కేజ్రీవాల్‎‎కు దబిడి దిబిడి స్టార్ట్.. మాజీ సీఎం మెడకు మరో ఉచ్చు

కేజ్రీవాల్‎‎కు దబిడి దిబిడి స్టార్ట్.. మాజీ సీఎం మెడకు మరో ఉచ్చు

న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఎదురు దెబ్బలు మొదలయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై తీవ్ర నిరాశలో ఉన్న కేజ్రీవాల్‎కు ఓ వైపు సొంత పార్టీ నేతలు షాకులు ఇస్తుండగా.. మరో వైపు శీష్ మహాల్ విచారణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యా్ప్తు కత్తులు ఆయన మెడపై వేలాడుతున్నాయి. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ సీట్లకు గానూ కేవలం 22 చోట్ల మాత్రం విజయం సాధించి 11 ఏళ్లు వరుసగా అనుభవించిన అధికారాన్ని కోల్పోయింది.

ఈ క్రమంలో ఎన్నికల ఓటమి బాధ నుంచి ఇంకా తేరుకోక ముందే కేజ్రీవాల్‎కు ఆప్‎కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బిగ్ షాకిచ్చారు. అసెంబ్లీ ఫలితాలు వెలువడి సరిగ్గా 10 రోజులు కూడా కాక ముందే కౌన్సిలర్లు అనితా బసోయా (వార్డ్ 145, ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చప్రానా (వార్డ్ 183), ధరమ్‌వీర్ (వార్డ్ 152) ఆప్‎కు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీలో చేరారు. వీరితో పాటు ఆప్ న్యూఢిల్లీ జిల్లా మాజీ అధ్యక్షుడు సందీప్ బసోయా కూడా చీపురు పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

వీరి బాటలోనే మరికొందరు ఆప్ నేతలు కూడా నడిచే అవకాశం ఉందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‎లో పెద్ద ఎత్తున ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగానే.. కేజ్రీవాల్‎కు మెడకు మరో ఉచ్చు చిక్కుకుంది. సీఎంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ ఉపయోగించిన అధికారిక నివాసం 6 ఫ్లాగ్‌స్టాఫ్ బంగ్లా (శీష్ మహాల్) పునరుద్ధరణలో జరిగిన ఆర్థిక, నియంత్రణ అవకతవకలపై వివరణాత్మక దర్యాప్తునకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) ఆదేశించింది. మొత్తం 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న ఈ విలాసవంతమైన భవనాన్ని నిర్మించడానికి కేజ్రీవాల్ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశాడని బీజేపీ నేత విజేందర్ గుప్తా 2024, అక్టోబర్ 14 సీవీసీకి ఫిర్యాదు చేశారు.

విజేందర్ గుప్తా ఫిర్యాదు మేరకు 2025, ఫిబ్రవరి 13 సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది. శీష్ మహాల్ పునరుద్ధరణలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీవీసీ కేంద్ర ప్రజా పనుల శాఖ (CPWD)ని ఆదేశించింది. ఇప్పటికే కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కాములో నిందితుడిగా జైలుకు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. ఓ వైపు నేతలు జంపింగ్‎లు, మరోవైపు విచారణలు కేజ్రీవాల్ కు సవాల్‎గా మారాయి. మరీ ఈ అవాంతరాలను కేజ్రీవాల్ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి. ఓ వైపు కేసులను ఎదుర్కొంటునే.. మరోవైపు నేతలను పార్టీ వీడకుండా ఆపాల్సిన డబుల్ టాస్క్ కేజ్రీవాల్ పై నెలకొంది.