నిలోఫర్లో ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్ మెంట్

నిలోఫర్లో ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్ మెంట్
  • నిలోఫర్​లో బెడ్స్ 1500..వేలల్లో వస్తున్న పేషెంట్లు
  •  గంటల కొద్దీ ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు  
  • డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం
  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటున్న పేరెంట్స్ 

హైదరాబాద్​, వెలుగు : నిలోఫర్ ఆస్పత్రికి ట్రీట్ మెంట్ కోసం వచ్చే చిన్నారులు, బాలింతలకు కష్టాలు తప్పడంలేదు. బెడ్స్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే బెడ్​పై ఇద్దరు, ముగ్గురు పిల్లలకు ట్రీట్​మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కొందరికి నేలపై, లేదంటే తల్లి ఒడిలో పడుకోబెట్టి కూడా ట్రీట్ మెంట్ చేస్తున్నారు. మరికొందరు గంటల తరబడి పిల్లలను ఎత్తుకొని బెడ్స్​కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. 

ప్రస్తుతం బెడ్స్​ సరిపోక పిల్లల పేరెంట్స్ డాక్టర్లు, ఆస్పత్రి అధికారులపై మండిపడుతున్నారు. ప్రైవేట్​ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే లక్షల్లో ఖర్చవుతుందని, అంత డబ్బు లేక  నిలోఫర్ కు తీసుకొస్తే సమయానికి ట్రీట్ మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నామని కొందరు పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని, బెడ్స్​పెంచాలని,  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ఫ్లు జ్వరాలతో ఎక్కువగా  వస్తుండగా.. 

సీజన్ తో సంబంధం లేకుండా  రాష్ట్రవ్యాప్తంగా ఎమర్జెన్సీ కేసులు, చిన్నారుల ట్రీట్​మెంట్ కు నిలోఫర్​కు రెఫర్ చేస్తుంటారు. ప్రస్తుతం వానల సీజన్ కావడంతో  పిల్లలకు ఫ్లూ జ్వరాలు ఎక్కువగా వస్తున్నా యి. దీంతో పిల్లలను తీసుకుని తల్లిదండ్రులు వస్తుండగా ఆస్పత్రి రద్దీగా మారింది.1500 బెడ్స్​సామర్థం ఉండగా.. వేలాది మంది ట్రీట్ మెంట్ కోసం వస్తుండగా.. ఏ మాత్రం సరిపోవడం లేదు. 

ప్రస్తుతం 2 వేలకుపైనే అడ్మిట్​ అయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఒకే బెడ్ పై ఇద్దరు, కొన్ని సందర్భాల్లో ముగ్గురు చిన్నారులను పడుకోబెట్టి ట్రీట్​మెంట్ అందిస్తున్నామన్నారు. అయితే.. ఒకరి నుంచి మరొకరికి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని పేరెంట్స్​ఆందోళన చెందుతున్నారు. 

ALSO READ : తల్లి తన ఆస్తిని నచ్చినోళ్లకు ఇవ్వొచ్చు..హైకోర్టు కీలక తీర్పు

బెడ్​ కోసం ఐదు గంటలు చూశాం

ఖమ్మంలో మా బంధువుకు పుట్టిన పాపకు ఫిట్స్​ వస్తున్నాయని నిలోఫర్​కు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. దీంతో బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు తీసుకొచ్చాం. అర్ధరాత్రి ఒంటి గంట దాకా బెడ్ దొరకలేదు. చేసేది లేక సిటీలోని బంధువు ఇంటికి వెళ్లాం. మళ్లీ ఉదయం వచ్చినా పరిస్థితి మారలేదు. చివరకు పాపకు బెడ్​దొరికినా తల్లికి లేదు. కుట్లు కూడా తీయని బాలింతకు బెడ్​అడిగితే ఆస్పత్రి సిబ్బంది డబ్బులు ఇవ్వమంటున్నారు. 

– రవి, పాల్వంచ, భద్రాద్రి జిల్లా

అందరికీ ట్రీట్ మెంట్ అందిస్తున్నాం

పేషెంట్లు రెగ్యులర్ కంటే పదిశాతం పెరిగారు. దీంతో బెడ్స్​సరిపోవడం లేదు. అయినా అందరికీ ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. ఫీవర్​కేసులు ఎక్కువగా వస్తున్నాయి.  మరోవైపు హాస్పిటల్స్ లో డాక్టర్స్​ ధర్నా కు దిగడంతో చాలా మంది నిలోఫర్​కు తీసుకొస్తున్నారు.  

– డాక్టర్​ రవికుమార్,  నిలోఫర్ ​ ఆస్పత్రి  ఇన్ చార్జ్ సూపరింటెండెంట్