సర్కారు దవాఖానల్లో సౌలతులు లేక పేషెంట్ల ఇబ్బందులు

  • సర్కారు దవాఖానల్లో సౌలతులు లేక పేషెంట్లను మరో చోటుకి పంపుతున్న సిబ్బంది
  • అన్ని డిపార్ట్​మెంట్లు ఒకే దగ్గర లేకపోవడంతో ఇబ్బందులు
  • ట్రీట్​మెంట్ కోసం రోజుల తరబడి ఎదురుచూపు

రంగారెడ్డి జిల్లాకు చెందిన విఠల్ కాలికి ఇన్​ఫెక్షన్ అయి బ్లీడింగ్ అవుతుండటంతో కుటుంబసభ్యులు ఈ నెల 11న  గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ ఎమర్జెన్సీలో 2 గంటలు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడి నుంచి నిమ్స్​కు తీసుకెళ్లారు. నిమ్స్​ లో రెండు, మూడ్రోజులపాటు ట్రీట్ మెంట్​ అందించారు. జనరల్ సర్జన్​కు సంబం ధించిన ప్రాబ్లమ్ ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక్కడ ఆ డిపార్ట్​మెంట్​ అందుబాటులో లేదని ఉస్మానియాకు వెళ్లమని రెఫర్ చేశారు.

హైదరాబాద్ : సర్కార్​ దవాఖానాల చుట్టూ తిరగలేక పేషెంట్లు, వారి అటెండెంట్లు  ఇబ్బంది పడుతున్నారు.  అన్ని రకాల వ్యాధులకు ట్రీట్ మెంట్​ లేకపోవడం, కొన్నింట్లో  అవసరమైన టెస్టులు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది.  ఒకట్రెండు రోజులు వృథాతో అటు ఇటు తిరగలేక ట్రీట్ మెంట్​ కోసం కొందరు ప్రైవేట్​ఆస్పత్రులకు వెళ్తున్నారు.  సర్కార్ దవాఖానలు కార్పొరేట్​ కు దీటుగా ఉన్నాయని  ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కొన్ని వ్యాధులకు ట్రీమ్ మెంట్​ ఉన్నప్పటికీ టైమ్​కు పేషెంట్లకు అందడం లేదు. 

 

సర్జరీలు వాయిదా..
సర్కార్​ దవాఖానలకు వస్తున్న వారికి ట్రీట్ మెంట్ కు రోజుల తరబడి టైమ్ పడుతోంది.  సర్జరీలు వాయిదా అవుతున్నాయి. ప్రతి సమస్యకూ  ఒక్కో ఆస్పత్రికి తిరగాల్సి వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.  ఉస్మానియా, గాంధీ,  నిలోఫర్, నిమ్స్​ లాంటి పెద్దాసుపత్రుల్లోనే అన్ని రకాల ట్రీట్ మెంట్లు అందుబాటులో లేకపోవడంపై పేషెంట్లు, వారి అటెండెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల ట్రీట్ మెంట్లు ఒకే దగ్గర ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.  

అందుబాటులో లేని సేవలు..
డైలీ 2 వేల మందికిపైగా పేషెంట్లు వచ్చే నిమ్స్​లో చాలా డిపార్టుమెంట్లు అందుబాటులో లేవు. జనరల్ సర్జన్, బర్నింగ్ డిపార్ట్ మెంట్, డెంటల్ క్లినిక్, పీడియాట్రిక్, ఈఎన్​టీ అందుబాటులో లేవు. గైనకాలజీ ఉన్నప్పటికీ ఓపీకే పరిమితమైంది. డెలివరీలు చేసేందుకు లేబర్ రూమ్ లేకపోవడంతో ఇతర ఆస్పత్రులకు వెళ్లక తప్పడం లేదు. నెఫ్రాలజీ డిపార్ట్ మెంట్ ఉన్నప్పటికీ సరిపడా బెడ్లు లేవు. న్యూరో సర్జరీలకైతే  నెలల తరబడి అపాయింట్ మెంట్లు  దొరకట్లేదు. నిలోఫర్​లో నెఫ్రాలజీ, న్యూరాలజీ,ఆర్థో కార్డియాలజీ విభాగాలు అందుబాటులో లేవు. ఈ వ్యాధులకు సంబంధించిన పేషెంట్లను ఉస్మానియా, నిమ్స్​కు రెఫర్  చేస్తున్నారు. ఇలా డైలీ 20 మందికిపైగా వేరే ఆస్పత్రులకు వెళ్తున్నారు.   ఎంఆర్​ఐ స్కానింగ్  అవసరమున్న వారిని ఎంఎన్ జే క్యాన్సర్ ఆస్పత్రికి పంపుతున్నారు. ఉస్మానియా జనరల్​ ఆస్పత్రిలో గైనకాలజీ, పీడియాట్రిక్ డిపార్టుమెంట్లు​ ప్రత్యేకంగా  అందుబాటులో లేవు. పీడియాట్రిక్​కు సంబంధించి ఇక్కడకు ట్రీట్ మెంట్​ కోసం వస్తున్న వారికి ప్రైమరీ ట్రీట్ మెంట్​ అందించి నిలోఫర్ కు పంపుతున్నారు.

గాంధీలో క్యాన్సర్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్
గాంధీలో క్యాన్సర్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కి సంబంధించిన ట్రీట్​మెంట్​ ఎంతో అవరమున్నప్పటికీ ఇక్కడ అందుబాటులో లేదు. ఇక్కడకు వస్తున్న వారిని  ఉస్మానియా, ఎంఎన్​జే కి పంపుతున్నారు. సరోజినిదేవి కంటి, ఎర్రగడ్డ మానసిక, చెస్ట్​, కోఠి ఈఎన్​టీ  ఆస్పత్రులకు వస్తున్న వారికి వేరే ప్రాబ్లమ్స్​ ఏమైనా ఉంటే ఇక్కడి నుంచి ఇతర ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. ఇన్​ పేషెంట్​ లో అడ్మిట్​ అయిన తర్వాత  ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే ఆ ట్రీట్ మెంట్​ కోసం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ కు పంపుతున్నారు. ​ఎంఎన్​జే క్యాన్సర్ ఆస్పత్రిలో  కొన్ని రకాల ట్రీట్ మెంట్​, పరీక్షలు లేకపోవడంతో పేషెంట్లు మరోచోటుకి వెళ్తున్నారు. ఇక్కడ కార్డియలజీ విభాగం లేకపోవడంతో అవరమైన పేషెంట్లను కార్డియాలజిస్ట్​ ఓపీనీయన్ కోసం ఉస్మానియాకు పంపుతున్నారు.