- 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడమే లక్ష్యం
- ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
- ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్/గద్వాల/కొల్లాపూర్/కొత్తకోట, వెలుగు: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం(పీఆర్ఎల్ఐ), మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల పరిశీలన, సమీక్షలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, ఆర్థిక, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన పర్యటించారు. జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన అనంతనం మీడియాతో మాట్లాడారు.
ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ ఉదండపూర్ రిజర్వాయర్ కింద ఆర్ అండ్ఆర్కు రూ.45 కోట్లు విడుదల చేయటం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో భూ సేకరణకు సంబంధించి రూ.3.74 కోట్లు, ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి రూ.2.6 కోట్లు, ఉదండాపూర్‌లోని నిర్మాణాలకు రూ.13 కోట్లు పెండింగ్ ఉన్నాయన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పీఆర్ఎల్ఐని పట్టించుకోలేదన్నారు. ఉదండాపూర్, కర్వెన పూర్తయితే కర్వెన ద్వారా 2.5 లక్షల ఎకరాలకు, ఉదండాపూర్ ద్వారా 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రభుత్వం వీటి పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
భూ బాధితుల ఆందోళన..
మీడియా పాయింట్ వద్ద ఉదండాపూర్ భూ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రూ.25 లక్షల పరిహారం ఇప్పిస్తామని చెప్పి, రూ.16 లక్షల పరిహారం మంజూరు చేయడంపై మండిపడ్డారు. పనులను అడ్డుకుంటామని, పూర్తి పరిహారం చెల్లించాకే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. స్పందించిన జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడుతూ కొందరు రైతుల పేర్ల మీద అసైన్డ్ భూములు పట్టాలు ఎలా అయ్యాయని ప్రశ్నించారు.
రిజర్వాయర్ కింద వారు కూడా భూ పరిహారం పొందారన్నారు. దీనిపై విచారణ చేయిస్తామన్నారు. కొందరు రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే ఆందోళన చేస్తున్నారని ఎమ్మెల్యే మండి పడ్డారు. అంతకుముందు మంత్రులు ఉదండాపూర్ ఆర్అండ్ఆర్ కేంద్రంలో రూ.12.97 కోట్లతో నిర్మించనున్న 4.2 కిలోమీటర్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
గట్టు లిఫ్ట్ ను విస్తరిస్తాం..
ర్యాలంపాడు రిజర్వాయర్ కు రిపేర్లు చేయిస్తామని, గట్టు లిఫ్ట్ విస్తరించి తెలంగాణలోని గట్టు మండలానికి సాగునీరు ఇవ్వడంతో పాటు కర్నాటకకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తామని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను పరిశీలించారు. ర్యాలంపాడ్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచడం, లీకులకు రిపేర్లు చేస్తామన్నారు. గట్టు లిఫ్ట్‌ను 10 టీఎంసీలకు పైగా స్టోరేజీ కెపాసిటీ పెంచేందుకు డీపీఆర్ సిద్ధం చేసి సీఎం ఆమోదంతో పనులు చేపడతామన్నారు.
అందరికీ న్యాయం చేస్తా..
శంకరసముద్రం రిజర్వాయర్ ముంపు గ్రామంలోని అర్హులందరికీ న్యాయం చేస్తానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మండలంలోని శంకర సముద్రం రిజర్వాయర్‌ను పరిశీలించారు. శంకర సముద్రం రిజర్వాయర్ ముంపు గ్రామమైన కానాయపల్లి గ్రామస్తులు గొప్ప మనసుతో భూమిని ఇచ్చి రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించారన్నారు.
నిర్వాసితులను, పెండింగ్ పనులను పూర్తి చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. మిగిలిన పనులు పూర్తి చేసి రైతులకు సాగునీటిని అందిస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణ రావు, సాగు నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ(జనరల్) అనిల్ కుమార్ పాల్గొన్నారు.