
- రికార్డు స్థాయిలో కోటిపైనే పలికిన 8 మంది
- రూ. 2.15 కోట్లతో సచిన్ టాప్
- రెండు రోజుల వేలంలో 118 మందికి అవకాశం
ముంబై : పల్లె ఆటకు పట్టం కట్టి.. అభిమానులను విశేషంగా అలరిస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించింది. పీకేఎల్ 11వ సీజన్ వేలంలో ఇద్దరు రెండు కోట్లు అందుకోగా.. రికార్డు స్థాయిలో మొత్తంగా ఎనిమిది మంది ఓవర్‌నైట్‌లో కోటీశ్వరులయ్యారు. గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు జరిగిన వేలంలో సచిన్ తన్వర్ రూ. 2.15 కోట్ల మొత్తంతో టాప్ లేపాడు. కేటగిరి–ఎలో రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో వేలంలోకి వచ్చిన సచిన్ కోసం పలు ఫ్రాంచైజీలు పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు భారీ మొత్తంతో తమిళ్ తలైవాస్ జట్టు అతడిని సొంతం చేసుకుంది.
ఇరాన్‌కు చెందిన స్టార్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ రెజా షాల్దోయి చియనేకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. తనను రూ. 2.07 కోట్లకు హర్యానా స్టీలర్స్ సొంతం చేసుకుంది. దాంతో లీగ్‌లో అత్యధిక ధర పలికిన ఫారిన్ ప్లేయర్‌గా అతను రికార్డులకెక్కాడు. గుమన్ సింగ్ ( గుజరాత్ జెయింట్స్– రూ.1.97 కోట్లు) కూడా రెండు కోట్ల మార్కుకు సమీపించాడు. రూ. 20 లక్షల ప్రాథమిక ధర కేటగిరీ–బి నుంచి వేలంలోకి వచ్చిన భరత్ రూ. 1.30 కోట్లు (యూపీ యోధాస్) అందుకున్నాడు.
బి- కేటగిరీలో అజిత్‌కు భారీ రేటు
తొలి రోజు కేటగిరీ–ఎ, బి ప్లేయర్లు జాక్‌పాట్ కొట్టగా.. రెండో రోజు రూ. 13 లక్షలు ప్రాథమిక ధరతో కూడిన కేటగిరీ–సిలోని ఆటగాళ్లపైనా ఫ్రాంచైజీలు భారీ మొత్తం వెచ్చించాయి. అజిత్ కుమార్ ను పుణెరి పల్టాన్ రూ. 66 లక్షలకు కొనుగోలు చేసింది. దాంతో అతను కేటగిరీ–సి టాపర్‌గా నిలిచాడు. జై భగవాన్ కోసం బెంగళూరు బుల్స్ రూ. 63 లక్షలు ఖర్చు చేసింది.
కేటగిరి–డి (ప్రాథమిక ధర రూ. 9 లక్షలు) నుంచి అర్జున్ రథీ అత్యధికంగా రూ. 41 లక్షలు (బెంగాల్ వారియర్స్) పలికాడు. మొత్తంగా 2 రోజుల వేలంలో 12 ఫ్రాంచైజీలు రూ. 33.7 కోట్లు ఖర్చు చేసి118 మంది ఆటగాళ్లను తమ జట్లలోకి తీసుకున్నాయి. వేలం కోసం ప్రతీ ఫ్రాంచైజీకి రూ.5 కోట్లు కేటాయించారు.
పవన్ మళ్లీ టైటాన్స్‌కే
పీకేఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పవన్ సెహ్రావత్ మరోసారి తెలుగు టైటాన్స్‌కే ఆడనున్నాడు. గత సీజన్‌లో భారీ అంచనాలతో టైటాన్స్ జట్టులోకి వచ్చిన సెహ్రావత్ అద్భుతంగా ఆడినా.. కెప్టెన్‌గా జట్టుకు మాత్రం సక్సెస్ అందించలేకపోయాడు. వేలానికి మందు అతడిని రిలీజ్ చేసిన తెలుగు ఫ్రాంచైజీ రూ. 1.725 కోట్లతో అతడిని ఎఫ్‌బీఎం కింద తిరిగి సొంతం చేసుకుంది.
కొత్తగా డిఫెండర్ క్రిషన్‌ను జట్టులోకి తీసుకుంది. అతని కోసం రూ. 70 లక్షలు ఖర్చు చేసింది. మొత్తంగా తొమ్మిది మందిని వేలంలో కొనుగోలు చేసిన టైటాన్స్.. ఆరుగురిని రిటైన్ చేసుకుంది. టైటాన్స్ ఖాతాలో మరో రూ. 31.44 లక్షలు మిగిలున్నాయి.
తెలుగు టైటాన్స్ జట్టు : పవన్ సెహ్రావత్ (ఆల్ రౌండర్ -రూ. 1.725 కోట్లు), క్రిషన్ (డిఫెండర్- 70 లక్షలు), విజయ్ మాలిక్ (ఆల్ రౌండర్ -20 లక్షలు), మిలాద్ జబ్బరి (డిఫెండర్-13 లక్షలు), మొహమ్మద్ మలక్ (డిఫెండర్- 13 లక్షలు), సుందర్ (డిఫెండర్- 13 లక్షలు), మంజీత్ ( రైడర్- 27 లక్షలు), ఆశిష్ నర్వాల్ (రైడర్-13 లక్షలు), అమిత్ కుమార్ (ఆల్ రౌండర్ -9 లక్షలు).
రిటైన్ చేసుకున్న ప్లేయర్లు : శంకర్ గడై (ఆల్ రౌండర్ ), అజిత్ పవార్ (డిఫెండర్), అంకిత్ (డిఫెండర్), ఓంకార్ పాటిల్ ( రైడర్ ), ప్రఫుల్ జవారే ( రైడర్ ), సంజీవి (ఆల్ రౌండర్ ).