
- ఆక్రమణలతో కుచించుకుపోయిన నాలా
- నాలుగు రోజులుగా ఉధృతంగా నీటి ప్రవాహం
- ఏండ్లు గడుస్తున్నా డెవలప్‌మెంట్ ఊసెత్తని లీడర్లు
- కాగితాలకే పరిమితమైన రూ.156 కోట్ల ప్రపోజల్స్
హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ పరిధిలోని బొందివాగు నాలా కారణంగానే ముంపు సమస్య తీవ్రమవుతోంది. వర్షాలు పడినప్పుడల్లా నాలా ఉప్పొంగి సమీప కాలనీలన్నింటినీ ముంచెత్తుతోంది. ఇటీవల భద్రకాళి చెరువుకు గండి పడడానికి కూడా ఓ రకంగా ఈ నాలానే కారణమైంది. ఆక్రమణల కారణంగా నాలా కుచించుకుపోవడంతో కొద్దిపాటి వర్షం పడినా బొందివాగు నీళ్లన్నీ హంటర్ రోడ్డు ఏరియాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా ఇక్కడి ప్రజలంతా పునరావాస కేంద్రాల బాట పట్టాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. బొందివాగు నాలాను డెవలప్ చేస్తామన్న లీడర్ల హామీలు మాటలకే పరిమితం కాగా.. ఆఫీసర్లు పంపించిన ప్రపోజల్స్ సర్కార్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నాలా అభివృద్ధికి నోచుకోక వరంగల్ సిటీ ముంపు బారిన పడుతోంది.
ఆక్రమణలతో అష్ట వంకర్లు
గ్రేటర్ పరిధిలో వరద నీరు పారేందుకు ప్రధానంగా మూడు నాలాలున్నాయి. ఇందులో హనుమకొండ ప్రాంతంలో నయీంనగర్ నాలా, వరంగల్‌లో బొందివాగు, భద్రకాళి నాలాలు ముఖ్యమైనవి. వరంగల్ ప్రాంతంలో తిమ్మాపూర్, కొండపర్తి, అమ్మవారిపేట, భట్టుపల్లి, రంగశాయిపేట బెస్తం చెరువు తదితర చెరువుల నుంచి వచ్చే వరద బొందివాగు గుండానే ప్రవహిస్తుంటుంది. ఉర్సు రంగసముద్రం నుంచి దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ నాలా రెండు వైపులా ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఉర్సుచెరువు నుంచి వరంగల్ రైల్వే ట్రాక్ వరకు మొత్తం వంకరటింకరగా మారింది. నాలాను ఆనుకునే కొంతమంది వెంచర్లు ఏర్పాటు చేయగా, ఇంకొందరు బిల్డింగులే కట్టారు. ఇదిలా ఉంటే వర్షాకాలం వచ్చినా బొందివాగులో పూడికతీతపై పెద్దగా శ్రద్ధ పెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. డీసిల్టేషన్‌కు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న లీడర్లు, ఆఫీసర్లు పనులు మాత్రం తూతూమంత్రంగా పూర్తిచేశారని పలువురు ఆరోపిస్తున్నారు. ఓ వైపు ఆక్రమణలు, మరోవైపు పూడికతో నాలా అస్తవ్యస్తంగా మారి వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
రూ.156 కోట్ల పనులు సర్కారు వద్దే పెండింగ్
వరంగల్ నగరంలోని నాలాలు 10 నుంచి 12 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేవు. దీంతో కొద్దిపాటి వరదొచ్చినా పొంగిపొర్లుతున్నాయి. బొందివాగు నాలాను భద్రకాళి చెరువు వరకు 20 మీటర్ల మేర విస్తరించేందుకు ఇరిగేషన్, గ్రేటర్ ఇంజినీరింగ్ ఆఫీసర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. పైనుంచి వచ్చే వరదను నియంత్రించడానికి రామన్నపేట, గ్రీన్ వుడ్ స్కూల్సమీపంలో రెండు చోట్ల ఇన్ ఫ్లో రెగ్యులేటర్లు, అలంకార్వైపు ఔట్‌ఫ్లో రెగ్యులేటర్ నిర్మించాలని ప్రతిపాదించారు. అనంతరం పద్మాక్షి టెంపుల్ వైపు కూడా మరో ఇన్ ఫ్లో రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులన్నింటికీ దాదాపు రూ.142 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఆ తర్వాత పలు సవరణలతో ఏడాదిన్నర కిందట రూ.156 కోట్లతో రీప్రపోజల్స్ పంపారు. కానీ ఆయా పనులకు ఇప్పటివరకు సర్కారు ఆమోద ముద్ర వేయకపోవడంతో బొందివాగు విస్తరణ, బఫర్ జోన్ల ఏర్పాటు, ప్రొటెక్షన్ వాల్స్నిర్మాణం కాగితాలకే పరిమితమైంది.
కేటీఆర్ ఉత్తుత్తి ఆదేశాలు
2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలమైంది. రోడ్లు, డ్రైనేజీలు, ఇండ్లు దెబ్బతిని పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. దీంతో మంత్రి కేటీఆర్, స్థానిక మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, లోకల్ ఎమ్మెల్యేలు అంతా కలిసి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. చెరువుల గొలుసుకట్టు తెగడం, నాలాల ఆక్రమణలే వరంగల్ నగరం మునగడానికి ప్రధాన కారణమని గుర్తించారు. నాలాల ఆక్రమణలను వెంటనే తొలగించాలని మంత్రి కేటీఆర్ అప్పటికప్పుడు ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఆఫీసర్లు వారం, పదిరోజుల పాటు ఆక్రమణల తొలగింపుతో హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో మంత్రి కేటీఆర్ ఆదేశాలిచ్చి మూడేండ్లయినా నాలాల పరిస్థితి మారలేదు.
ఏటా మునుగుతున్న కాలనీలు
బొందివాగు డెవలప్‌మెంట్‌కు నోచుకోకపోవడం వల్ల హంటర్ రోడ్డు ప్రాంతంలోని సాయినగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్ కాలనీ, ఎన్‌టీఆర్ నగర్, బీఆర్‌నగర్ తదితర ప్రాంతాలన్నీ ఏటా నీటమునుగుతున్నాయి. ఆయా కాలనీల ప్రజలు ఇండ్లు విడిచి పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు. ఇండ్లలో ఉన్న బియ్యం, బట్టలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, ఇతర వస్తువులన్నీ తడిసి ప్రతి వానాకాలంలో పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తోంది. బొందివాగు నుంచి వచ్చే వరద కిందికి వెళ్లిపోయేందుకు సరైన ఏర్పాట్లు లేక నీళ్లన్నీ వర్షాలు తగ్గినా వారం పది రోజుల పాటు కాలనీల్లోనే నిలిచి ఉంటున్నాయి. ఆయా కాలనీల మీదుగా వచ్చే నీళ్లు చివరకు భద్రకాళి నాలాలో కలుస్తున్నాయి. దీంతో ఆ నాలాలో ప్రవాహం పెరిగి రెండ్రోజుల కిందట భద్రకాళి చెరువు కట్టకు గండి పడింది. అయితే బొందివాగు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికైనా ఓరుగల్లు లీడర్లు చొరవ తీసుకుని బొందివాగు నాలా అభివృద్ధికి కృషి చేయాలని గ్రేటర్ ప్రజలు కోరుతున్నారు.