తొర్రూరు, వెలుగు : ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో శుక్రవారం నిర్వహించిన పాలకుర్తి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ సభకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ హాజరుకావడంతో ఆ పార్టీలో జోష్ కనిపించింది. పాలకుర్తి క్యాండిడేట్ యశస్వినిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, యశస్వినిరెడ్డి కుటుంబం పేదల కోసం హాస్పిటల్స్ , లైబ్రరీలు, స్కూల్స్ నిర్మించడం అభినందనీయం అన్నారు.
యువతను ప్రోత్సహించాలని, యశస్విని రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ప్రియాంక గాంధీకి యశస్వినిరెడ్డి, ఝాన్సీరెడ్డి పట్టు చీరను బహూకరించారు. కార్యక్రమంలో హనుమాండ్ల రాజేందర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కాకిరాల హరిప్రసాద్, పెదగాని సోమయ్య, జాటోతు నెహ్రూనాయక్, ఎర్రబెల్లి రాఘవరావు, సుంచు సంతోష్, సోమ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఎర్రబెల్లికి బై బై చెప్పండి
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ పాలకుర్తి క్యాండిడేట్ యశస్వినిరెడ్డి కోరారు. మంత్రి దయాకర్ రావు పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఆయనకు బై బై చెప్పే టైం ఆసన్నమైందన్నారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నికల బరిలో నిలబడేందుకు ప్రయత్నించగా ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డుకున్నారని ఆరోపించారు. సాంకేతిక కారణాలతో పౌరసత్వాన్ని అడ్డుకున్నా వారసత్వాన్ని అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. తాము సంపాద కోసం రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకే బరిలో నిలిచామని స్పష్టం చేశారు.
బీఆర్ ఎస్ ను బొంద పెట్టాలి
అభివృద్ధి ముసుగులో రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు పేదల భూములను అక్రమిస్తున్నారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగినా విచారణ సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ లీడర్లపై సీబీఐ, ఈడీ ఆఫీసర్లను ఉసిగొల్పుతున్నారన్నారు. ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
దోపిడీని అడ్డుకోవాలి
బీఆర్ ఎస్ పాలనలో లక్షల కోట్ల విలువైన వనరులను దోపిడీ చేస్తున్నారని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ధరణిలోని లోపాలతో భూములను కబ్జా చేస్తున్నారన్నారు. ప్రజల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే భోగాలు అనుభవిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.