన పితృస్వామ్యం. 

నేను దాన్ని అంగీకరించను. నాకు నచ్చింది నేను వేసుకుంటా” అని స్పష్టం చేశారు. ఇవి ఎందుకు ధరిస్తున్నానో తాను చాలాసార్లు చెప్పానని, తన ట్విట్టర్​ హ్యాండిల్​ చూస్తే  తానేం చెప్పాలనుకున్నానో తెలుస్తుందని అన్నారు. ‘బంగ్లాదేశ్​లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు ఏదో ఒకటి చేయండి. బంగ్లా ప్రభుత్వంతో మాట్లాడండి. మూర్ఖపు మాటలు బంద్​ చేయండి’ అంటూ బదులిచ్చారు.