- చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం
- కేరళ సంప్రదాయ చీర ‘కసావు’ ధరించి హాజరు
- ప్రమాణం తర్వాత రాహుల్‌తో ప్రియాంక ఆత్మీయ ఆలింగనం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ లోక్ సభలో తొలిసారి అడుగుపెట్టారు. ఇటీవల జరిగిన వయనాడ్ ఉప ఎన్నికలో గెలిచిన ఆమె.. ఎంపీగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రియాంక కేరళ సంప్రదాయ చీర ‘కసావు’ ధరించి, చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని హిందీలో ప్రమాణం చేశారు. ఆమె ప్రమాణం చేస్తున్న టైమ్ లో ‘జోడో..జోడో.. భారత్ జోడో’ అంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ప్రియాంక తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, కొడుకు రైహాన్, బిడ్డ మిరయా హాజరయ్యారు. ప్రియాంక ప్రమాణం చేసిన తర్వాత తన అన్న రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్లి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ చీఫ్ఖర్గే ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, నాందేడ్ ఉప ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ లీడర్ రవీంద్ర చవాన్ కూడా ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన దేవుడి సాక్షిగా మరాఠీలో ప్రమాణం చేశారు.
కాంగ్రెస్‌లో ఫుల్ జోష్..
ప్రియాంక ప్రమాణస్వీకారం సందర్భంగా కాంగ్రెస్ నేతలు అందరూ హ్యాపీగా కనిపించారు. ప్రియాంకను చూస్తే గర్వంగా ఉందని సోనియా అన్నారు. ప్రియాంక పార్లమెంట్ లో ప్రజల గొంతుక అవుతుందని ఖర్గే పేర్కొన్నారు. ఆమె తన ఆశీర్వాదం తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అలాగే సోనియా, ప్రియాంకతో దిగిన ఫొటోను రాహుల్ తన వాట్సాప్ చానెల్ లో పోస్టు చేశారు. ప్రమాణస్వీకారానికి ముందు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులో ఎంపీలు అందరూ సమావేశమయ్యారు. ప్రియాంకకు విషెష్ తెలిపారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ, ఇతర ఎంపీలతో కలిసి ప్రియాంక లోక్ సభకు వెళ్లారు. ఆ టైమ్‌లో మెట్ల దగ్గర ప్రియాంకను రాహుల్ ఫొటో తీశారు.
చీరకట్టులో మెరిసిన ప్రియాంక..
ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ప్రియాంక గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కేరళ మహిళలు ధరించే సంప్రదాయ చీర ‘కసావు’ను కట్టుకున్నారు. క్రీమ్ కలర్, చుట్టూ బంగారు వర్ణమున్న చీరలో మెరిసిపోయారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ చూపించే రాజ్యాంగం కాపీ (బుక్)ని చేతిలో పట్టుకుని ప్రమాణం చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా, 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక.. ఐదేండ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. వయనాడ్ ఉప ఎన్నికలో బరిలోకి దిగిన ఆమె.. 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలిచారు. జనరల్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన 3,64,422 ఓట్ల మెజార్టీ కంటే ఎక్కువ
సాధించి ప్రియాంక గాంధీ రికార్డు సృష్టించారు.
పార్లమెంట్లో ముగ్గురు గాంధీలు..
పార్లమెంట్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. లోక్ సభకు ప్రియాంక రాకతో పార్లమెంట్లో గాంధీ కుటుంబసభ్యుల సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉండగా.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లోక్ సభ సభ్యులుగా ఉన్నారు.