మహబూబ్‌నగర్/మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు:పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో సమస్యలు తిష్ట వేశాయి. క్యాంపస్‌లో స్ట్రీట్ లైట్లు నెలలుగా వెలుగకపోయినా ఫండ్స్ లేక రిపేర్లు చేయించడం లేదు. హాస్టల్లో ఫుడ్ క్వాలిటీగా లేదని వారం కిందట స్టూడెంట్లు ఆందోళన చేయగా, రెండు రోజుల కింద లైబ్రెరీలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు కాంపిటేటివ్ బుక్స్ లేవని కంప్యూటర్లు బయట పెట్టి నిరసన తెలిపారు.
ఐదేళ్ల కిందటి పుస్తకాలే దిక్కు..
యూనివర్సిటీలో 200 మంది కూర్చొని చదువుకునేలా లైబ్రరీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వర్సిటీలో 1,000 మంది స్టూడెంట్లు ఉండగా, వీరికి అనుగుణంగా లైబ్రెరీని డెవలప్ చేయలేదు. కొన్ని సబ్జెక్టులకు సంబంధించిన అకడమిక్ పుస్తకాలు కూడా లేవు. 2018కి సంబంధించిన కాంపిటేటివ్ పుస్తకాలే ఉన్నాయి. ఇటీవల ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తుండడంతో లైబ్రెరీలో చదువుకునేందుకు స్టూడెంట్లు క్యూ కడుతున్నారు. కొత్త పుస్తకాలు తెప్పించకపోవడంపై స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొత్త బుక్స్ తెప్పిస్తామని వర్సిటీ వీసీ వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికితోడు లైబ్రరీ వద్ద ఉన్న టాయిలెట్స్నుంచి వాసన వస్తోందని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కంప్యూటర్లు పనిచేయవ్..
వర్సిటీ లైబ్రరీలో కంప్యూటర్లు షో పుటప్గా మారాయి. 24 కంప్యూటర్లలో రెండే పనిచేస్తున్నాయి. మిగతావి పాతవి కావడంతో పని చేయడం లేదు. ఈ కంప్యూటర్లకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నా, వాడడం లేదు. ఇటీవల స్టూడెంట్లు ఆందోళన చేయడంతో పది కొత్త కంప్యూటర్లు తెచ్చి పెట్టారు. కానీ, వాటిని ఇప్పటికీ ఇన్స్టాల్చేయలేదు. అయితే, స్టూడెంట్లు ఆందోళన చేసిన ప్రతిసారి వర్సిటీ సిబ్బంది కొత్త కంప్యూటర్లు తెచ్చి పెట్టి, ఆ తరువాత వాటిని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు.
కరెంట్ ప్రాబ్లమ్..
వర్సిటీలో కరెంట్ ప్రాబ్లమ్ వస్తోంది. మెయిన్ గేట్ నుంచి ఉన్న స్ట్రీట్ లైట్లు పని చేయడం లేదు. నెలలు కావస్తున్నా, ఇంత వరకు బల్బులు రీ ప్లేస్ చేయడం లేదు. హాస్టల్స్‌లోని కొన్ని రూమ్స్‌లో ఫ్యాన్లు పని చేయడం లేదు. ట్యూబ్ లైట్లు వెలగడం లేదు. రాత్రి లైబ్రరీ నుంచి హాస్టల్‌కు రావడానికి స్టూడెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల పాములు, కొండచిలువలు కనిపించడంతో భయపడుతున్నారు.
ఫుడ్ స్మెల్ వస్తోంది..
కొద్ది రోజులుగా వర్సిటీలో భోజనం సరిగ్గా పెట్టడం లేదని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. వారం రోజుల కింద స్టూడెంట్లు పీయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. అన్నం వాసన వస్తోందని, కూరలు రుచిగా ఉండడం లేదని, కడుపు నిండా తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులను మార్చాలని డిమాండ్ చేశారు. స్పందించిన పీయూ అధికారులు ఏజెన్సీ నిర్వాహకులను మారుస్తామని హామీ ఇచ్చారు.
ఇన్స్టాలేషన్ ఎప్పుడు చేస్తరో తెల్వదు..
లైబ్రరీలో 24 కంప్యూటర్లు ఉన్నాయి. అందులో రెండే పని చేస్తున్నాయి. కొత్త కంప్యూటర్లు తెప్పించాలని చాలా సార్లు ధర్నాలు చేసినం. నాలుగు రోజుల కింద ధర్నా చేస్తే, కొత్తగా పది కంప్యూటర్లు తెచ్చి పెట్టింన్రు. కానీ ఇన్స్టాలేషన్ చేయలేదు.
- నరేశ్ తేజ్, ఎంబీఏ సెకండ్ ఇయర్
కొత్త పుస్తకాలు తెప్పించాలె..
లైబ్రరీలో అకడమిక్‌కు సంబంధించిన అన్ని రకాల పుస్తకాలు లేవు. కాంపిటేటివ్ పుస్తకాలదీ అదే పరిస్థితి. 2018కి చెందిన కాంపిటేటివ్ బుక్స్ మాత్రమే ఉన్నాయి. వెంటనే కొత్త పుస్తకాలను తెప్పించాలె.
- మారుతి, ఎంఏ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్
త్వరలో పరిష్కరిస్తాం..
లైబ్రరీ వద్ద ఉన్న టాయిలెట్స్ సమస్యను త్వరలో పరిష్కరిస్తాం. స్ట్రీట్ లైట్ల బల్పులు మార్చాలని మున్సిపాలిటీ వాళ్లకు చాలా సార్లు చెప్పాం. భోజనంలో ఎలాంటి సమస్య లేదు. అయినా, కొత్త వారికి కాంట్రాక్ట్ అప్పగిస్తున్నాం.
- లక్ష్మీకాంత్ రాథోడ్, వైస్ చాన్స్‌లర్