భైంసా మున్సిపల్​లో డిజిటల్ కీ కష్టాలు

భైంసా మున్సిపల్​లో డిజిటల్ కీ కష్టాలు
  • దరఖాస్తు చేసుకోని ఇన్​చార్జి కమిషనర్
  • నెల రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ

భైంసా, వెలుగు: నిర్మల్​జిల్లా భైంసా మున్సిపాలిటీలో డిజిటల్ ‘కీ’ కష్టాలు నెల రోజులుగా వెంటాడుతున్నాయి. ఈ ‘కీ’ లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక్కడి మున్సిపల్ కమిషనర్​ వెంకటేశ్వర్​రావు గత నెల 22న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఇన్​చార్జి​ కమిషనర్​గా డీఈ సీహెచ్​ సుదర్శన్​ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన డిజిటల్​ కీ కోసం దరఖాస్తు చేసుకోకపోవడంతో ఎక్కడికక్కడ పనులు పెండింగ్​లో ఉన్నాయి.

బాధ్యతలపై అనాసక్తి..!

డైరెక్టర్​ఆఫ్​ మున్సిపల్​అడ్మినిస్ట్రేటివ్​ఉత్తర్వుల మేరకు ఇన్​చార్జిగా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ రెడ్డి.. డిజిటల్​‘కీ’ కోసం దరఖాస్తు చేసుకునేందుకు విముఖత చూపినట్లు తెలిసింది. ఈ బాధ్యతలను సైతం నిర్వహించేందుకు అనాసక్తితో ఉన్నట్లు సమాచారం. అయితే, మూడ్రోజుల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆధార్, పాన్​ కార్డులో అక్షర దోషాలు ఉండడంతో తిరస్కరణకు గురైనట్లు చెబుతున్నారు. ఈ అక్షర దోష సవరణ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 15 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

తప్పని ఇబ్బందులు..

నెల రోజులుగా డిజిటల్​‘కీ’ లేని కారణంగా మున్సిపల్​ఆఫీస్​లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర పత్రాలు, మ్యూటేషన్​ ప్రక్రియ జారీ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో రోజుకు కనీసం 15 మందికి పైగా శిశువులు జన్మిస్తారు. వీరందరి కుటుంబ సభ్యులు ఆన్​లైన్​లో బర్త్​ సర్టిఫికెట్లు దరఖాస్తు చేసుకున్నారు.  దీంతో ప్రతి రోజు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు ఆఫీస్​ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీటితో పాటు ట్రేడ్​ లైసెన్స్​ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు సైతం మున్సిపల్ చుట్టూ​ చక్కర్లు కొడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్​ కమిషనర్​తో పాటు డిజిటల్​‘కీ’ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.