బ్యాంక్​ల సర్వర్ డౌన్​తో ఇబ్బందులు

బ్యాంక్​ల సర్వర్ డౌన్​తో ఇబ్బందులు

హైదరాబాద్ : వనస్థలిపురానికి చెందిన మహిపాల్ గౌడ్ ఎల్ బీనగర్​లోని ఓ మొబైల్ షాపులో ఫోన్ రిపేర్ చేయించాడు. బిల్లు రూ.1,200 అయ్యింది. డిజిటల్ పేమెంట్ చేద్దామని ఎంత ప్రయత్నించినా సర్వర్ డౌన్ అని చూపించింది. జేబులో క్యాష్ లేకపోవడంతో ఏటీఎంలో ట్రై చేశాడు. అయితే రెండు, మూడు ఏటీఎంలు తిరిగినా కానీ క్యాష్‌‌ దొరకలేదు. ప్రస్తుతం క్యాష్ ​పేమెంట్స్​కంటే ఆన్‌‌లైన్ లావాదేవీలే ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వాలు కూడా డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్నాయి. దీంతో జేబులో ఒక్క రూపాయి కూడా లేకుండానే చాలా మంది బయటకు వెళ్తున్నారు. మరోవైపు ఏటీఎంలలో కూడా క్యాష్ పెద్దగా ఉంచడం లేదు. అయితే వినియోగదారుల సంఖ్యకు అనుగుణంగా బ్యాంకర్లు సర్వర్లను పెంచడం లేదు. దీంతో కొన్ని సందర్భాల్లో సర్వర్ డౌన్, యూపీఐ నెట్ వర్క్ ఇష్యూ  అంటూ డిజిటల్ పేమెంట్లకు అంతరాయం ఏర్పడుతోంది. గూగుల్ పే, ఫోన్ పే లాంటి పేమెంట్ గేట్ వేల ద్వారా లావాదేవీలు జరగకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో షాపింగ్ చేసిన తర్వాత పేమెంట్ చేసే టైమ్​లో ఈ సమస్య వస్తుండటంతో క్యాష్ కోసం ఏటీఎం సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆన్‌‌లైన్ పేమెంట్స్  పనిచేయకపోవడంతో మరికొందరు షాపింగ్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డుల స్వైపింగ్ మెషీన్లు ఉంటున్నప్పటికీ వీటికి అదనంగా వసూలు చేస్తుండటంతో కార్డులతో పేమెంట్లు చేసేందుకు వినియోగదారులు ఇష్టపడటం లేదు. 

ఏ బ్యాంకులైనా అదే సమస్య..

ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్​బ్యాంకుల వినియోగదారులకు కూడా ఇదే సమస్య ఏర్పడుతోంది. వినియోగాదారుల సంఖ్యకు అనుగుణంగా బ్యాంకర్లు సర్వర్లను ఏర్పాటు చేయకపోవడమే దీనికి కారణం. ఇటీవల పలు బ్యాంకులు ఇతర బ్యాంకులతో అనుసంధానం కావడంతో యూజర్స్ ఒక్కసారిగా పెరిగారు. కానీ పెద్ద పెద్ద బ్యాంకులు కూడా సర్వర్లను పెంచడం లేదు. హైదరాబాద్ జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో అధికారులు ఇదే అంశంపై బ్యాంకర్లకు సూచిస్తున్నారు. సర్వర్లు పెంచి వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశిస్తున్నారు.   

పేమెంట్ ప్రాసెసింగ్...
పేమెంట్ గేట్ వేస్ సంస్థల నుంచి లావాదేవీలు చేస్తున్న సమయంలో సర్వర్ల ప్రాబ్లమ్‌‌తో పేమెంట్ ప్రాసెసింగ్‌‌లో పడుతోంది. కొన్ని సందర్భాల్లో అకౌంట్​లో డబ్బులు డెబిట్ అవుతున్నాయి. తిరిగి 3 నుంచి 5 వర్కింగ్ డేస్​లో అకౌంట్లలో యాడ్ అవుతాయని మెసెజ్‌‌లు వస్తున్నాయి. కొందరికి త్వరగా డెబిట్ అవుతుండగా.. మరికొందరికి ఆలస్యం అవుతోంది. దీనివల్ల ఖాతాల్లో ఎక్కువగా డబ్బులు లేని వారు చాలా ఇబ్బంది పడుతున్నారు.  

సర్వర్లు పెంచాలని సూచిస్తున్నం....

యూజర్లకు అనుగుణంగా సర్వర్లు పెంచాలని  బ్యాంకర్లకు సూచిస్తున్నం. నెలరోజుల్లో సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. మేం కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. సమస్య పరిష్కారం అయ్యాక డిజిటల్ పేమెంట్లకు అసలు ఇబ్బందులు ఉండవు. క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్ల విషయంలో ఎక్కడా అదనంగా వసూలు చేయొద్దు. ఇది ఆర్బీఐ రూల్స్​కు వ్యతిరేకం. ఇలా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీధర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్, హైదరాబాద్ జిల్లా

అదనంగా వసూలు..
ఆన్​లైన్ పేమెంట్లు జరగని టైమ్​లో డెబిట్‌‌, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేద్దామనుకుంటే అదనంగా వసూలు చేస్తున్నారు. పెద్ద పెద్ద స్టోర్లు, షాపింగ్ మాల్స్ మినహా చాలా చోట్ల ఇదే జరుగుతుంది. బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా బ్యాంకుల పేరుతో 2 శాతం ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రశ్నిస్తే కార్డు పేమెంట్ లేదని చెబుతున్నారు. బేగం బజార్, ఉస్మాన్ గంజ్ లాంటి పెద్ద పెద్ద మార్కెట్లలో అయితే స్వైపింగ్ మెషీన్లు లేవని సమాధానం ఇస్తున్నారు.