బలమైన సర్కార్తోనే.. తెలంగాణ ప్రజల సమస్యలకు పరిష్కారం: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. 6 గ్యారంటీలు పక్కాగా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని ప్రియాంక గాంధీ అన్నారు. గ్యారంటీలను అమలు చేస్తామని మా అమ్మకు చెప్పి వచ్చానని.. హామీ ఇచ్చిన గ్యారంటీలన్నీ నెరవేర్చి తీరుతాని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చే ప్రభుత్వ మాదని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అమల్లోకి వస్తదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పేదలకు కాంగ్రెస్ తోనే న్యాయం జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తెలంగాణ కోసం చాలా మంది పోరాటం చేశారని.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎందరో అమరులయ్యారని ప్రియాంక గాంధీ గుర్తు చేశారు. తెలంగాణలో నేను నిజాలే మాట్లాడుతున్నానని.. ఇక్కడి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో బలమైన సర్కార్ తోనే సమస్యలకు పరిష్కారం అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 4 కోట్ల ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు. 

రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రజల సంపదను దోచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఉన్న సమస్యలు నాకు తెలుసన్నారు. 

ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామన్న హామీని బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ హామీని కేసీఆర్ మర్చిపోయారని చెప్పారు. సంపదను పంచుకోవడంలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో వేలకోట్ల దోపిడీ జరిగిందని తెలిపారు.  

పరీక్షలు రాసే టైంలో పేపర్లు లీకైతే.. ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని ప్రియాంక గాంధీ చెప్పారు. ఉద్యోగాలు రాని కుటుంబాలు ఆవేదనలో ఉన్నాయని..
రాష్ట్రంలో నోటిఫికేషన్లు వస్తాయి.. పేపర్ల లీకేజీలు అవుతాయని మండిపడ్డారు. 
ఉద్యోగాలు లేక 10 ఏళ్లుగా యువత బాధపడుతున్నారని అన్నారు.