బ్రిడ్జీలు లేక ఏజెన్సీ గ్రామాల ప్రజల ఇబ్బందులు
వర్షాకాలం వస్తుండటంతో ఆందోళనలో ఆదివాసీలు
ఆదిలాబాద్, వెలుగు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఏటా ఏజెన్సీ గ్రామాల ప్రజలు వర్షం పడితే బిక్కు బిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోంది. సరైన రోడ్డు మార్గం లేక.. వాగులపై వంతెనలు లేక బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. ఎమర్జెన్సీ సమయాల్లో వైద్యం కోసం వెళ్లే వారు ఉదృతంగా ప్రవహించే వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. గర్బిణులను ప్రసవానికి తీసుకెళ్లే సమయాల్లో ఉప్పొంగిన వాగులు దాటలేక వాగు ఒడ్డునే ప్రసవాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాముకాటుకు గురైన వారికి, అనారోగ్యంతో ఉన్నా.. ఇతర ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు వరద వస్తే వారిని ఆసుపత్రికి చేర్చాలంటే నానా యాతన పడాల్సి వస్తోంది.
బ్రిడ్జీలు లేక ఇబ్బందులు
ఎన్నో ఏళ్ల నుంచి వాగులపై బ్రిడ్జీలు నిర్మించకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గిరిజనులు వాగులు దాటాల్సి వస్తోంది. ఉట్నూర్, నార్నూర్, కడెం, దస్తురాబాద్, కెరమెరి, వేమనపల్లి, ఖానాపూర్, పెంబి, బజార్ హత్నూర్, బోథ్, తలమడుగు మండలాల్లోని దాదాపు 30కి పైగా ఏజెన్సీ గ్రామాలు ఆయా గ్రామాల సమీపంలోని వాగులు దాటలేకపోతున్నారు. వరదొస్తే చాలు గ్రామాలతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు తెగిపోతున్నాయి.
బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామం మండల కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉండటంతో ప్రతి వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. బ్రిడ్జీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
ఉట్నూర్ మండలంలో నర్సాపూర్ జే గ్రామం వద్ద ఉన్న వాగుపై బ్రిడ్జీ లేకపోవడంతో అ గ్రామంతో పాటు దాని అనుబంధ గ్రామాలైన లెండిగూడ, జెండగూడ, ఆడగూడ, భీంగూడ గ్రామల ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఈ గ్రామాల ప్రజలంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఆందోళనలు చేసేందుకు నిర్ణయించుకున్నాయి.
నేరడిగొండ మండలం గాజిలి, చింతగూడ, గాంధారి, సేవదాస్ నగర్ తిమ్మాపూర్ గ్రామాలకు వెళ్లాలంటే ఆయా గ్రామాల వద్ద ఉన్న వాగులు దాటి వెళ్లాల్సిందే. అయితే బ్రిడ్జీ నిర్మాణం కాకపోవడంతో ప్రమాదకరంగా దాటాల్సిన పరిస్థితి.
ఏటా కష్టాలు తప్పడం లేదు
వాగుపై బ్రిడ్జీ సౌకర్యం లేక ప్రతి వర్షాకాలం తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. గ్రామాల్లో ఏదైనా అనారోగ్యంతో అత్యవసర పరిస్థితి వస్తే మాకు అంబులెన్సు కూడా రాలేని దుస్థితి. ప్రతి ఏడాది వాగు దాటలేక ఎంతో మంది హాస్పిటల్ కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర సమమయంలో గర్భిణులను తీసుకెళ్లలేకపోతున్నాం. నర్సాపూర్ జె వాగు పై వంతెన నిర్మాణం చేపడితేనే మాకు ఇబ్బందులు దూరమవుతాయి.
కడెం మండలం దత్తాజీపేట గ్రామానికి చెందిన ఓ గర్బిణి దాదాపు నాలుగు గంటల పాటు వాగు ఒడ్డునే ప్రసవ వేదన అనుభవించింది. చివరకు వాగు దాటలేని పరిస్థితుల్లో అక్కడే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికి కూడా వాహనం దాటలేని పరిస్థితి ఉండటంతో స్థానికుల సహకారంతో జేసీబీ ద్వారా వాగు దాటించారు. ఇలా ఈ ఒక్క వాగే కాదు కడెం మండలంలోని ఇస్తాంపూర్, గంగాపూర్ బతుకమ్మ వాగుపై కూడా బ్రిడ్జీ నిర్మాణాలు లేక ప్రతి ఏడాది ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికలప్పుడొచ్చి హామీ ఇస్తుండ్రు
ఎన్నికలప్పుడు వచ్చి మా గ్రా వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇస్తుండ్రు. మళ్లీ ఇటు వైపు చూడటం లేదు. మా ఆదివాసీల సమస్యలు ప్రజాప్రతినిధులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఏటా రెండు మూడు నెలలు వర్షాకాలంలో ఊరు దాటే పరిస్థితి ఉండదు. చిన్న వర్షానికి వాగుకు వరదొస్తుంది. ఎమర్జెన్సీలో అందరి సహాయంతో వాగు దాటుతాం. ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జీ నిర్మించాలని కోరుతున్నం. ఇప్పటికైనా అధికారులు మాకు దారిచూపాలి
ఆందోళన చేపడుతాం
గిరిజన ప్రాంతాల్లో వాగులపై వంతెనలు నిర్మించాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు పిలుపునిచ్చాం. ఒక పక్క సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటే.. మరో పక్క వాగులపై వంతెనలు లేకపోవడంతో వాగులు దాటలేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఎన్నో ఏళ్ల నుంచి బ్రిడ్జీలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్న పట్టించుకోవడం లేదు.
పట్టించుకోని ప్రభుత్వం
వరదల వల్ల ఉమ్మడి జిల్లాలో 150 పైగా గ్రామాలు వాగులపై వంతెనలు, లోలెవల్ వంతెనలు మునిగి వరదలొచ్చి బాహ్య ప్రపంచానికి జనం దూమరమవుతున్నారు. ప్రతి ఏడాది వరదొచ్చిన సమయంలో ఈ లోలెవల్ వంతెనల మీద నుంచి వాహనాలు దాటే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గతేడాది వాగులు దాటుతూ ఉమ్మడి జిల్లాలో 10 మంది చనిపోయారు. తమ ఏజెన్సీ గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జీలు నిర్మించాలని ఆదివాసీలు నిత్యం ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వర్షాకాలం వస్తుండటంతో ఆయా ఆదివాసీ గ్రామాల ప్రజలు వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు. సోమవారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఉట్నూర్ ఏజెన్సీ గ్రామాల ప్రజలు ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.