ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యంలోనే పేదలకు భూములు దక్కాయని, గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ అన్నారు. ‘‘కాంగ్రెస్ హయాంలో ఐటీడీఏలు తీసుకొచ్చి ‘జల్.. జంగల్.. జమీన్’పై ఆదివాసీలకు హక్కులు కల్పించాం. యూపీఏ హయాంలో అటవీ హక్కుల చట్టం తెచ్చి, 7 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాం” అని చెప్పారు. ఆదివారం కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సభల్లో ప్రియాంక మాట్లాడారు.
‘‘ఇందిరా గాంధీ జయంతి రోజున ఆదివాసీ జిల్లాకు రావడం సంతోషంగా ఉంది. ఇందిరమ్మ ఎప్పుడూ పేదల కోసమే ఆలోచించేవారు. ఆమె మరణించి 40 ఏండ్లయినా ప్రజల హృదయాల్లో ఉన్నారు. హత్య జరిగిన సమయంలో ఇందిరా గాంధీ తెలంగాణ నుంచే ఎంపీగా ఉన్నారు” అని గుర్తు చేశారు. ‘‘మేం పాలిస్తున్న చత్తీస్‌గఢ్‌లో పేదరికం తగ్గించాం. అక్కడి మహిళలు సొంతంగా రూ. లక్ష నుంచి రూ.6 లక్షల వరకు సంపాదిస్తున్నారు. రాజస్థాన్‌లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకా లక్ష ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం” అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను చూసి, రాష్ట్రంలో ఆత్మబలిదానాలను ఆపేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని చెప్పారు.
కేసీఆర్ సర్కార్‌ను సాగనంపాలె..
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని ప్రియాంక అన్నారు. అమరుల త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ పదేండ్లలో పేద రైతులకు పోడు భూములు ఇవ్వలేదు. ఆయన యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. రాష్ట్రంలో యువతకు జాబ్స్ రావాలంటే కేసీఆర్, కేటీఆర్ జాబ్స్ పోవాలి. తెలంగాణ ప్రజలంతా చైతన్యంతో ఆలోచించి కేసీఆర్ సర్కార్‌ను సాగనంపాలి’’ అని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు మాత్రం సీఎం కేసీఆర్ అండ్ కంపెనీకి రాజకీయ ఉద్యోగాలు ఇవ్వవద్దని కోరారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్ మరిచారని, తాము అధికారంలోకి రాగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ఫ్లాన్ నిధులను మళ్లిస్తూ.. భూములు, లిక్కర్, మైనింగ్, సాండ్ మాఫియాతో దోపిడీ చేస్తున్న పాలకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు.
విరాట్లాగా ఏకాగ్రతతో ఆలోచించి ఓటెయ్యండి..
ప్రియాంక సభలో మాట్లాడే సమయానికి ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమయ్యే టైమ్ కావడంతో.. టీమిండియాకు ప్రియాంక ఆల్ ది బెస్ట్ చెప్పారు. ‘‘1983లో ఇందిరా గాంధీ జయంతి రోజునే టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు మళ్లీ 40 ఏండ్ల తర్వాత ఇందిరమ్మ జయంతి రోజునే వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది. మళ్లీ గెలుపు ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను ప్రత్యేకంగా గుర్తుచేసిన ప్రియాంక.. విరాట్ లాగా ఏకాగ్రతతో ఆలోచించి ఓటు వెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆ మూడు పార్టీలు ఒక్కటే..
బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రియాంక ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కాళేశ్వరం, మిషన్ భగీరథ , ఢిల్లీ లిక్కర్ అక్రమాల గురించి ప్రధాని మోదీ కనీసం మాట కూడా మాట్లాడటం లేదు. కేవలం కాంగ్రెస్ వాళ్లనే టార్గెట్ చేస్తున్నారు. ఈడీ, సీబీఐతో మా పార్టీ నేతలను మోదీ సర్కార్ వేధిస్తోంది. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే. వాళ్లకు ఎంఐఎం కూడా తోడైంది” అని విమర్శించారు. దేశంలో ఎక్కడెక్కడో యాభై, వంద స్థానాల్లో పోటీ చేసే ఎంఐఎం.. తెలంగాణలో కేవలం 9 స్థానాల్లో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘పదేండ్లు అన్యాయం చేసిన పాలకులకు గుణపాఠం చెప్పాలి. పోరాటాల గడ్డ, వీరుల భూమి నుంచి కాంగ్రెస్ విజయం మొదలుకావాలి’’ అని పిలుపునిచ్చారు.