మూడేండ్లయినా ఒక్క హామీ నెరవేరలే
సీఎం మాట ఇచ్చినా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కాలే
కొత్త గనులు ప్రారంభం కాలే, ఉద్యోగాలూ రాలే
పేర్ల మార్పు చేయట్లే.. అధ్వానంగా దవాఖాన్లలో సౌలత్లు
గోదావరిఖని, వెలుగు: ‘ఎక్కడికైనా నేనే వస్తా, మీ సమస్యలు ఏంటో స్వయంగా అడిగి తెలుసుకుంటా. మీరు చూపించుకుంటున్న దవాఖానలోనే బీపీ చెక్ చేయించుకుంటా. త్వరలోనే సింగరేణి యాత్ర చేపట్టి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా’.. సీఎం కేసీఆర్ స్వయంగా అన్న మాటలివి. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజేకేఎస్) గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. 2017 అక్టోబర్ 8న ప్రగతిభవన్ లో ఆ సంఘం నేతలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలివి. ఇది జరిగి మూడేండ్లయినా.. ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో కార్మికుల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. కొత్తగా ఆరేడు గనుల్ని ప్రారంభిస్తామని, దీంతో ఆరేడు వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయని సీఎం హామీ ఇవ్వడంతో.. మా వారసులకు ఉద్యోగాలొస్తయని కార్మికులు ఆశపడ్డరు. గనుల దగ్గర క్యాంటీన్లలోని మెనూ తయారు చేసుకోవాలని సూచించడంతో తమ సమస్యలు పరిష్కారం కానునున్నాయని సంతోషపడ్డరు. కానీ, మూడేండ్లయినా అందులో ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో సింగరేణి కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త గనులు లేవు.. ఉద్యోగాలు రావు
సింగరేణిలో ఆరు కొత్త గనులను ప్రారంభిస్తే వేల మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం కేసీఆర్ చెప్పడంతో కార్మికులతో పాటు వారి వారసులు ఆనందపడ్డారు. సింగరేణి లెక్కల ప్రకారం మందమర్రిలోని కేకే6, కేకే7, కొత్తగూడెంలోని అనిశెట్టిపల్లి, ఇల్లందులోని గుండాల భూగర్భ గనులతో పాటు భూపాలపల్లిలో కేటీకేఓసీపీ, శ్రీరాంపూర్‌లో ఇందారం ఓసీపీని ప్రారంభించాల్సి ఉంది. కానీ వీటిలో ఒక్క ఇందారం ఓసీపీ పనులు మాత్రమే ఈ మధ్యే ప్రారంభం కాగా, మిగిలిన గనులకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. దీంతో కొత్తగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు.
అధ్వానంగా ఆసుపత్రుల నిర్వహణ
సింగరేణిలో కొత్తగూడెం, గోదావరిఖని, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, భూపాలపల్లిలో ఏరియా ఆసుపత్రులు, మిగిలిన ప్రాంతాలలో డిస్పెన్సరీల ద్వారా కార్మికులు వైద్య సేవలు పొందుతున్నారు. ట్రీట్మెంట్ అందించేందుకు కావాల్సి డాక్టర్లు అందుబాటులో లేక కార్మికులు, రిటైర్డ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అవస్థలు పడుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికీ స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో లేరు. యాజమాన్యం వారిని నియమించట్లేదు. హైదరాబాద్ నుంచి ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్లను తీసుకువచ్చి టెస్టులు చేయిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో ఆర్ధో స్పెషలిస్ట్‌లు, పిల్లల డాక్టర్లు, గైనకాలజిస్ట్‌లు, ఇతర విభాగాల డాక్టర్లు లేరు. ఇక ఎంఆర్‌ఐ స్కానింగ్, గుండెకు సంబంధించి పరీక్షలు చేసే ల్యాబ్స్ ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఆయా ఆస్పత్రులలో జనరల్ ఫిజిషియన్లు లేకపోవడంతో మెడికల్ ఆఫీసర్లే ఆ బాధ్యతలు చేపడుతున్నారు. ఎవరికైనా హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉంటే హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు.
మారు పేర్ల మాటెత్తడం లేదు
సింగరేణిలో కొన్నేళ్ళ కిందట ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛ్ంజ్‌లో పేరు నమోదు చేసుకున్న వారికి పరుగు పందెం ద్వారా ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టేవారు. బొగ్గు గనుల్లో పనులంటే ప్రమాదకరంగా ఉండేవని, చాలామంది ఉద్యోగం చేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా పనిచేయడానికి ఉత్సాహం చూపించిన వారికి ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛ్ంజ్‌లో పేరు లేకపోవడంతో ఉన్నవారిపేరుతో పరుగుపందెంలో గెలిచి ఉద్యోగం పొందేవారు. దీంతో వారి అసలు పేరు ఒకటి, ఉద్యోగంలో పేరు మరొకలా ఉండేది. ఇలా చాలా మంది కార్మికులున్నారు. వీరి పేర్లను అసలు పేర్లకు మార్చుతానని సీఎం హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలు కాలేదు.
ఏదీ అమలు కాలే
ప్రగతి భవన్‌లో జరిగిన కార్మికుల సమ్మేళనంలో మారు పేర్లు మార్చుతామని, సీనియర్ కార్మికులకు ఓసీపీలలో అవకాశం కల్పిస్తామని సీఎం సార్ హామీ ఇచ్చారు. క్యాంటీన్లలో మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తమన్నరు. ఇన్ని హామీల్లో ఒక్కటీ నెరవేరలే.
– కెంగెర్ల మల్లయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు
సిద్దిపేట, గజ్వేల్‌కు నిధులు
సింగరేణి లాభాల్లో ప్రభుత్వం వాటా పొందుతున్నా సంస్థ అభివృద్ధికి ఒక్క పైసా కూడా బడ్జెట్ కేటాయించట్లేదు. పైగా సింగరేణి నిధులను సిద్దిపేట, గజ్వేల్, హుజురాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ఖర్చు చేస్తోంది. ఇలా ఉంటే సింగరేణి అభివృద్ధి ఎలా జరుగుతుంది?
– వి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి
For More News..