అమేథీ/రాయ్‌బరేలీ : కల్చర్ లేకుండా మాట్లాడడం బీజేపీ విధానమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. అమేథీ కాంగ్రెస్ అభ్యర్థి కిషోరీ లాల్ శర్మను తన “గుమాస్తా, ఫ్యూన్”గా పేర్కొంటూ సంస్కారహీనమైన కామెంట్లు చేయడం బీజేపీ మనస్తత్వాన్ని తెలియజేస్తున్నదని ఆమె అన్నారు. శుక్రవారం ఆమె అమేథీ, రాయ్ బరేలీలో మీడియాతో మాట్లాడారు. శర్మ తమ కుటుంబంలో ఒకరని, 40 ఏండ్లుగా అమేథీకి సేవ చేశారన్నారు. ఇక్కడ ప్రతి గ్రామంలో ఆయన తెలుసని పేర్కొన్నారు.
ఈ సీటుకు ఆయన కంటే మంచి అభ్యర్థి లేరని చెప్పారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, అమేథీలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడకుండా బీజేపీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నదని ప్రియాంక అన్నారు. ద్రవ్యోల్బణం నియంత్రణ, వ్యవసాయం బాగు చేయడం, ప్రజలకు ఉద్యోగ, ఉపాధి కల్పనపై మోదీ మాట్లాడడం లేదని విమర్శించారు. గత పదేండ్ల పాలనలో ఎంత మంది ప్రజల జీవితాలు బాగుపడ్డాయో ఆయన చెప్పడం లేదని విమర్శించారు.