ఏ క్షణమైనా ఉరి తీస్తారనుకున్నా : నళిని శ్రీహరన్  

  • ఏ క్షణమైనా ఉరి తీస్తారనుకున్నా
  • ఉరి అమలుకు ఏడు సార్లు ఆర్డర్లు వచ్చినయ్: నళిని శ్రీహరన్  
  • ప్రియాంకా గాంధీ జైలుకొచ్చి ఏడ్చారు

చెన్నై:   మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కుట్రలో తన పాత్ర ఏమీ లేదని ఈ కేసులో శనివారం జైలు నుంచి విడుదలైన దోషుల్లో ఒకరైన నళిని శ్రీహరన్ అన్నారు. కేవలం తన భర్త మురుగన్ అలియాస్ శ్రీహరన్, ఆయన ఫ్రెండ్స్ తో పాటు ఉన్నందుకే తనను దోషిని చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నిజంగా ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను దోషిగా తేలానని నాకు తెలుసు. కానీ అసలు ఏం జరిగిందన్నది నా ఆత్మసాక్షికి తెలుసు. నా భర్త, ఆయన ఫ్రెండ్స్ తో పాటు షాపింగ్ కు, హోటల్స్ కు, గుడికి, థియేటర్లకు వెళ్లాను. అంతే. అంతకుమించి నేను ఎలాంటి కుట్రలో పాలుపంచుకోలేదు. వారి పర్సనల్ విషయాలు కూడా నాకు పెద్దగా తెలియవు” అని ఆమె ఆదివారం మీడియాతో వెల్లడించారు. తనకు విధించిన ఉరి శిక్ష 2001లో జీవితఖైదుగా మారిందని, అప్పటివరకూ తనను ఏ క్షణమైనా ఉరితీస్తారని అనుకున్నానని తెలిపారు. తనను ఉరితీయాలంటూ జైలుకు ఏడు సార్లు ఉరితీత ఆర్డర్ (బ్లాక్ వారంట్)లు 
వచ్చాయన్నారు.  

ప్రియాంక చాలా మంచి వ్యక్తి 

రాజీవ్ గాంధీ బిడ్డ ప్రియాంక గాంధీ 2008లో జైలుకు వచ్చి తనను కలిశారని నళిని తెలిపారు. ప్రియాంక చాలా మంచి వ్యక్తి అని, తనకు చాలా గౌరవం ఇచ్చారన్నారు. ‘‘జైలులో మమ్మల్ని ఎవరూ గౌరవంగా చూడలేదు. ఆఫీసర్లు, స్టాఫ్​ముందు మేం ఎప్పుడూ నిలబడే మాట్లాడేవాళ్లం. కానీ ప్రియాంక నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. మా నాన్నను ఎందుకు చంపారంటూ అడుగుతూ ఆమె ఎమోషనల్ అయి ఏడ్చేశారు” అని నళిని వెల్లడించారు.  

నా బిడ్డ నన్ను మర్చిపోయింది

జైలులోనే తనకు1992లో బిడ్డ (హరిత్ర) పుట్టిందని నళిని తెలిపారు. 2019లో తన కూతురు పెళ్లి జరిగిందని, అప్పుడు ఒక నెల పెరోల్ పై విడుదలయ్యామని గుర్తు చేసుకున్నారు. అయితే, హరిత్ర తమకు దూరంగా పెరిగిందని, ఆమె ప్రస్తుతం లండన్ లో డాక్టర్ గా పని చేస్తోందని వెల్లడించారు. తాను, తన భర్త మురుగన్ కలిసి లండన్ వెళ్లి బిడ్డను చూడాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ‘‘నేను ఆమెకు జన్మనిచ్చాను. కానీ రెండేండ్ల వయసులో మేం విడిపోయాం. ఆమెను బయటకు ఇచ్చిన తర్వాత నేను ఎవరో పూర్తిగా మర్చిపోయింది. ఇదంతా ఏంటో అర్థం కాకుండానే, ఎంతో కష్టం, బాధ మధ్య ఆమె పెరిగింది. ఇప్పుడు మేం వెళ్లి తనను కలుద్దామని అనుకుంటున్నాం” అని నళిని వివరించారు. శ్రీలంక జాతీయుడు అయినందున మురుగన్ ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం రెఫ్యూజీ క్యాంపులో ఉన్నాడని, ఆయనను విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.