బస్తా ఉల్లి ధర రూ50.. ఎగబడ్డ జనం.. గిట్టుబాటు ధరలేక రైతు విలవిల

ఉల్లి రైతుల కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట మార్కెట్ లో గిట్టుబాటు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో కిలో ఉల్లి ధర 100 రూపాయలు దాటిన సందర్భాలు చాలా చూశాం. ఇప్పుడు ఒక్క బస్తాకు కనీసం 100 రూపాయలు కూడా రావడం లేదంటే.. ఉల్లి రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఉల్లిపాయ బస్తాను కేవలం 50 రూపాయలకే అమ్మేశాడు. 

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన ఓ రైతు అతి తక్కువ ధరకే ఉల్లి బస్తాలను అమ్మేశాడు. తక్కువ ధరకే ఉల్లిపాయ బస్తాలు వస్తున్నాయని జనం కూడా వాటి కోసం ఎగబడ్డారు. 

ఓ రైతు ఉల్లిగడ్డను అమ్మేందుకు వరంగల్ మార్కెట్ కు వెళ్లాడు. అక్కడ గిట్టుబాటు బాటు ధర తక్కువ ఉండడంతో చేసేదేమీ లేక.. చివరకు వాటిని తీసుకుని వెళ్తుండగా.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులో ఉల్లిబస్తాలను అమ్మేశాడు. జాతీయ రహదారి పక్కన లారీని ఆపి.. ఉల్లిగడ్డను ఆమ్మేశాడు. ఒక బస్తాను 50 రూపాయలకే అమ్మకానికి పెట్టడంతో జనం ఎగబడ్డారు. రోడ్డున వెళ్లే చాలామంది ఉల్లిగడ్డ బస్తాలను తీసుకెళ్లారు. కొంతమంది ఫ్రీగా కూడా తీసుకెళ్లారు. ఈ ఘటన రైతుల దుర్భర పరిస్థితులకు అద్దం పడుతోంది.