వాన కోసం..నిత్యం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలు

వాన కోసం..నిత్యం ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలు
  •     దుక్కులు దున్ని సిద్ధం చేసిన రైతులు
  •     కొన్ని చోట్ల బిందెలతో నీళ్లు పోస్తున్న కర్షకులు 

జయశంకర్‌‌ భూపాలపల్లి, వెలుగు : వాన కాలం పంటల సాగు కోసం రైతులంతా దుక్కులు సిద్ధం చేశారు. మృగశిర కార్తె పోయి వారం రోజులు దాటినా వానలు పడక రైతులు ఆకాశం వైపే చూస్తున్నారు. కొందరేమో పొడి దుక్కిలోనే విత్తనాలు నాటగా, చిన్న వానలకు కొన్ని విత్తనాలు మొలకెత్తగా, 80 శాతం గింజలు భూమిలోనే ఖరాబైనయ్‌‌. మొలకెత్తిన విత్తనాలు కాపాడుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. స్ప్రిక్లర్ల, ఇంకొందరు బిందెలతో నీళ్లు చల్లుతున్నారు. వరంగల్‌‌ ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం కరవు ఛాయలు కన్పిస్తున్నాయి. అదను దాటితే విత్తనాలు మొలకెత్తడం కష్టమవుతుందని రైతులు చెబుతున్నారు. 

5 లక్షల హెక్టార్లలో సాగు అంచనా.. 

వరంగల్‌‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో 5 లక్షల హెక్టార్లకు పైగా సాగు భూమి ఉంది. ఈ వానకాలం‌లో 1.50 లక్షల హెక్టార్లలో వరి, 2.40 లక్షల హెక్టార్లలో పత్తి, 60 వేల హెక్టార్లలో మక్కజొన్న, 20 వేల హెక్టార్లలో మిర్చి, 10 వేల హెక్టార్లలో పసుపు పంటతోపాటు మరో 20 వేల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. కాగా, నైరుతి రుతుపవనాల రాకతో మృగశిర కార్తె తర్వాత వానలు పడుతుంటాయి. కానీ ఈసారి ఇప్పటి వరకు రుతు పవనాల జాడ లేదు. 

రూ.500 కోట్లకు పైగా పెట్టుబడి ఖర్చు..

వానకాలం‌లో పంటలు సాగు చేయాలనే లక్ష్యంతో రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.5 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ట్రాక్టర్‌‌ సహాయంతో లోతు దుక్కులు దున్నించారు. దీనికి ఎకరానికి రూ.2 వేల వరకు ఖర్చయ్యింది. ఆ తర్వాత పత్తి, మక్కజొన్న తదితర పంటల విత్తనాలు నాటడానికి వీలుగా ఫల్టర్‌‌ కూడా కొట్టించారు. దీనికి ఎకరానికి రూ.1,800 చొప్పున పైసలిచ్చారు. పత్తి పంట అయితే ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున రూ.4 వేలు, మక్కజొన్న పంట అయితే ఎకరానికి రెండు ప్యాకెట్లకు రూ.3 వేలు చొప్పున కొనుగోలు చేశారు.

కొందరు రైతులు జూన్‌‌ ఫస్ట్‌‌ వీక్‌‌లోనే పొడి దుక్కుల్లో విత్తనాలు నాటారు. ఇంకొందరు చిన్నపాటి వర్షాలు పడగానే భూమి పూర్తిగా తడవకముందే విత్తనాలు వేశారు. వానల్లేక విత్తనాలు భూమిలోనే కుళ్లిపోతుండటంతో రైతులకు నష్టం వస్తోంది. ఇలా ఇప్పటికే రైతులు ఎకరానికి రూ.10 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లెక్కిస్తే రైతులంతా కలిసి సుమారు రూ.500 కోట్ల వరకు పెట్టుబడి కింద ఖర్చు చేసినట్లుగా తేలింది.

పత్తిపంట సాగుకే మొగ్గుచూపుతున్న రైతులు

మహబూబాబాద్‌‌, వెలుగు :  ఉమ్మడి వరంగల్​జిల్లాలోని మహబూబాబాద్‌, హనుమకొండ, వరంగల్లు, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాల పరిధిలో  రైతులు పత్తి పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో గతేడాది పత్తి పంట 82,600 ఎకరాల్లో సాగు చేయగా, ఇప్పడు 85,480 ఎకరాల్లో సాగు చేయనున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల అంచనా. ఇప్పటికే జిల్లాలో 30,700 ఎకరాల్లో పత్తి గింజలు నాటగా, వర్షాలు సమృద్ధిగా కురిస్తే మిగతా విత్తనాలు నాటేందుకు చూస్తున్నారు. ఇప్పటికే నాటిన పత్తిగింజలు మొలకెత్తినా సరిగ్గా పెరిగే అవకాశం లేకుండా పోవడంతో  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొంత మంది రైతులు డ్రిప్‌విధానంలో పత్తి మొక్కలను బతికించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, భూమి పూర్తిగా తడిసేలా వర్షం కురిసిన తరువాత, జూలై మొదటి వారంలోగా పత్తి గింజలను నాటుకోవచ్చని మహబూబాబాద్​జిల్లా అగ్రికల్చర్​ ఆఫీసర్​ అభిమన్యు తెలిపారు. తేమ సరిగ్గాలేకుంటే వేసిన గింజలు ఎండల దాటికి మొలకెత్తవన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ల సలహలు, సూచనలను పాటిస్తూ పత్తి సాగు చేసుకోవాలని ఆయన సూచించారు.

గింజలు పెట్టి  పది దినాలైంది..

రోహిణి కార్తీలో పత్తి గింజలు నాటినం. గింజలు కొనడానికే రూ.12 వేల వరకు ఖర్చయ్యింది. అచ్చు తొలడానికి, గింజలు నాటడానికి కూలీలకు రూ.4 వేలు అయినయ్‌‌. గింజలు నాటి పది రోజులు దాటినా వర్షాలు లేక పెట్టిన గింజలు అక్కరకు రాకుండా పోయాయి. మల్ల అచ్చు తొలి గింజలు కొనుగోలు చేశాను. వర్షం పడితే గింజలు నాటాలని చుస్తున్నా.

      -  సూర రవి, తిరుమలగిరి రైతు, రేగొండ మండలం, భూపాలపల్లి జిల్లా