మంచిర్యాల ముంపు ముప్పుకు చెక్‌‌‌‌ రాళ్లవాగుకు ప్రొటెక్షన్​వాల్

మంచిర్యాల ముంపు ముప్పుకు చెక్‌‌‌‌ రాళ్లవాగుకు ప్రొటెక్షన్​వాల్
  • సుందిళ్ల బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌తో ప్రతి ఏడాది ముగుతున్న కాలనీలు
  • రక్షణ గోడ నిర్మించాలని కోరిన ఎమ్మెల్యే, ప్రజలు
  • రూ.236 కోట్లలో ప్రపోజల్స్‌‌‌‌ పంపిన ఆఫీసర్లు
  • ఇటీవలి బడ్జెట్‌‌‌‌లో రూ.100 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కేంద్రంలో వరద ముంపు సమస్యకు పరిష్కారం లభించనుంది. ముంపుకు కారణమైన రాళ్లవాగుకు కరకట్ట నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే గతంలో ప్రభుత్వాన్ని కోరారు. దీంతో స్పందించిన సర్కార్‌‌‌‌ ఇటీవలి బడ్జెట్‌‌‌‌లో రూ.100 కోట్లు కేటాయించింది. బుధవారం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా పర్యటనకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ముంపు ప్రాంతాల రక్షణ కోసం కరకట్ట నిర్మాణానికి ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్‌‌‌‌సిగ్నల్‌‌‌‌ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పనులు ప్రారంభించి వచ్చే వానాకాలంలోగా పూర్తి చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఏటా ముంపు ముప్పే...

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ కారణంగా మంచిర్యాల జిల్లా కేంద్రానికి ప్రతి ఏటా ముప్పు తప్పడం లేదు. 2022, 2023 సంవత్సరాల్లో గోదావరికి భారీ వరదలు రావడంతో ఆ రెండేండ్లు పట్టణంలోని పలు కాలనీలు నీటమునిగాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి భారీ స్థాయిలో వరద రావడం, సుందిళ్ల బ్యారేజీ బ్యాక్‌‌‌‌ వాటర్‌‌‌‌ రాళ్లవాగులోకి ఎగదన్నడం వల్ల కాలనీలు జలమయం అయ్యాయి. ఎన్టీఆర్‌‌‌‌ నగర్‌‌‌‌, రాంనగర్‌‌‌‌, ఎల్‌‌‌‌ఐసీ కాలనీ, పద్మశాలీకాలనీ, ఆదిత్య ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌, సంజీవయ్య కాలనీ, రెడ్డి కాలనీ, పాత మంచిర్యాల తదితర ప్రాంతాలు రెండు రోజుల పాటు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 

విలువైన ఫర్నీచర్‌‌‌‌, ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులు, ఇతర సామాన్లు వరదపాలయ్యాయి. ఇండ్లలో పేరుకుపోయిన బురదను క్లీన్‌‌‌‌ చేసుకొని మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ప్రజలకు నెల రోజులు పట్టింది. ఒక్కో ఇంటికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు నష్టం జరిగింది. దీంతో వానాకాలం వస్తోందంటే ముంపు కాలనీల ప్రజలు వణికిపోతున్నారు. ఈ ఏడాది కాళేశ్వరం గేట్లు ఓపెన్‌‌‌‌ చేయడం, భారీ వర్షాలు లేకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.  

రూ.236 కోట్లతో ప్రపోజల్స్‌‌‌‌

గతేడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సర్కార్‌‌‌‌ హడావుడిగా రాళ్లవాగుకు కరకట్టల కోసం ప్రపోజల్స్‌‌‌‌ తయారు చేసింది. 2022, 2023 సంవత్సరాల్లో వచ్చిన వరదను పరిగణనలోకి తీసుకున్న ఇరిగేషన్‌‌‌‌ ఆఫీసర్లు రూ.236 కోట్లతో అంచనాలు రూపొందించారు. కార్మెల్‌‌‌‌ స్కూల్‌‌‌‌ దగ్గరి నుంచి గోదావరి వరకు కరకట్టల నిర్మాణానికి ప్లాన్‌‌‌‌ రెడీ చేశారు. 

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కరకట్టల అంశాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌‌‌‌సాగర్‌‌‌‌రావు ప్రస్తావించారు. ఈ మేరకు ప్రభుత్వం 2024–25 సంవత్సరం బడ్జెట్‌‌‌‌లో రూ.100 కోట్లను కేటాయించింది. కరకట్టల కోసం రాళ్లవాగుకు రెండు వైపులా భూములు సేకరించాల్సి ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుతో ప్రొటెక్షన్‌‌‌‌ వాల్‌‌‌‌ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.