Cotton cultivation: పత్తి పంటలో రసం పీల్చే పురుగులు.. నివారణ పద్దతులు ఇవే..

Cotton cultivation: పత్తి పంటలో రసం పీల్చే పురుగులు.. నివారణ పద్దతులు ఇవే..

 పత్తిని ఆశించే వివిధ రకాల చీడపీడల్లో రసం పీల్చు పురుగులు ముఖ్యమైనవి. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో.. మారుతున్న వాతావరణంతో ఆధారితమై, పత్తి పంటను ఆశించి దిగుబడుల పై   పురుగులుప్రభావం చూపుతున్నాయి. దీంతో పత్తి పంట తెగుళ్ల బారిన పడుతుంది.  వ్యవసాయ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పత్తి పంటను తెగుళ్ల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. . .

పచ్చ దోమ

 సాధారణంగా ఎక్కువ వర్షపాతం, తక్కువ ఉష్ణోగ్రతలు, మబ్బులతో కూడుకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముంది. పిల్ల, తల్లి పురుగులు ఆకుల మీద అడ్డంగా నడుస్తూ, ఆకుల అడుగు భాగానికి చేరి రసాన్ని పిలుస్తాయి. దీని వల్ల ఆకులు మొదట దోనెలుగా ముడుచుకొని,లేత పసుపు రంగులోకి మారి ఆ తరువాత ఆకుల అంచుల నుంచి ఎర్రబడి క్రమంగా ఎండిపోతాయి.మొక్కల ఎదుగుదల కుంటుపడుతుంది.

  •  తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారి చేయకుండా సులువుగా కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి. పంట 30, 45 రోజుల దశలో ఉన్నప్పుడు మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో మరియు 60 రోజుల దశలో ఇమిడాక్లోప్రిడ్, నీరు లేదా ఫ్లోనికామిడ్ నీరు 1:20 నిష్పత్తిలో కలిపి కాండానికి పూయాలి.
  • సస్యరక్షణలో భాగంగా మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ.లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫ్లోనికామిడ్ 0.3 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా డైఫెన్ థయూరాన్ 1.25 గ్రా. లేదా సల్ ఫాక్సాఫ్లోర్ 0.75 మి.లీ./ లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
  •  జీవ రసాయనాలైన 5 శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం) 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పేనుబంక పురుగు

పేను బంక పురుగు సాధారణంగా బెట్ట వాతావరణంలో, వానాకాలంలో ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముంది.  వర్షానికి- వర్షానికి మధ్య వచ్చే బెట్ట కాలంలో పంటపై ఎక్కువగా ఆశిస్తుంది. పిల్ల, తల్లి పురుగులు మొక్క లేత కొమ్మలు, ఆకుల అడుగు భాగాల నుంచి రసాన్ని పీలుస్తాయి.దీని వల్ల ఆకులు దోనెలుగా మారి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. పేను బంక  పురుగు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీనివల్ల మొక్కల ఆకులపై, కాండంపైన నల్లని బూజు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ తగ్గుతుంది.

  •  కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి.తొలిదశలో వేప గింజల కషాయం 5శాతం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం) 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  •  అవసరాన్ని బట్టి, పురుగు ఉధృతి దృష్టిలో ఉంచుకొని సస్యరక్షణలో భాగంగా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా. లేదా సల్ ఫాక్సాఫ్లోర్ 0.75 మి.లీ./ లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.

తామర పురుగులు

సాధారణంగా వర్షాలు తక్కువగా ఉండి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న వాతావరణంలో తామర పురుగులు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముంది. పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, ఆకులను గీకి రసాన్నిపీలుస్తాయి. దీని వల్ల ఆకులు ముడుచుకొని పెలుసుగా మారుతాయి. పత్తిలో తలమాడు తెగులు (టొబాకో స్ట్రీక్ వైరస్) తామర పురుగుల వల్ల వ్యాప్తి చెందుతుంది.

ALSO READ | వర్షాలకు  ఉద్యాన పంటలకు తెగుళ్లు.. .. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే

  •  తొలి దశలో 5శాతం వేప గింజల కషాయం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం) 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అవసరాన్ని బట్టి, పురుగు ఉధృతి దృష్టిలో ఉంచుకొని ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా ఫిప్రోనిల్ 2 మి.లీ.లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ. లేదా డైఫెన్ థయూరాన్ 1.25 గ్రా. లేదా స్పైనటోరం 0.9 మి.లీ. లేదా థయోమిథాక్సామ్ 0.2 గ్రా./ లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.
  • పంటలో తామర పురుగుల ఉధృతి తగ్గించుకోవడానికి ఎకరానికి 10 చొప్పున నీలి రంగు జిగురు అట్టలు అమర్చాలి.

తెల్ల దోమ

తెల్ల దోమ ఎక్కువగా సెప్టెంబర్  నుంచి ఫిబ్రవరి మాసం వరకు ఉధృతి ఎక్కువగా ఉండి, పత్తిని పిందె,కాయ దశలలో ఎక్కువగా ఆశిస్తాయి. పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పిలుస్తాయి. దీని వల్ల ఆకులు పచ్చదనం కోల్పోయి,మచ్చలు ఏర్పడి, పూర్తిగా పెరగకుండా ముందే రాలిపోతాయి. తెల్ల దోమ విసర్జించే తేనె వంటి జిగుట పదార్థం వల్ల కిరణజన్య సంయోగ క్రియకు ఆటంకం ఏర్పడుతుంది. దూది నాణ్యత తగ్గిపోతుంది.మొక్కలు గిడసబారి పూమొగ్గలు, పూలు, కాయలు రాలి, కాయలు తయారు కాకుండానే విచ్చుకుంటాయి.

  •  కాండానికి మందు పూసే పద్ధతి పాటించాలి.తొలిదశలో వేప గింజల కషాయం 5శాతం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం) 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.తొలి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్, ఆర్గానోఫాస్ఫెట్ మందులను విచ్చలవిడిగా పిచికారిచేయకూడదు.
  •  అవసరాన్ని బట్టి పురుగు ఉధృతి దృష్టిలో పెట్టుకుని ఫిప్రోనిల్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా.లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మి.లీ.లేదా డైఫెన్ థయూరాన్ 1.25 గ్రా.లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రా. లేదా సల్ ఫాక్సాఫ్లోర్ 0.75 మి.లీ./ లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.

పిండి నల్లి కీటకం

పిండి నల్లి సాధారణంగా అధిక ఉష్ణోగ్రత, వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముంది. పిండి నల్లి గాలి, చీమలు, నీటిపారకము, వర్షాలు, పక్షులు, మనుషులు, పశువుల ద్వారా ఒకచోట నుంచి మరొక చోటికి వ్యాపిస్తాయి. పిల్ల పురుగులు లేత పసుపు రంగుతో కూడిన తెలుపు రంగులో, తల్లి పురుగులు రెక్కలు లేకుండా శరీరమంతా మైనపు పూత కలిగిన వెంట్రుకలతో కప్పి ఉంటాయి. పురుగులు తేనె వంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల నల్ల బూజు తెగులు ఆశిస్తుంది.ఈ పురుగులు ఆకు తొడిమెలు, ఆకులు, పూత కాయల నుంచి రసాన్ని పిలుస్తాయి.దీనివల్ల ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి, పూత, పిందె రాలుతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే మొక్కలు పూర్తిగా ఎండిపోతాయి.

  •  తొలి దశలో వేప గింజల కషాయం 5శాతం లేదా వేప నూనె (1500 పి.పి.ఎం) 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • అవసరాన్ని బట్టి, పురుగు ఉధృతి దృష్టిలో పెట్టుకొని సస్యరక్షణలో భాగంగా ప్రోఫెనోపాస్ 3 మి.లీ. లేదా ఎసిఫేట్ 2 గ్రా.+ సోండోవిట్ లాంటి జిగురు మందులను 1 మి.లీ./ లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచేటట్లుగా పిచికారి చేయాలి.ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలు అమర్చాలి.

ఎర్రనల్లి పురుగు

ఎర్రనల్లి బెట్ట పరిస్థితులు, పంట పిందె, కాయ దశలో ఉన్నప్పుడు ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశముంటుంది. పిల్ల, తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి సాలీడు గూడులో అల్లిక చేసి ఆకుల నుంచి రసాన్ని పిలుస్తాయి.దీని వల్ల ఆకులపై పసుపు పచ్చని మచ్చలు ఏర్పడతాయి. ఆకు మధ్య భాగం నుంచి ఎరుపుగా మారి ఎండిపోతుంది.

  • పంట తొలి దశలో సింథటిక్ పైరిథ్రాయిడ్, నియో నికోటినాయిడ్ మందులను విచ్చలవిడిగా పిచికారి చేయకూడదు.
  • అవసరాన్ని బట్టి, పురుగు ఉధృతి దృష్టిలో పెట్టుకోని సస్యరక్షణ మందులైన నీటిలో కరిగే గంధకము 3 గ్రా.లేదా స్పైరోమెసిఫెన్ 1 మి.లీ. లేదా డైకోఫాల్ 5 మి.లీ./ లీటరు నీటికి కలిపి మందులను మారుస్తూ పిచికారి చేయాలి.

రసం పీల్చే పురుగుల నివారణకు కొన్ని జాగ్రత్తలు

  •  నత్రజని ఎరువులను విచ్చలవిడిగా వాడకుండా సరైన మోతాదులోనే వాడాలి.
  • తొలి దశలో విచ్చలవిడిగా రసాయన మందులను వాడకుండా, కాండానికి మందు పూసే పద్ధతిని పాటించాలి.
  •  తొలి దశలో వేప సంబంధిత మందులను పిచికారి చేయాలి.
  •  వయ్యారిభామ, తుత్తర బెండ లాంటి కలుపు మొక్కలను చేను చుట్టూ లేకుండా చూసుకోవాలి. పంటలను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
  •  ఒకే గ్రూపుకు చెందిన పురుగు మందులను ఎక్కువసార్లు వాడకుండా వేరువేరు గ్రూపులకు సంబంధించిన పురుగు మందులను మార్చి మార్చి పిచికారి చేయాలి.
  • ఈ విధంగా ఎలాంటి రసం పీల్చే పురుగులు పంటను ఆశించాయో గుర్తించి, సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే పురుగుల ఉధృతి తగ్గించుకొని మంచి దిగుబడులు, నికర ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.