తెలంగాణను ఎలా అభివృద్ది చేయాలో కాంగ్రెస్ కు ఓ విజన్ ఉందన్నారు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ. అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్‌లో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన విజయభేరి సభలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పక్కాగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రియాంక తెలిపారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను లూటీ చేశారని ఆరోపించారు ప్రియాంక గాంధీ. ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదన్నారు. ఉద్యోగ కల్పన జరగలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బీజేపీ ప్రశ్నించదని చెప్పారు. ధరణి పోర్టల్ తో కేసీఆర్ చాలా స్కామ్ లు చేశారని ఆరోపించారు.
కేంద్రంలోని మోదీ సర్కార్ కార్పోరేట్లకు రూణమాఫీ చేస్తుంది తప్ప.. రైతుల గురించి పట్టించుకోలేదన్నారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ , విపక్షాల నేతలే టార్గెట్ గా సీబీఐ, ఈడీలతో మోదీ దాడులు చేయిస్తారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒక్కటేనన్నారు ప్రియాంక. ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల పోటీ చేసే ఎంఐఎం తెలంగాణలో 9 చోట్ల మాత్రమే ఎందుకు పోటీ చేస్తోందని ప్రశ్నించారు.
ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా ఆమెకు నివాళులు అర్పించారు ప్రియాంక గాంధీ. గిరిజనులు, ఆదివాసుల కోసం ఇందిరాగాంధీ చాలా చేశారని చెప్పారు. ఇందిరాగాంధీ చనిపోయి 40 ఏళ్లు అయినప్పటికీ ఆమెను ప్రజలు ఇంకా బాగా ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే ఇందిరాగాంధీ రాజకీయాలు చేసేవారని ప్రియాంక తెలిపారు.