న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, ఎఫ్‌డీసీ కంపెనీలు అమెరికా నుంచి కొన్ని మందులను రీకాల్ చేసుకుంటున్నాయి. యూఎస్ ఎఫ్‌డీఏ డేటా ప్రకారం, తయారీలో సమస్యలు ఉండడంతో మందుల రీకాల్ చేపడుతున్నాయి. బ్లడ్ ఫెనైలలనైన్ కంట్రోల్ చేయడంలో వాడే జావైగ్టర్ (సాప్రోప్‌టెరిన్ డైహైడ్రోక్లోరైడ్) పౌడర్ (100 ఎంజీ) 20,000 కార్టన్లను డాక్టర్ రెడ్డీస్ రీకాల్ చేసుకుంటోంది.
ఈ మెడిసిన్స్ సమర్ధత అనుకున్నదాని కంటే తక్కువుగా ఉండడంతోనే రీకాల్ చేపడుతోంది. ఇదే కారణంతో మరికొన్ని లాట్‌ల సాప్రోప్‌టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ డ్రగ్‌ను రీకాల్ చేస్తోంది. కిందటి నెల 8 న డాక్టర్ రెడ్డీస్ క్లాస్1 రీకాల్ మొదలుపెట్టిందని యూఎస్ ఎఫ్‌డీఏ ప్రకటించింది. ప్రొడక్ట్‌లు సరిగ్గా లేకపోతే క్లాస్ 1 రీకాల్ చేపడతారు. ఇంజెక్షన్లలో వాడే 11,016 వయల్స్ అంఫోటెరిసిన్ బీ లిపోసమ్ డ్రగ్‌ను యూఎస్ నుంచి సన్ ఫార్మా రీకాల్ చేసుకుంటోంది.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్‌ను ట్రీట్ చేయడంలో ఈ మందును వాడుతున్నారు. సన్ ఫార్మా యూఎస్ సబ్సిడరీ క్లాస్ 2 రీకాల్‌ను కిందటి నెల 19 న మొదలు పెట్టింది. అదే విధంగా అరబిందో ఫార్మా 13,605 బాటిళ్ల క్లోరజెపటే డైపొటాషియం ట్యాబ్లెట్లు (3.75 ఎంజీ, 7.5 ఎంజీ) రీకాల్ చేస్తోంది. ట్యాబ్లెట్లపై పసుపు మచ్చలు ఉండడంతో ఈ డ్రగ్‌ను కంపెనీ రీకాల్ చేస్తోంది.
కిందటి నెల 24 న క్లాస్ 2 రీకాల్‌ను అరబిందో ఫార్మా మొదలు పెట్టింది. మరో ఫార్మా కంపెనీ ఎఫ్‌డీసీ లిమిటెడ్ 3,82,104 యూనిట్ల టిమోలోల్ మలియేట్ ఆఫ్తాల్మిక్ సొల్యూషన్‌ను రీకాల్ చేస్తోంది. ఈ మందును గ్లూకోమా ట్రీట్‌మెంట్‌లో వాడుతున్నారు. కంటైనర్‌లో సమస్యలు ఉండడంతో ఈ కంపెనీ డ్రగ్స్‌ను రీకాల్ చేసుకుంటోంది. కాగా, మందుల ప్యాకింగ్ బాగోలేకపోతే క్లాస్ 2 రీకాల్‌ను చేపడతారు.