గర్భిణి మృతిపై అధికారుల బృందం ఎంక్వైరీ

గర్భిణి మృతిపై అధికారుల బృందం ఎంక్వైరీ

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్ణణంలోని బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యంతో గర్భిణి సరిత అలియాస్​ పుష్పలత(22) మృతిపై రాష్ట్ర అధికార బృందం విచారణ చేపట్టింది. జులై 29న ‘వెలుగు’ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన కలెక్టర్​ ఆదర్శ్  సురభి విచారణకు ఆదేశించారు. బుధవారం డిప్యూటీ డీఎంహెచ్​వో శ్రీనివాసులు, మాస్​ మీడియా ఆఫీసర్​ చంద్రయ్య హాస్పిటల్​ యాజమాన్యానికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. 

రాష్ట్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్​ మెటర్నల్  డెత్  కింద కేసు నమోదు చేసి గర్భిణి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని పెబ్బేరుకు పంపించారు. వారు హాస్పిటల్​ను సందర్శించి గర్భిణి వివరాలను సేకరించారు. ఆమె హాస్పిటల్​కు ఎన్ని సార్లు వచ్చింది? ఏ మందులు, ఇంజక్షన్లు వాడారు? ట్రీట్​మెంట్​ చేసిన నర్సుల వివరాలను తెలుసుకున్నారు. కర్నూల్​ తీసుకెళ్లిన అంబులెన్స్​ డ్రైవర్, మృతురాలి కుటుంబసభ్యులతో మాట్లాడారు. 

కర్నూల్​లోని కిమ్స్​ హాస్పిటల్​కు వెళ్లి విచారణ జరుపుతామని పేర్కొన్నారు. పోస్టుమార్టం చేసిన ఆసుపత్రి రిపోర్టులు సేకరించి సరిత మృతికి గల కారణాలతో రూపొందించిన నివేదికను సీడబ్ల్యూఎఫ్​ కమిషనర్​ కర్ణన్​కు అందజేస్తామని డాక్టర్​ కిరణ్మయి తెలిపారు. ప్రోగ్రామింగ్​ ఆఫీసర్లు మంజుల, రాజశేఖర్, హెల్త్​ సూపర్​వైజర్​ నర్సింగరావు, డీడీఎం గిరిజ పాల్గొన్నారు.