Delhi Premier League 2024: భారత క్రికెటర్ తడాఖా.. 6 బంతుల్లో 6 సిక్సర్లు

Delhi Premier League 2024: భారత క్రికెటర్ తడాఖా.. 6 బంతుల్లో 6 సిక్సర్లు

6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. దిగ్గజ క్రికెటర్లు.. స్టార్ క్రికెటర్లకు సైతం ఈ రికార్డ్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కానీ ఇంకా క్రికెట్ ఓనమాలు నేర్చుకుంటున్న ప్రియాంష్ ఆర్య అలవోకగా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ యువ క్రికెటర్ ఈ ఘనతను సాధించాడు. దీంతో భారత క్రికెట్ లో యువరాజ్ సింగ్ తర్వాత ఆరు బంతులకు ఆరు సిక్సర్ల కొట్టిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా శుక్రవారం (ఆగస్టు 30) రాత్రి సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్జ్, నార్త్ ఢిల్లీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ లో సూపర్‌స్టార్జ్ తరపున ఆడుతున్న ప్రియాంష్.. స్పిన్నర్ మనన్ భరద్వాజ్‌ బౌలింగ్ లో ఈ ఫీట్ సాధించాడు. తొలి బంతిని లాంగాఫ్ దిశగా సిక్సర్ గా మలిచిన అతను.. ఆ తర్వాత వరుసగా మూడు సిక్సర్లు లాంగన్ దిశగా బాదేశాడు. ఐదో బంతిని స్ట్రైట్ సిక్సర్ గా.. చివరి బంతిని లాంగాఫ్ దిశగా ఆడాడు. 

ఈ మ్యాచ్ లో మొత్తం 39 బంతుల్లోనే సెంచరీ చేసుకున్న ప్రియాంష్.. 50 బంతుల్లో 120 పరుగులు చేసి ఔటయ్యాడు. అతనితో పాటు ఆయుష్ బదోని (165) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ఢిల్లీ సూపర్‌స్టార్జ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 308 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ తో ప్రియాంష్ ఆర్యకు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో భారీ ధర పలకడం ఖాయంగా కనిపిస్తుంది.