తెలంగాణలో ఫిజియోథెరపీ డాక్టర్ల పరిస్థితి మరీ అధ్వానంగా తయారైoది. గత 20 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఒక్క ఫిజియోథెరపీ పోస్టును కూడా భర్తీ చేయలేదు. దీనికి కారణం లేకపోలేదు. 2000 సంవత్సరంలో కుష్టు వ్యాధి అంతరించిపోయింది. అందులో పని చేస్తున్న కొందరు సిబ్బంది ఉద్యోగులకు ఫిజియోథెరపిస్ట్ ఆరు నెలల బ్రిడ్జి కోర్సు నేర్పి వారిని గవర్నమెంట్ హాస్పిటల్లలో గెజిటెడ్ ఉద్యోగులుగా ప్రభుత్వం నియమించింది. దీని కోసం అప్పుడు చాలా అక్రమాలు జరిగాయని, వీరికి మెడికల్ సబ్జెక్ట్స్ పై అవగాహన లేకుండా కేవలం ఆరు నెలల్లో నాలుగైదు విద్యుత్ పరికరాల మీద అవగాహన సంపాదించుకొని ఫిజియథెరపిస్టులుగా చలామణి అయ్యారు. వారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆ ఫిజియోథెరపీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయలేకపోయింది. తెలంగాణ రాష్ట్ర విభజనకు ముందు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 1997-–98 సంవత్సరంలో ఫిజియోథెరపీ విద్యను మొదలుపెట్టింది. ఎన్నో కష్టనష్టాలను ఓర్చు కొని నాలుగున్నర సంవత్సరాలు విద్యను అభ్యసించిన తర్వాత ఫిజియోథెరపిస్టులుగా, డాక్టర్లుగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రతీ సంవత్సరం అప్పట్లో దాదాపు 20 కళాశాలల నుంచి కనీసం 500 మంది బయటకు వచ్చే వారు. వీళ్లలో కొందరు విదేశాలకు వెళ్లిపోయారు. ఇంకొందరు ఇక్కడే సొంతంగా క్లినిక్ పెట్టుకోవడం లేదంటే వేరే హాస్పిటల్స్ లలో పని చేస్తున్నారు.
ఫిజియోథెరపీ అనివార్యమైంది
తెలంగాణ విభజన జరిగిన తర్వాత ఇప్పుడు ఒక్క తెలంగాణ లో దాదాపు 22 కళాశాలలు బీపీటీ, ఎంపీటీ విద్యను అందిస్తున్నాయి. ఈ కళాశాలల నుంచి సంవత్సరానికి ఒక వెయ్యి మంది వైద్య విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం బయటికివస్తున్నారు.
కానీ లాభం లేదు. ఫిజియోథెరపీ కోసం గవర్నమెంట్ కాలేజీలు లేకపోవడం ప్రత్యేక కౌన్సిల్ లేకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాలలో అతి తక్కువ జీతభత్యాలతో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు చివరకు ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఫిజియోథెరపీ వైద్య సేవలను అనుభవించుచున్నారు కానీ ఆ ఫిజియోథెరపిస్టుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. 20 సంవత్సరాల క్రితం ఫిజియోథెరపీ అని అంటే నాయీ బ్రాహ్మణులు మసాజ్ చేసే కార్యక్రమం లాంటిది అని అనుకునేవారు. అప్పట్లో పక్షవాతం వచ్చినవారికి మసాజ్ చేయడం వల్ల వాళ్లు నయమవుతారని, అదే మసాజ్ ను ఫిజియోథెరపిస్టులు కూడా చేస్తారు అనే అపోహ ఉండేది. రాను రాను ఆ అపోహ పోయి అన్ని రకాల ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పుల నివారణ కోసం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్, కరెంటు పరికరాలు ఉపయోగించడం వల్ల మందులతో నయం కానీ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని నాణ్యమైన చికిత్సను అందిస్తున్నాయని ఇప్పుడు అందరికీ తెలిసివచ్చింది.
ALSO READ :గెస్ట్ లెక్చరర్ల ఇంటర్ బోర్డు ముట్టడి.. రెన్యూవల్ చేయాలని డిమాండ్
ఆరోగ్యానికి అనుబంధం
కండరాలు, కీళ్ల నొప్పులు, మెడ నొప్పి, నడుము నొప్పి, భుజం నొప్పి, మోకాళ్ళ నొప్పి, మడమ నొప్పి, పాదం నొప్పి, నడకలో సమస్యలు ఉన్నవారికి మందులతో నయం కాని, దీర్ఘ కాలిక వ్యాధులు ఫిజియోథెరపీ ఎక్సర్సైజస్ వల్ల నయమవుతాయి. ఇంకా కార్డీయో ఫిజియోథెరపీ అంటే గుండెకు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో, 2019లో వచ్చిన కరోనా వ్యాధిని తగ్గించడంలో ఈ కార్డియక్ ఫిజియోథెరపిస్టులు ముందు వరుసలో ఉన్నారు. మనిషిని పూర్తిగా నయం చేయడంలో డాక్టర్లకు ఎంత పని ఉందో అంతకుమించి ఫిజియోథెరపిస్టు మనిషిని స్వతంత్రంగా తయారు చేయడంలో ఎంతో ముఖ్యపాత్ర వహిస్తారు.
తెలంగాణలో కౌన్సిల్ ఏర్పాటేది?
మన తెలంగాణలో ఫిజియోథెరపీ కౌన్సిల్ అనేది లేదు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీ గవర్నమెంట్ స్వతంత్ర ఫిజియోథెరపీ కౌన్సిల్ను ఏర్పాటు చేసుకుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిజియోథెరపిస్టుల మధ్య సమన్వయం లేకపోవడం, వాళ్లను నడిపించే నాయకత్వం లేకపోవడం ఒక కారణం కాగా, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు ముఖ్యమంత్రి కూడా ఈ ఫిజియోథెరపిస్టుల సేవలను పొందుతున్నా, వారిని గుర్తించకపోవడం, న్యాయం చేయకపోవడం మరో కారణం.
- జి. సత్యనారాయణ, స్పోర్ట్స్ ఫిజియో