- వానాకాలం గ్రేటర్ శివారు పరిస్థితి అధ్వానం
- శ్మశానాలు లేక ఓపెన్ ప్లేసుల్లో అంత్యక్రియలు
- గుంతల రోడ్లతో జనాలకు ఇబ్బందులు
- డెవలప్మెంట్ ను గాలికొదిలేసిన గత సర్కారు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ లో విలీనమైన 42 గ్రామాల్లో సమస్యలు తీరడం లేదు. గత ప్రభుత్వ పెద్దలు సమస్యలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికీ చాలా ఊర్ల రోడ్లు, శ్మశాన వాటికలు, డ్రైనేజీ సిస్టం, శానిటేషన్ నిర్వహణ సరిగా లేక జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వానాకాలంలో ఇక్కడ సమస్యలు ఎక్కువగా ఉండడంతో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.
ప్రస్తుత ఎమ్మెల్యేలైనా విలీన గ్రామాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 జనవరిలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గ్రేటర్ గా అప్ గ్రేడ్ చేశారు. ఇందుకు 42 సమీప గ్రామాలను సిటీలో విలీనం చేశారు. అత్యధికంగా వర్ధన్నపేట నియోజకవర్గంలో 30 గ్రామాలు ఉండగా, పరకాల 10, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన రెండు గ్రామాలున్నాయి. ఆయా ఊర్లను సిటీలో కలుపడంతో పన్నులు పెరగడంతోపాటు అక్కడి ప్రజలు ఉపాధిహామీలాంటి పథకాలకు దూరమయ్యారు. ఇదిలాఉంటే నగరానికి ధీటుగా విలీన గ్రామాలను డెవలప్ చేయాల్సి ఉండగా, గత పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ గతుకుల రోడ్లే గతయ్యాయి. మౌలిక సదుపాయాలు కరువవ్వడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చచ్చినా చావే..!
విలీన గ్రామాల్లో ఎక్కడా సక్రమంగా శ్మశాన వాటికలు లేవు. చాలాచోట్ల చెరువు గట్లు, రోడ్ల పక్కన ఓపెన్ ప్లేసులను ప్రజలు శ్మశాన వాటికలుగా వినియోగిస్తున్నారు. ప్రధానంగా హసన్ పర్తి మండల పరిధిలోని చాలా గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువ. వర్షాకాలం వచ్చిందంటే దహన సంస్కారాలు, కర్మ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ విలీన గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు. మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. సిటీకి దూరంగా ఉండడంతో శానిటేషన్ వారు కూడా దృష్టి పెట్టకపోవడం దురదుష్టకరం. డైలీ చెత్త సేకరణ జరగాల్సి ఉండగా, నాలుగైదు రోజులకోసారి చేపట్టడం, దోమల నివారణ చర్యలు చేపట్టకుండా విలీన గ్రామాలపై చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అరకొర నిధులతో సరి..
విలీన గ్రామాలు, స్లమ్ ఏరియాల డెవలప్మెంట్కు జీడబ్ల్యూఎంసీ బడ్జెట్ లో 1/3 నిధులు కేటాయించాల్సి ఉంది. ఆ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. గతేడాది బడ్జెట్ లో విలీన గ్రామాలు, స్లమ్ ఏరియాల్లో అభివృద్ధికి రూ.12.29 కోట్లు ఇవ్వగా, ఈసారి రూ.14.04 కోట్లు కేటాయించారు. గ్రేటర్ నిధులతో పాటు కుడా (కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) కూడా ప్రత్యేకంగా ఫండ్స్ కేటాయించాల్సి ఉంది.
కానీ, ఎక్కడా అమలు కాకపోవడంతో క్షేత్రస్థాయిలో చాలా పనులకు మోక్షం కలగడం లేదు. ఫలితంగా గ్రామాలకు మెయిన్ రోడ్లు, అంతర్గత దారులు, డ్రైనేజీలు, శ్మశాన వాటికలు, తాగునీటి సరఫరా లైన్లు, తదితర సమస్యలకు పరిష్కారం లభించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తగిన చొరవ తీసుకుని, విలీన గ్రామాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.