![గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి](https://static.v6velugu.com/uploads/2025/02/problems-of-gram-panchayat-secretaries-should-be-solved-in-telangana_lmOy2k0dNe.jpg)
గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమస్యలు ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా దర్శనమిస్తున్నాయి. దాదాపు తొమ్మిది వేలకు పైచిలుకు పంచాయతీ కార్యదర్శులు గత ప్రభుత్వ హయాంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నెగటివ్ మార్కింగ్ కఠిన పోటీ పరీక్షలో నెగ్గి నియామకం పొందారు.
కానీ, నిబంధనల వల్ల వారికి అందవలసిన సర్వీస్‌ను, నోషనల్ ఇంక్రిమెంట్‌ను కోల్పోతున్నారు. ఈ సర్వీస్ యాడింగ్ అనేది ఎటువంటి ఆర్థికపరమైన విషయం కాదు. ఈ విషయమై పలుమార్లు మంత్రులు, ఉన్నత అధికారులను వేడుకొన్నప్పటికి ఎటువంటి స్పందన లేదు. అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల వెతలు వర్ణనాతీతం.
నెల శాలరీకి కూడా నెలల తరబడి వేచి చూడవలసిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులుగా కొనసాగుతున్నవారందరిని జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా గుర్తించి రెగ్యులరైజెషన్ చెయ్యాలి.
గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, రైతులు, కూలీలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఆనాథలు, పేదవారు, బడుగు, బలహీనవర్గాలు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు ఇలా అన్ని వర్గాల ప్రజలతో ప్రభుత్వం తరఫున అనుసంధానమవుతుంటారు.
తీవ్రమైన పని ఒత్తిడి, నిధులు లేక దాదాపు ఒకసంవత్సరం కాలం నుంచి సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటి నుంచి గ్రామ పంచాయతీల ఆర్థికభారం కార్యదర్శుల మీద మోపడం, రోజువారీ గ్రామాలలో పనులకు కార్యదర్శులు అప్పులు చేసి, ఉన్నత అధికారుల ఒత్తిడి తట్టుకోలేక గ్రామ ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా పనులు నిర్వహిస్తూ అప్పుల పాలయ్యారు.
అనేక కారణాల చేత ఇప్పటివరకు దాదాపు నలభై రెండు మంది పంచాయతీ కార్యదర్శులు ప్రాణాలు వదిలారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టి పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై ఉన్నత స్థాయి కమిటీ నియమించి కార్యదర్శుల సమస్యలను పరిష్కరించాలి.
తీవ్రమైన పనిభారం
గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధిలైట్లు, దాదాపుగా యాభైకు పైగా రిజిస్టర్ ల నిర్వహణయే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, గ్రామ పంచాయతీల సమావేశాలు, పంచాయతీ పాలకవర్గంతో అనుసంధానం, కలెక్టర్ ఆదేశాలతో నిర్వర్తించే ఆదనవు పనులకు తీవ్రమైన ఒత్తిడికి కార్యదర్శులు గురవుతున్నారు.
ఉపాధి హామీ పనులు, బూత్ లెవెల్ ఆఫీసర్ వంటి ఎలక్షన్ పనులు వంటి అదనపు పనులు అప్పగించడం వలన తీవ్రమైన పని ఒత్తిడికి లోనవుతున్నారు. ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించారు.
ఉపాధి హామీ పనులతోపాటు అదనంగా రోజువారీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నా.. పర్యవేక్షణ లోపం అనే సాకుతో సోషల్ ఆడిట్లో వేల రూపాయల జరిమానాలు విధిస్తుండటం శోచనీయం. ప్రజా పాలనా కార్యక్రమాల నిర్వహణ, ఇటీవల జరిగిన కులగణన సర్వే, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే, రేషన్ కార్డు సర్వే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఇలా అన్ని కార్యక్రమాలను పంచాయతీ కార్యదర్శులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
కానీ, వారి శ్రమకు తగ్గ ఫలితం లభించడం లేదు. ప్రజాప్రభుత్వంపై పంచాయతీ కార్యదర్శులు అందరికి సంపూర్ణ విశ్వాసం ఉన్నది. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి పంచాయతీ కార్యదర్శుల అన్ని సంఘాల యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం.
- మహమ్మద్ ఫజల్, పంచాయతీ కార్యదర్శుల సంఘం, ఖమ్మం జిల్లా