యోగి ఆదిత్యనాథ్ సర్కార్‎పై ప్రియాంక గాంధీ విమర్శల వర్షం

యోగి ఆదిత్యనాథ్ సర్కార్‎పై ప్రియాంక గాంధీ విమర్శల వర్షం

లక్నో: ఉత్తరప్రదేశ్ కేబినెట్ ఆమోదించిన నూతన డిజిటల్ మీడియా పాలసీని 'తిరోగమన, స్వీయ-స్తుతి' చర్యగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు  ప్రియాంక గాంధీ అభివర్ణించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు  నూతన సోషల్ మీడియా విధానాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె విమర్శల వర్షం కురిపించారు. మీరు పగటిని రాత్రి అని చెబితే అది రాత్రే అవుతోంది.. లేదంటే  జైలే అనే తీరులో మీకు ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై సీరియస్ దృష్టిన పెట్టిన ప్రభుత్వం.. 69,000 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన రిక్రూట్‌మెంట్ రిజర్వేషన్ కేసును పరిష్కరించడానికి ఏం చర్యలు తీసుకున్నారని ఆమె ప్రశ్నించారు. 

ALSO READ | జర్నలిస్టులపై కేసు పెట్టిన కేంద్ర మంత్రి, నటుడు సురేష్ గోపి

న్యాయం కోరే మహిళల గొంతులు సోషల్ మీడియాలోని రెండు పాలసీలో ఏ వర్గంలోకి వస్తాయని.. 69000 టీచర్ రిక్రూట్‌మెంట్ రిజర్వేషన్ స్కామ్‌లో లేవనెత్తిన ప్రశ్నలు ఏ కేటగిరీలోకి వస్తాయని నిలదీశారు. ఫరూఖాబాద్ జిల్లాలో బుధవారం ఇద్దరు బాలికలు చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటనపై విచారణ జరపకుండా యోగి సర్కార్ పాలనను గాలికి వదిలేసిందని నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా నూతన పాలసీలతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వాక్ స్వాతంత్య్రాన్ని కాలరాస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం కంటే వాస్తవాలను అణిచివేసేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తోందని విమర్శించారు. 

ALSO READ | ప్రతీ నేతా కాబోయే ప్రధానే... రాహుల్​కు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది: మనీశ్ తివారీ

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం కంటే బీజేపీ చేసిందేమి లేదని విమర్శల వర్షం కురిపించారు.  కాగా, బుధవారం యూపీ కేబినెట్ ‘ఉత్తరప్రదేశ్ డిజిటల్ మీడియా పాలసీ 2024’కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇందులో రెండు విధానాలు చర్చనీయాంశంగా మారాయి.-- ప్రభుత్వ పథకాలను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు నగదు ప్రోత్సాహం ఒకటి కాగా.. మరొకటి సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టుల పెట్టే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని యూపీ ప్రభుత్వం నూతన పాలసీలో పొందుపర్చింది. ఈ రెండు విధానాలపై తాజాగా ప్రియాంక గాంధీ విమర్శలు కురిపించారు.