- ప్రచారం ముగిసేలోపు ప్రతి తలుపు తట్టేలా కసరత్తు
హైదరాబాద్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల ప్రచారం కొద్ది గంటల్లో ముగియనుండడంతో గ్యారంటీ కార్డుతో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. ఈ మేరకు పార్టీ క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేసింది. బూత్ స్థాయిలో ప్రతి తలుపు తట్టి ఆరు గ్యారంటీల కింద లబ్ధి పొందుతున్న ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ లీడర్లు, కార్యకర్తలు. ముఖ్యంగా మహిళా ఓట్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ భవన్ లోని వార్ రూం నుంచి ఎప్పటికప్పుడు నియోజకవర్గాల్లోని పార్టీ నాయకుల పనితీరును పరిశీలిస్తూ పార్టీ గెలుపు కోసం వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏఐసీసీ నుంచి అందుతున్న ఆదేశాలను వార్ రూం ద్వారా బూత్ స్థాయిలో పక్కాగా అమలు చేసేలా కార్యాచరణ చేపట్టారు. బూత్ స్థాయిలో ఏ ఒక్క ఓటరును కూడా మిస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆపైన ఉండే క్లస్టర్ ఇన్ చార్జీ ఎప్పటికప్పుడు బూత్ స్థాయి కార్యకర్తల పనితీరును పరిశీలిస్తున్నారు. బూత్ స్థాయిలో కొనసాగుతున్న ప్రచారం, ప్రజల స్పందన, గ్యారంటీ కార్డులతో జనంలోకి వెళ్తున్న తీరును అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, లోక్ సభ నియోజకవర్గాల ఇన్ చార్జీలు రోజూ వార్ రూంకు వివరిస్తున్నారు. దీన్ని వార్ రూం నుంచి ఏఐసీసీకి చేరవేస్తున్నారు. వార్ రూం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఏఐసీసీ నేతలు రాష్ట్రంలో ప్రచారం తీరుపై పీసీసీ నేతలను అప్రమత్తం చేస్తూ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అగ్ర నేతలు రాహుల్, మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో పర్యటించారు. సీఎం రేవంత్ గత 15 రోజులుగా రోజూ రెండు నుంచి మూడు సభలు, మూడు కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు.
నేడు రాష్ట్రానికి ప్రియాంక..
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం రాష్ట్రంలో తాండూరు, కామారెడ్డిలో ప్రచారం చేయనున్నారు. శనివారంతో ప్రచారానికి తెరపడనుండడంతో ఆమె టూర్ తోనే కాంగ్రెస్ తన ఎన్నికల క్యాంపెయిన్ కు ఫుల్ స్టాప్ వేయనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు తాండూరులో జరిగే జనజాతర సభలో, 3 గంటలకు కామారెడ్డి రోడ్ షోలో ప్రియాంక పాల్గొననున్నారు. ఆమెతో పాటుసీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.