- తల్లి సోనియా, అన్న రాహుల్‌తో కలిసి దాఖలు
- వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తే అదృష్టం: ప్రియాంక
- నా చెల్లిని ఆదరించండి: రాహుల్ గాంధీ
- నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి
- నాకు 35 ఏండ్ల రాజకీయ అనుభవం ఉంది: ప్రియాంక
- 17 ఏండ్ల వయసులో నా తండ్రి కోసం ప్రచారంచేశా
వయనాడ్(కేరళ) : కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి బుధవారం నామినేషన్ వేశారు. ఆమె తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు వెంటరాగా.. ఆమె యూడీఎఫ్ క్యాండిడేట్‌గా అట్టహాసంగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు కల్పెట్టలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రియాంకా గాంధీ మాట్లాడారు. ‘‘1989లో నా తండ్రి రాజీవ్ గాంధీ కోసం తొలిసారి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా. 35 ఏండ్ల నా పొలిటికల్ కెరీర్లో నా తల్లి, సోదరుడు, నా తోటి నేతల కోసం ప్రచారం చేశా.
కానీ తొలిసారిగా నా కోసం నేను ప్రచారం చేసుకుంటున్నా. ప్రజలు ఆదరిస్తే వయనాడ్‌కు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా” అని వ్యాఖ్యానించారు. తనకు ప్రియాంకా గాంధీ కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్నదని వయనాడ్ బీజేపీ క్యాండిడేట్ నవ్య హరిదాస్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ప్రియాంకా గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ప్రకృతి విపత్తు సమయంలో వయనాడ్ ప్రజల ధైర్యాన్ని తాను చూశానని, ఆ కష్ట సమయంలోనూ ఒకరికొకరు సహకరించుకోవడం తనను కదిలించిందని ప్రియాంక చెప్పారు. ఇలాంటి వ్యక్తుల మధ్య తాను భాగం కావడం గొప్ప వరంగా భావిస్తున్నట్టు చెప్పారు.
వయనాడ్‌కు ఇద్దరు ఎంపీలు : రాహుల్‌గాంధీ
దేశంలోనే ఇద్దరు ఎంపీలున్న పార్లమెంట్ నియోజకవర్గంగా వయనాడ్ నిలువబోతున్నదని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. ఒకరు అఫీషియల్(ప్రియాంకా గాంధీ), ఇంకొకరు అనఫీషియల్ (రాహుల్‌గాంధీ) అని తెలిపారు. ఈ ఇద్దరూ పార్లమెంట్ లో వయనాడ్ సమస్యలు లేవనెత్తుతారని అన్నారు. తన సోదరిని ఆదరించాలని వయనాడ్ ప్రజలను కోరారు. “నా చేతికున్న రాఖీని నా సోదరి ప్రియాంక కట్టింది. తెగిపోయేదాకా దాన్ని తీయను. సోదరికి సోదరుడు రక్షణ అనేదానికి ఇది ప్రతీక. అందుకే నా సోదరిని మీ సోదరిలా భావించి ఆదరించాలని కోరుతున్నా.
ఆమె మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా ఎంచుకున్నది. మీకు కష్టమొస్తే తీర్చేందుకు ఆమె శక్తినంతా ధారపోస్తుందని వయనాడ్ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ భారీ బహింగ సభలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. వయనాడ్‌లో యూడీఎఫ్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ బరిలో నిలిచారు. ఈ స్థానంలో బీజేపీ నుంచి నవ్య హరిదాస్, ఎల్డీఎఫ్ నుంచి సత్యన్ మోకెరి పోటీ పడుతున్నారు. వచ్చే నెల 13న వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్నది.