డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో సమస్యలు : సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు

సిద్దిపేట పట్టణంలో రోడ్డుమీద గానీ మురుగు కాలువలో గానీ వర్షం పడిన నీరు మాత్రమే కనిపించాలి కానీ మురుగు నీరు అనేది కంటికి కనబడకుండా అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా  పట్టణం అవతలికి పోవాలి అని అప్పుడు సీఎం కేసీఆర్​ గొప్పగా చెప్పారు.  సిద్దిపేట పట్టణంలో ఎంతో అట్టహాసంగా ముఖ్యమంత్రి ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయం   కొద్ది రోజులకే డ్రైనేజీ,పైప్ లీకేజీ,పై ఫ్లోర్ ద్వారా వర్షం నీరు లీకేజీ సమస్యలు వెలుగు చూశాయి. సంబంధిత కాలనీలో కార్యాలయం ఏర్పాటు చేసి మరమ్మతులు చేపిస్తామని చెప్పారు.

కానీ నామమాత్రపు చర్యలతో మరమ్మత్తులు చేయకుండానే, చేసినట్టు రికార్డుల్లో రాసుకొని చేతులు దులుపుకున్నారు. ఇలా నిర్మాణ వైఫల్యాలు, నాణ్యతా లోపాలతో కూడుకున్న సమస్యలు ఉన్నా పట్టించుకునేవారు లేరు. పేరుకే డబుల్ బెడ్ రూమ్ లు కానీ లీకేజీ సమస్యలతో ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నామని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట కేసీఆర్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాల ప్రారంభోత్సవ సమయంలో వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇక్కడి నిర్మాణాలను, వాతావరణాన్ని చూసి ఆ ఇండ్లలో ఉండడానికి ముచ్చట పడుతున్నామన్నారు.  

అద్భుతమైన నిర్మాణాలని మాట్లాడిన ఆ ప్రజా ప్రతినిధులు ఒక 6 నెలల పాటు ఈ గృహసముదాయంలో నివసిస్తే పేదవాడికి నిర్మించిన ఆత్మగౌరవ భవనాలు ఎంత పక్కగా నిర్మించారో, నిర్మాణ పర్యవేక్షణ ఏపాటిదో వారికే తెలిసివస్తుంది. గత రెండు సంవత్సరాలుగా ఓ 20 ఇండ్లలో  అడుగు పెట్టని  పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఎన్నో రంగాల్లో సిద్దిపేటకు అవార్డులు వస్తున్న సందర్భంలో ఈ డబుల్ బెడ్ రూమ్ నిర్మాణ, నిర్వహణ వైఫల్యాలకు కూడా ఓ అవార్డు ఇస్తే బాగుంటుందని కాలనీవాసులు అంటున్నారు. - సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు, సిద్దిపేట