పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  •  కిషన్​రెడ్డికి మజ్దూర్ సంఘం వినతి
  •  

నస్పూర్, వెలుగు: శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. శుక్రవారం మంచిర్యాలలో సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్​ రెడ్డికి వినతి పత్రం అందించి మాట్లాడారు. పవర్ ప్లాంట్ మూసేసి 15 నెలలు కావస్తున్నా.. కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమురయ్య మొండిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం భూ నిర్వాసితులు తక్కువ ధరలకు భూములు ఇచ్చారని, ఇప్పుడు ప్లాంట్ మూసేయడం ద్వారా భూములతోపాటు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని పేర్కొన్నారు. ప్లాంట్ భూముల ధరలు కోట్లల్లో పలకడంతో ఆ భూములను అమ్ముకునేందుకే ప్లాంట్​ను మూసేశారని ఆరోపించారు. ప్రతి కార్మికునికి రూ.10 లక్షలు యాజమాన్యం చెల్లించాల్సి ఉందని, వారిని ఆదుకోవాలని కోరారు.

దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చినవారిలో భారతీయ మద్దూర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కమలాకర్, బీఎంఎస్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్, శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు కుంటాల శంకర్, కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఆనందరావు తదితరులున్నారు.