సీతారామకు తొలగిన  చైనా ఇంజినీర్ల సమస్య..!

సీతారామకు తొలగిన  చైనా ఇంజినీర్ల సమస్య..!
  • పంప్​హౌస్​కు  చేరుకున్న చైనా ఇంజినీర్​
  • ఒకటి రెండు రోజుల్లో రానున్న  మరో ముగ్గురు  
  •  ఈనెల 30న పూసుగూడెం  పంప్​హౌస్​ ట్రయల్​ రన్
  • ఆగస్టు 9న కమలాపురం  పంప్​ హౌస్ ట్రయల్ రన్​కు ప్లాన్​ 

ఖమ్మం, వెలుగు:  సీతారామ ప్రాజెక్టు పంప్​హౌస్​ ట్రయల్​రన్​ కోసం రాలేక ఆగిపోయిన చైనా ఇంజినీర్ల సమస్య పరిష్కారమైంది. ఆపరేషన్స్ కోసం ఓ ఇంజినీర్​ఇప్పటికే చేరుకోగా, మరో ముగ్గురు ఒకటి రెండు రోజుల్లో రాబోతున్నారు.  ట్రయల్​ రన్​ సందర్భంగా మోటార్ల ప్రారంభం కోసం చైనా నుంచి ఇంజినీర్లు అనుకున్న సమయానికి రాకపోవడంతో, ఈనెల రెండోవారంలో ప్లాన్​ చేసిన రెండో పంప్​హౌస్​ ట్రయల్​ రన్​ వాయిదా పడింది. దీంతో నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి.

ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి, ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్​బొజ్జా ద్వారా విదేశీ వ్యవహారాల శాఖతో మాట్లాడి చైనా ఇంజినీర్లకు వీసా సమస్యను పరిష్కరించారు. దీంతో మంగళవారం నలుగురిలో ఓ చైనా ఇంజనీర్​రెండో పంప్​ హౌస్​ ఉన్న పూసుగూడెం చేరుకున్నాడు. మరో ముగ్గురు ఒకటి రెండు రోజుల్లో రానున్నారు. ఈనెల 30న పూసుగూడెం పంప్​హౌస్​, వచ్చే నెల 9న కమలాపురం పంప్​హౌస్​  ట్రయల్​ రన్​ చేసేందుకు షెడ్యూల్​ ఫిక్స్​ చేశారు. గత నెల 27న బీజీ కొత్తూరులో ఉన్న మొదటి పంప్​ హౌస్​ను విజయవంతంగా ట్రయల్​ రన్​ నిర్వహించారు. 

చెల్లింపులు చేయకపోవడంతోనే...

సీతారామ ప్రాజెక్ట్  నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు, సబ్​ కాంట్రాక్టర్లు చైనాకు చెందిన సాంకేతిక సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం చెల్లింపులు చేయకపోవడంతో గత రెండేండ్లలో  ఒక్కసారి కూడా చైనా ఇంజినీర్లు రాష్ట్రాన్ని సందర్శించలేదు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విషయాన్ని ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉత్పల్ ద్వారా విదేశీ మంత్రిత్వ శాఖకు చేరవేశారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడమే కాకుండా చైనా సాంకేతిక బృందానికి వీసా మంజూరు కోసం ఇరు దేశాలకు చెందిన ఎంబసీ అధికారులతో రెండు నెలల నుంచి సమన్వయం చేసుకుంటూ ఇంజినీర్లను రప్పించడంలో తుమ్మల సక్సెస్​ అయ్యారు.

ALSO READ :ఆపరేషన్ ‘కగార్’ను వెంటనే ఆపాలి

దీంతో ఓ ఇంజినీర్​ఇప్పటికే చేరుకోగా మరో ముగ్గురు ఒకటి రెండు రోజుల్లో వచ్చి ప్రాజెక్టును పర్యవేక్షించనున్నారు. అనుకున్న ప్రకారం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో పంపుహౌస్ లతో పాటు, వైరా లింక్ కెనాల్ పనులు పూర్తి చేసి ఈ వానాకాలంలో వైరా రిజర్వాయర్​కు గోదావరి జలాలు లిఫ్ట్ చేసేలా అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తయ్యేలా నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీసా సమస్య పరిష్కారానికి కృషిచేసిన అధికారులకు మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు.

సీతారామ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ పనులు ఈనెల 30లోగా పూర్తి చేసి, ఏన్కూర్ లింక్​ కెనాల్(18ఎల్​) ద్వారా సాగు నీరు వైరా రిజర్వాయర్​కు సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని తుమ్మల చెప్పారు. అలాగే, డిస్ట్రిబ్యూటరి కెనాల్ పనులకు అడ్డంగా జీఐటీఎల్ ​సంస్థకు చెందిన గ్యాస్ పైపులైన్​ కాలువను దాటుతున్నదని, కాబట్టి గ్యాస్ పైపులైను క్రాసింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీలను కోరినట్లు తుమ్మల తెలిపారు.