న్యూఢిల్లీ: రాజకీయాలతోనే వయనాడ్ విపత్తు బాధితులకు కేంద్రం సాయాన్ని అందించడంలేదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో ఎటువంటి వివక్ష చూపకూడదని ఆమె తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో సహా కేరళకు చెందిన ఎంపీలు శనివారం పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. వయనాడ్ కు కేంద్రం సహాయ ప్యాకేజీని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రియాంక విలేకర్లతో మాట్లాడారు. “వయనాడ్ లో భారీ విపత్తు సంభవించింది.
అయినప్పటికీ, రాజకీయాల కారణంగానే కేంద్రం బాధితులకు పరిహారాన్ని ఇవ్వడానికి నిరాకరిస్తోంది. రాజకీయాలను పక్కనపెట్టి వారికీ సాయాన్ని అందించాలి’’ అని తెలిపారు. కాగా, వయనాడ్ విపత్తు సమయంలో నిర్వహించిన రెస్క్యూ కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.132.62 కోట్ల బిల్లులు చెల్లించాలని ఐఏఎఫ్ కోరింది. వయనాడ్ లో రెస్క్యూ ఆపరేషన్ కోసం రూ.69.65 కోట్లు కాగా, మిగతా మొత్తం 2018 వరదల నాటి బిల్లులు అని పేర్కొంది.
మోదీ స్పీచ్ మ్యాథ్స్ క్లాస్ విన్నట్టుంది..
లోక్ సభలో శనివారం ప్రధాని మోదీ స్పీచ్ బోర్ కొట్టిందని ప్రియాంక అన్నారు. ‘‘ప్రధాని స్పీచ్ విని కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లాను. స్కూల్ లో డబుల్ మ్యాథ్స్ పీరియడ్ లో కూర్చున్నట్టు అనిపించింది. నడ్డాజీ చేతులు పట్టుకుని కూర్చున్నారు. అమిత్ షా తలపై చెయ్యి పెట్టుకోగా, గోయల్ నిద్రపోయారు” అని అన్నారు.