గద్వాల మీటింగ్ రద్దు..ఢిల్లీలోనే చేరికలు

గద్వాల, వెలుగు : నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​లో ప్రియాంక గాంధీ సభ రద్దయిన సంగతి తెలిసిందే. అలాగే, ఈనెల 20న గద్వాల జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పెట్టాలనుకున్న  సభ కూడా రద్దయ్యిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 18వ తేదీన బెంగళూరులో మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రధాన లీడర్ల ఆధ్వర్యంలో నిర్వహించే మీటింగులో గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్యతో పాటు ఎమ్మెల్యే బంధువు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మీదేవితో పాటు ఇతర ముఖ్య నేతలు జాయిన్ అవుదామని అనుకున్నారు. తర్వాత 20న గద్వాలలో భారీ బహిరంగ సభ పెట్టాలని ప్లాన్ వేసుకున్నారు.

ALSO READ :పిల్లలు పుట్టలేదని దంపతులు ఆత్మహత్యాయత్నం

కానీ, సభల రద్దుతో ఈ నెల 20న గద్వాల జడ్పీ చైర్ పర్సన్ తో పాటు ఇతర లీడర్లు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీలో జాయిన్ అవుతున్నట్లు తెలిసింది. రాహుల్​గాంధీ  లేకపోతే ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు సమాచారం. వారిద్దరూ అందుబాటులో లేకపోయినా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో అయినా పార్టీ కండువా కప్పుకోవాలని అనుకుంటున్నారు. ఇదంతా పూర్తయ్యాక గద్వాలలో బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నారు. కాగా, వీరితో పాటు ఇటిక్యాలకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తున్నది.