ఇరుకు డ్రైన్లు.. ఆపై స్లాబులు

ఇరుకు డ్రైన్లు.. ఆపై స్లాబులు
  • వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు
  • సిటీలో వానొస్తే జలమయమవుతున్న రోడ్లు, కాలనీలు 
  • లైట్ తీసుకుంటున్న గ్రేటర్ ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ నగరంలో ఇరుకు డ్రైన్లు సమస్యగా మారాయి. ఏండ్లు గడుస్తున్నా విస్తరణకు నోచుకోకపోవడం, వివిధ షాపులు, కాంప్లెక్సులు, అపార్ట్​మెంట్ల వారు తమ అవసరాల కోసం వాటిపైనే స్లాబులు ఏర్పాటు చేయడంతో డ్రైన్లలోకి వెళ్లాల్సిన వరద నీటికి దారి లేకుండా పోతోంది. చిన్న వర్షం పడినా నీళ్లు సాఫీగా వెళ్లేందుకు దారిలేక రోడ్లు జలమయం అవుతుండగా, కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇబ్బందులు ఎదర్కొంటున్నా ముందస్తు ప్రణాళికలు చేపట్టాల్సిన అధికారులు లైట్ తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రోడ్లపైనే వరద..

వరంగల్ ట్రై సిటీ 407 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, 66 డివిజన్ల పరిధిలో మొత్తంగా 1,800 కు పైగా కాలనీలున్నాయి. గ్రేటర్ వరంగల్​పరిధిలో వరద ప్రవాహానికి ప్రధాన నాలాలు 53.5 కిలోమీటర్లు, డ్రైనేజీ వ్యవస్థ 1,640 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో ఒక మీటర్​ వెడల్పు విస్తీర్ణం ఉండే కాల్వలే అధికం కాగా, ఆయా డ్రైన్ల ద్వారా వచ్చే వరద, వృథా నీళ్లన్నీ నాగారం చెరువుకు వెళ్లే నాలాలతో అనుసంధానమై ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా సిటీలో ఉన్న డ్రైన్లలో చాలావరకు కొన్నేండ్ల కిందట నిర్మించారు. ప్రస్తుత పరిస్థితులు, ఇండ్ల నుంచి వచ్చే నీళ్లు, వరద ప్రవాహానికి అవి సరిపోని పరిస్థితి.

ఐదారు సెంటీమీటర్ల వర్షం కురిస్తే చాలు ఆయా డ్రైన్లన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నీళ్లన్నీ రోడ్ల మీదుగా కాలనీల్లోకి పరుగులు తీస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరంగల్ ఏనుమాముల పరిసర ప్రాంతాల్లో పైనుంచి వచ్చే వరదకు తగ్గట్టుగా డ్రైనేజీలు లేకపోవడంతో సాయిగణేశ్ కాలనీ, వివేకానంద, లక్ష్మీగణపతి కాలనీ తదితర ఏరియాలన్నీ వర్షాలు తగ్గినా నాలుగైదు రోజులపాటు నీళ్లలోనే ఉండాల్సి వస్తోంది. 

ఎక్కడికక్కడ స్లాబులు..

ఇరుకుగా మారిన డ్రైన్లు సమస్యగా మారగా, డ్రైన్లు, నాలాలపై ఏర్పాటు చేసిన స్లాబులతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. షాపులు, అపార్ట్​మెంట్లు, కాంప్లెక్సులతోపాటు ఓపెన్​గా ఉండాల్సిన చోట్ల కూడా పలువురు డ్రైన్లపై స్లాబులు ఏర్పాటు చేస్తుండటంతో వరద నేరుగా కాల్వల్లోకి చేరడం లేదు. స్లాబుల వల్ల కాల్వల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే వీలుండటం లేదు. దీంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ముంపు ముప్పును ఎదుర్కొంటున్న చాలా కాలనీల్లో ఇదే పరిస్థితి. ముఖ్యంగా హనుమకొండలోని అంబేద్కర్ భవన్ సమీపంలోని తిరుమల జంక్షన్ వద్ద ఈ సమస్య అధికమని చెప్పవచ్చు.

తిరుమల జంక్షన్ లో ఇరుకు డ్రైన్లపై స్లాబులు ఉండటం, వరద బయటకు వెళ్లేందుకు రెండు వైపులా కనెక్టివిటీ లేకపోవడం ఏటా చిన్నవాన పడినా ఆ రోడ్డు మొత్తం బ్లాక్​ అవుతోంది. హనుమకొండ చౌరస్తా, గోకుల్ నగర్, వికాస్ నగర్, కిషన్ పుర, కుమార్ పల్లి, హంటర్ రోడ్డు, రాయపుర, అలంకార్, మండిబజార్, వరంగల్ చౌరస్తా, ఎస్సార్ నగర్, దేశాయిపేట, ఎంహెచ్ నగర్, గరీబ్ నగర్, కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ ఏరియా ఇలా వందలాది ఏరియాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

దృష్టి పెట్టని గ్రేటర్ ఆఫీసర్లు..

ముంపునకు కారణమవుతున్న పరిస్థితులపై జీడబ్ల్యూఎంసీ ఇంజినీరింగ్ ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్ చేసి, వర్షాలు మొదలవడానికి ముందే తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇరుకుగా ఉండి సమస్యగా మారిన డ్రైన్లను విస్తరించడంతోపాటు అవసరమైన ప్రదేశాల్లో నాలాలపై స్లాబులు తొలగించి వరద ప్రవాహానికి అడ్డంకులు తొలగించాల్సి ఉంది. కానీ, గ్రేటర్ ఆఫీసర్లు నామమాత్రపు చర్యలతో సరి పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇరుకు డ్రైన్లు, స్లాబుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలూ లేకపోలేదు. ప్రస్తుతం వర్షాలు మొదలవుతుండగా, ఇప్పటికైనా గ్రేటర్ ఆఫీసర్లు ఇరుకు డ్రైన్లు, స్లాబుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.