కార్పొరేషన్​గా మహబూబ్​నగర్​

 కార్పొరేషన్​గా మహబూబ్​నగర్​
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • 60 వార్డులతో కార్పొరేషన్​గా ఏర్పాటు
  • ఫిబ్రవరి 6వ తేదీలోపు విలీన జీపీల రిపోర్ట్​ ఇవ్వాలని ఆదేశాలు

మహబూబ్​నగర్, వెలుగు: మహబూబ్​నగర్​ మున్సిపాలిటీని కార్పొరేషన్​గా అప్​గ్రేడ్ చేస్తున్నట్లు ప్రొసిడింగ్స్​ జారీ అయ్యాయి. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మహబూబ్​నగర్​ రూరల్​ మండలంలోని దివిటిపల్లి, జైనల్లీపూర్​ గ్రామ పంచాయతీలను కలుపుతూ కార్పొరేషన్​గా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వెలువడడంతో పాలమూరు ప్రజలు ఫుల్​ హ్యాపీగా ఉన్నారు.

49 వార్డుల నుంచి 60 డివిజన్లకు..

మహబూబ్​నగర్​ మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 49 వార్డులు ఉన్నాయి. అయితే దివిటిపల్లి, జైనల్లీపూర్​ గ్రామ పంచాయతీలను కలుపుకోవడంతో అదనంగా 11 డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. దీంతో కార్పొరేషన్​ 60 డివిజన్లతో ఆవిర్భవించనుంది. ఇప్పటికే మున్సిపల్​ పాలకవర్గం పదవీ కాలం ముగిసింది. కౌన్సిలర్లు, చైర్మన్, వైస్​ చైర్మన్లు తిరిగి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. వార్డులు పెరగడంతో ఆశావహులు కూడా పెరిగే చాన్స్​ ఉంది.

జీపీల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు..

జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని వివరాలు అందజేయాలని మహబూబ్​నగర్​ మున్సిపల్​ కమిషనర్​ను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జీపీలకు చెందిన ఎగ్జిక్యూటివ్, స్పెషల్​ ఆఫీసర్ల నుంచి చార్జ్​ తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. జీపీలకు చెందిన మినిట్స్​ బుక్స్​ను సీజ్​ చేయాలని.. ఈ జీపీల బ్యాంక్​ అకౌంట్లను క్లోజ్​ చేయడంతో పాటు ‘కమిషనర్​ ఆఫ్​ మహబూబ్​నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్’ పేరు మీద ఏదైనా జాతీయ బ్యాంకులో అకౌంట్​ ఓపెన్​ చేయాలని స్పష్టం చేశారు. ఆయా జీపీల పరిధిలోని గవర్నమెంట్​ ఆఫీసులు, ఇతర ప్రభుత్వ బిల్డింగుల వద్ద ‘మహబూబ్​నగర్​ మున్సిపల్​ కార్పొరేషన్’ బోర్డులు ఏర్పాటు చేయాలని ఉత్వర్వులో పేర్కొన్నారు. 

ఆయా గ్రామ పంచాయతీ ప్రొఫైల్, ఆ జీపీల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, జీపీలకు సంబంధించిన ఆస్తులు, జీపీల డిపాజిట్లు, ఇన్వెస్టిమెంట్లు, పన్నుల వివరాలు, అక్కడ అమలవుతున్న ప్రభుత్వ స్కీములు, అక్కడ జరుగుతున్న పనులు, మెటీరియల్​ బిల్లులు, గత మూడేండ్లుగా ఈ జీపీల పరిధిలో బిల్డింగులు, లే అవుట్లకు ఇచ్చిన పర్మిషన్ల వివరాలను ఫిబ్రవరి 6 లోపు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులో ఆదేశించారు.

మరింత స్పీడ్​గా డెవలప్​మెంట్..​

మహబూబ్​నగర్​ మీదుగా ఎన్​హెచ్​-44, ఎన్​హెచ్​-167తో పాటు బైపాస్​ రోడ్డు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్​కు సమీపంలో ఉండడంతో ఇప్పటికే కొంత డెవలప్​మెంట్​ జరగగా, మరింత స్పీడ్​గా పాలమూరు డెవలప్​ అయ్యే చాన్స్​ ఉంది. ఈ క్రమంలో జాతీయ రహదారుల పొంటి రియల్​ ఎస్టేట్​ వ్యాపారం పుంజుకోనుంది. అయితే కార్పొరేషన్​గా ఏర్పాటు కానుండడంతో ప్రతి కాలనీకి రోడ్ల సౌకర్యం, తాగునీరు, విద్య, వైద్యం, రెవెన్యూ తదితర వసతులు మెరుగుపడనున్నాయి. 

అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ సిస్టం అందుబాటులోకి రానుంది. ట్యాక్స్​లు కూడా పెరగనున్నాయి. తద్వారా ఆదాయం సమకూరడంతో పాటు రియల్​ వ్యాపారం కూడా పుంజుకునే చాన్స్​ ఉంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు కానుండడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కార్పస్​ ఫండ్స్​ కూడా రానున్నాయి. కొత్త పరిశ్రమలు వచ్చే సూచనలు ఉండడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.