ఆర్ట్స్ అండ్​ క్రాఫ్ట్స్ కేంద్రాన్ని వెంటాడుతున్న సమస్యలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని నాయకపోడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేంద్రాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. 2020లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో నాయకపోడు గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేలా బొమ్మలు తయారు చేసి వాటిని ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భావి తరాలకు వారు కొలిచే దేవుళ్లు, ప్రకృతిని బొమ్మల రూపంలో తయారు చేస్తున్నారు. అయితే ఇందుకు కర్ర కొరతతో పాటు మార్కెటింగ్​ పెద్ద సమస్యగా మారింది. కొవిడ్​ తర్వాత పెరిగిన రంగుల ధరలు బొమ్మల తయారీకి భారంగా మారాయి. మూడేళ్ల నుంచి రూ.18 లక్షల విలువ చేసే బొమ్మలను మాత్రమే విక్రయించారు. రూ.18లక్షల వ్యయంతో తైవాన్, రాజస్థాన్​ నుంచి త్రీడీ పరికరాలను తీసుకొచ్చి ఐటీడీఏ నాయకపోడు ఆర్ట్స్ అండ్​ క్రాఫ్ట్స్ సొసైటీకి చేయూతనిచ్చింది. త్రీడీ సాఫ్ట్ వేర్​ సాయంతో కంప్యూటర్​ ద్వారా బొమ్మలకు ప్రాణం పోసి వాటికి నాయకపోడు కళాకారులు రంగులు అద్దుతున్నారు. గతంలో మేడారం జాతర, హైదరాబాద్​లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో మాత్రమే స్టాల్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి మొదలు గవర్నర్, సీఎం ఇతర ముఖ్యులకు వీరి క్రాఫ్ట్స్ గిఫ్ట్ ల రూపంలో ఇస్తున్నారు. కానీ మార్కెటింగ్​ విషయంపై దృష్టి సారించడం లేదు. దీంతో సమస్యలతో ఈ కేంద్రం కొట్టుమిట్టాడుతోంది.

కర్రే ప్రధాన సమస్య..

నాయకపోడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేంద్రానికి కర్రే ప్రధాన సమస్యగా మారింది. సాధారణంగా వీటి తయారీకి పొన్నె, బూరుగు, కలుగుడు, చేతిప్ప, తెడ్లపాల, నల్ల పొనిక, తెల్ల పొనిక తదితర కర్రలను వినియోగిస్తారు. ఇవి విరివిగా దొరుకుతున్నప్పటికీ అటవీశాఖాధికారులు అడ్డుకుంటున్నారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం అడితిల్లో క్యూబిక్​ మీటర్​ రూ.4 వేలు చొప్పున కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. అటవీశాఖ స్మగ్లర్ల నుంచి పట్టుకున్న ఈ మారుజాతి కలపను నాయకపోడు గిరిజనులకు అందిస్తే వారికి వెసులుబాటు అవుతుంది. ఈ విషయాన్ని ఐటీడీఏ పీవో గౌతమ్​ పోట్రు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. 

ప్రచారం చేస్తలేరు..

అరుదైన బొమ్మలను తయారు చేసే నాయకపోడు ఆర్ట్స్ అండ్​ క్రాఫ్ట్స్ కేంద్రానికి సరైన ప్రచారం కల్పించడం లేదు. పంచపాండవులు, లక్ష్మీదేవర, కిట్టస్వామి, పోతురాజు, పందిరాజు, గుర్రంపోను, లేడి, సింగబోయడు, పోలయ్య నాయకుడు, అనపోక నాయకుడు, మైసమ్మ, నల్ల గొండ రాకాసి, యర్రకొండ రాకాసి, పెద్దమ్మతల్లి, చిన్న కొర్రాజులు, పెద కొర్రాజులు వంటి 27 రకాల కొలుపులు, దేవుళ్లు, ప్రకృతి బొమ్మలు తయారు చేస్తున్నారు. పాపికొండలు పర్యాటక కేంద్రం, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం వద్ద స్టాల్స్ పెట్టి వీటిని పర్యాటకులకు పరిచయం చేయవచ్చు. కానీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ట్రైబ్స్ ఆఫ్ ఇండియా ద్వారా దేశ వ్యాప్తంగా 140 కేంద్రాల్లో, ప్రత్యేక యాప్​ల ద్వారా బొమ్మలు విక్రయిస్తున్నారు. ఇటువంటి వాటికి ఈ బొమ్మలను పరిచయం చేస్తే లాభం ఉంటుంది. మరో వైపు ట్రైకార్​ వంటి సంస్థలు కూడా వీరు చెబుతున్న ధరలో 40 నుంచి 60 శాతం మార్జిన్​ అడుగుతున్నారు. కరోనా తర్వాత రంగుల ధరలు పెరిగాయి. గతంలో రూ.120 ఉన్న కలర్​ ట్యూబ్​ ఇప్పుడు రూ.480 పలుకుతోంది. మెరుగు పెట్టే ద్రావకం అరలీటరు రూ.60 నుంచి రూ.280 పెరిగింది. దీంతో బొమ్మల తయారీకి ఖర్చు ఎక్కువవుతోంది.

మారుజాతి కలప అందించాలి

కేంద్రం నిర్వహణకు అవసరమైన రూ.1.50 లక్షలు ఐటీడీఏ ద్వారా అందించి ఆదుకున్నారు. కర్ర కొరత, మార్కెటింగ్​ ఇబ్బందిగా ఉంది. అటవీశాఖ ద్వారా అవసరమైన మారుజాతి కలపను ఇచ్చేలా ఐటీడీఏ చర్యలు తీసుకోవాలి. 

- పసుల అంజన్​కుమార్, ప్రెసిడెంట్, నాయకపోడు ఆర్ట్స్ అండ్​ క్రాఫ్ట్స్