UP Assembly Election 2022: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ క్రమంలో యూపీలో ఎన్నికల హడావుడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల కోసం వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ యూపీ ఎన్నికల్లో పోటీకి దిగనున్న 125 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కాంగ్రెస్ అభ్యర్థులకు సంబంధించిన ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేశారు. ఈ 125 మంది అభ్యర్థుల జాబితాలో 40 శాతం మహిళలు కాగా.. మరో 40 శాతం యువతకు అవకాశం కల్పించారు.  ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో యూపీ రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలను తీసుకురావాలని భావిస్తున్నామన్నారు.  ఈ ఎన్నికల పోటీలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశా సింగ్‌తో సహా 50 మంది మహిళలు ఉన్నారన్నారు ప్రియాంక. గౌరవ వేతనం పెంపు కోసం ఆందోళనకు నాయకత్వం వహించిన ఆశా వర్కర్ పూనమ్ పాండేని కూడా షాజహాన్‌పూర్ నుంచి పోటీకి నిలబెడుతున్నామని ఆమె పేర్కొన్నారు.

ఇక పోతే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవ‌లే  షెడ్యూల్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ సుశీల్ చంద్ర ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో..  ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియ‌నుంది. మొత్తం యూపీలో 400 కు పైగా అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3,  మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో వేగం పెంచాయి. ఈ ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:  

ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరి పోరాటమే

నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ