న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కావొచ్చని, కానీ ప్రజల కోసం పోరాటం చేయడం మాత్రం కొత్తేమీ కాదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వయనాడ్ లోక్ సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఒకరినొకరు ఎంతో గౌరవించుకునే, కష్టకాలంలో ఒకరికొకరు సాయం చేసుకునే వయనాడ్ ప్రజలకు సేవ చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం వయనాడ్ నుంచే మొదలవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇటీవలే వయనాడ్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రియాంక.. అక్కడి ప్రజలను ఉద్దేశించి శనివారం ఎమోషనల్ లెటర్ రాశారు.
తన అన్న రాహుల్ గాంధీని ఇన్నాళ్లూ ఆదరించారని, అన్న సూచన మేరకు తాను ఇక్కడి ప్రజలకు సేవ చేయాలనే ఎన్నికల బరిలో దిగానని పేర్కొన్నారు. వరదల టైమ్‌లో తాను చూసిన పరిస్థితులను కూడా రాసుకొచ్చారు. “వయనాడ్ వరదల విషాదం నా కండ్ల ముందు మెదులుతూనే ఉంది. నాడు అన్న రాహుల్‌తో కలిసి వయనాడ్‌లోని చూరల్‌మలా, మండక్కై ఏరియాలకు వెళ్లాను. బాధిత ప్రజలను చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు.
తలిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలు.. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు.. ఇప్పటికీ ఆవేదనకు గురిచేస్తూనే ఉన్నాయి. అలాంటి విపత్కర సమయంలో ఒకరికొకరు ప్రజలు సాయం చేసుకోవడం, మానవత్వాన్ని చాటిచెప్పడం నాకు ఎంతో నేర్పింది. మీ నుంచి ఇంకా నేర్చుకోవాలన్న కోరికతోనే ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచా. ఎన్నికల్లో పోటీ చేయడం నాకు కొత్తే కావొచ్చు.. కానీ, ప్రజల కోసం పోరాడటం మాత్రం పాతే. మీరు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు, వాటిని పరిష్కరించేందుకు నా శక్తి మేరకు శ్రమిస్తాను. ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను” అంటూ లేఖలో ప్రియాంక విజ్ఞప్తి చేశారు.