దేవుడి సేవలో గజరాజులు

ఎవరైనా మన తాహతుకు మించిన బహుమతి ఇస్తే.. ‘రాజు గారు మెచ్చి ఏనుగును దానమిచ్చారు’ అని అంటుంటారు. కేరళలోని ఆలయాలకు మాత్రం భక్తులు ఏనుగుల్ని బహుమానంగా ఇస్తుంటారు. కొందరు ప్రత్యేకించి.. తెలంగాణలోని వేములవాడ రాజన్నకు కోడె దూడల మొక్కు చెల్లించినట్లు గురువాయూర్​ కృష్ణుడికి ఏనుగుల మొక్కు తీర్చుకుంటారు. గురువాయూర్​లో 50 ఏళ్లపాటు దేవునికి సేవలందించిన గజరాజు పద్మనాభన్​ ఈమధ్య కన్ను మూస్తే  ఊరంతా కదలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ నేపథ్యంలో దేవుడి సేవల్లో తరిస్తున్న గజరాజులపై

ప్రత్యేక కథనం.

దయలేని మనుషులు

ఏనుగుల్ని ఊరేగింపులకు రెంట్​కి​ ఇవ్వడంవల్ల వచ్చే ఆదాయం సంగతెలా ఉన్నా.. ఆ సమయంలో అవి నరకం చూస్తాయి. ర్యాలీలు, ఉత్సవాల్లో జనం చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. లౌడ్​ స్పీకర్లతో చెవులు చిల్లులు పడేలా సౌండ్లు చేస్తారు. మరో పక్క బాణా సంచా పేలుళ్లుంటాయి. వీటి మధ్య ఏనుగులు ఒక్కోసారి చికాకు పడిపోయి మావటీల అదుపు తప్పుతాయి. అంతేకాకుండా, వాటిని దగ్గరి ఊళ్లకు తారు రోడ్లపైనే నడిపించి తీసుకెళ్తారు. దూర ప్రాంతాలకు ట్రక్కుల్లో తరలిస్తారు. ఆ సమయాల్లో అవి చాలా ఎండను భరించాల్సి ఉంటుంది. తిండి, నీడ, నీళ్లు లాంటివేవీ లేకుండా యజమాని రెంట్​ కుదిర్చిన చోట్లకు వెళ్లాల్సిందే. సహజంగా ఏనుగు ఉబ్బరాన్ని భరించలేదు. భారీ శరీరం కావడంతో దానికి నీళ్లు ఎక్కువ కావాలి. చల్లటి గాలి కూడా తగలాలి. టూరిజం, మతం పేరుతో ఏనుగుల్ని ఈ రకంగా హింసించకూడదని జంతు ప్రేమికులు ఆందోళన చేస్తున్నారు.

కేరళలో ఉత్సవాలు అనగానే పది, పన్నెండు అడుగుల ఎత్తుండే ఏనుగుల ఊరేగింపు కళ్లముందు కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో బాగా పేరున్న దేవాలయాల్లోనే కాదు, దాదాపు అన్ని గుళ్లలోనూ ఏనుగులు స్పెషల్​ అట్రాక్షన్​గా నిలుస్తాయి. ఏనుగుల్ని సొంతంగా మెయింటైన్​ చేయలేని ఆలయాలు.. పెద్ద టెంపుల్స్​ నుంచి అద్దెకు తెచ్చుకుని ఉత్సవం చేసుకుంటాయి. భక్తులు ఏనుగుల్ని మొక్కుబడిగా సమర్పించుకోవడం కేరళలో ఆనవాయితీ. పెద్ద పెద్ద గజరాజులతో జరిపే ఊరేగింపులకు గురువాయూర్​లోని శ్రీకృష్ణ దేవాలయం పెట్టింది పేరు. ఈ గుడికి ఒకప్పుడు 60 వరకు సొంత ఏనుగులుండేవి. ప్రస్తుతానికి 47 మాత్రమే ఉన్నాయి. వాటి కోసం పెద్ద ఏనుగులశాల నిర్వహిస్తుంటారు. వాటిలోని ఏనుగుల్ని రోజువారీ అద్దెకి ఇతర గుడులకు, అధికారిక కార్యక్రమాలకు ఇస్తుంటారు. ఈ రకంగా ఇవ్వడం ద్వారా లక్షల్లో ఆదాయం వస్తుంది.

దేశంలో అస్సాంలోనూ, కేరళలోనూ ఏనుగులు ఎక్కువ. కేరళలో ఏనుగులను బాగా మచ్చిక చేసుకుని, వాటి ద్వారా అనేక సర్వీసులు పొందగలుగుతున్నారు. ఆలయ ఊరేగింపుల్లోనే కాకుండా మసీదులు, చర్చిల్లో జరిగే వేడుకల్లోనూ ఏనుగులు పాల్గొంటున్నాయి. కేరళలోని టింబర్ యార్డ్​ల్లో ఏనుగులతో దుంగలు మోయిస్తుంటారు. కేరళ​ గవర్నమెంట్​ ఎంబ్లమ్​లో ఏనుగు ఉండటాన్నిబట్టి దానికి ఇస్తున్న విలువను అర్థం చేసుకోవచ్చు. జనాలకు మచ్చికైన ఏనుగులు మళ్లీ అడవుల్లోకి పారిపోయినా అక్కడి ఏనుగులు వాటిని రానివ్వవని చెబుతుంటారు. ఆలయాల్లో జరిపే ఊరేగింపులు చాలా ముచ్చటగా ఉంటాయి. ఏనుగులకు బంగారు తాపడం చేసిన ‘నెట్టిపట్టం (పెద్ద పతకం)’ ముఖంపై అలంకరిస్తారు. మెడలో గంటలు, హారాలు వేస్తారు. ఒంటి మీద తెల్లని మఖమల్​ బట్ట కప్పుతారు. ఇలా ప్రత్యేకంగా అలంకరించిన ఏనుగుపై పొడవాటి చామరాలు పట్టుకుని మనుషులు నిలబడతారు. కూడల్​మాణిక్యం గుడిలో 17 ఏనుగులతో రోజూ ఊరేగింపు నిర్వహిస్తారు. వాటిలో ఏడింటిపై బంగారు తాపడమున్న నెట్టిపట్టం, మిగతా వాటిపై వెండితో చేసిన నెట్టిపట్టం అమరుస్తారు. వృశ్చికోల్సవంలోని తృప్నితుర పూర్ణత్రయీశ ఆలయంలో 15 ఏనుగులతో నిత్య ఊరేగింపు ఉంటుంది. ఈ గుడిలో జరిగే ఫెస్టివల్​ ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు పొందింది.

బౌద్ధులకు చాలా గౌరవం

ఆలయాల్లో ఏనుగుల్ని పోషించడమనేది తిరుపతితోపాటు శ్రీలంక, థాయిలాండ్​ల్లో ఉంది. క్రీస్తు పూర్వం 2500–1500 మధ్య సింధు నాగరికతలోనూ ఈ సంప్రదాయం ఉన్నట్లు అక్కడ దొరికిన ఏనుగు ముద్రలను బట్టి తెలుస్తోంది. శివపార్వతుల కొడుకైన వినాయకుడు ఏనుగు ముఖంతోనే ఉంటాడు. ఏనుగును బుద్ధికి, బలానికి చిహ్నంగా చెబుతారు. వాటికుండే పెద్ద చెవులను వినికిడికి, చిన్న కళ్లను సూక్ష్మ దృష్టికి, తొండాన్ని శ్రమకు, పొట్టను ఆహారానికి గుర్తుగా సాహిత్యంలో పేర్కొంటారు. ఏనుగుల్లో చాలా అరుదుగా ఉండే తెల్ల ఏనుగును సాక్షాత్తూ ఇంద్రుడి వాహనమైన ఐరావతంగా కొలుస్తారు. లక్ష్మీదేవి, ఇంద్రుడు, శచీదేవి, బృహస్పతులకు ఏనుగే వాహనమని మన పురాణాలు చెబుతున్నాయి. హిందువులే కాకుండా అనేక దేశాల్లోని బౌద్ధులు సైతం ఏనుగును అతి పవిత్రంగా, అదృష్ట దేవతగా భావిస్తారు.

మావటీల హింసలు

దేవుడి సేవలో ఉండే గజరాజులను మావటీలు హించిస్తారనే ఆరోపణలున్నాయి. ప్రతి ఏనుగుకి ఇద్దరు మావటీలుంటారు. వీళ్లలో దాదాపు 60 శాతం మంది తాగుబోతులే! ఏనుగుల్ని మచ్చిక చేసుకోవడం కోసం వాళ్ల దగ్గరుండే అంకుశాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతుంటారని యానిమల్​ వెల్ఫేర్​ బోర్డ్​ (ఏడబ్ల్యుబీఐ) ఓ నివేదికలో పేర్కొంది.

మనుషుల్లాగే ఏనుగులకు కూడా 20–40 ఏళ్ల వయసు యవ్వన కాలంలాంటిది. ఆ సమయంలో ఏనుగులతో విపరీతంగా పనిచేయించడం, ఇష్టమొచ్చినట్లు రెంట్​కి తిప్పడం, విశ్రాంతి ఇవ్వకుండా గంటలకొద్దీ నిలబెట్టి వాయిద్యాల హోరుతో ఉత్సవాలు జరపడం చేస్తుంటారు. దీనివల్ల అనారోగ్యంతోపాటు సైకలాజికల్​గా స్ట్రెస్​కి గురవుతాయి. తిండి విషయంలోనూ వాటిపట్ల శ్రద్ధ చూపరు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పేగు సంబంధ వ్యాధులు వస్తున్నాయి. దీంతో చిన్న వయసులోనే చనిపోతున్నాయి.

కేశవన్​కి అరుదైన గౌరవం

గురువాయూర్​ శ్రీకృష్ణుడికి 1922లో ఓ ఏనుగు బహుమానంగా వచ్చింది. నీలాంబురు సంస్థానానికి చెందిన వలియ రాజా తనను శత్రువుల బారి నుంచి కాపాడమని శ్రీకృష్ణుణ్ని ప్రార్థించాడు. ఆ గండం నుంచి గట్టెక్కించినందుకు ఏనుగుకు ‘కేశవన్​’గా పేరుపెట్టి మొక్కు తీర్చుకున్నాడు. అప్పటి నుంచి 1976లో చనిపోయే వరకు 54 ఏళ్లపాటు కృష్ణ సేవలోనే గడిపిందీ ఏనుగు. మూడున్నర మీటర్ల (11 అడుగులకు పైగా) ఎత్తుండే కేశవన్​ను భక్తులు ‘గజరాజన్’గా పిలుచుకునేవారు. ఈ ఏనుగు చనిపోయిన గురువాయూర్ ఏకాదశిని ఇప్పటికీ ఘనంగా నిర్వహిస్తుంటారు. కేశవన్​ సేవలకు గుర్తుగా 12 అడుగుల విగ్రహం పెట్టారు. కేశవన్​ని ఎంతగా ప్రేమించేవారంటే.. ఈ ఏనుగుపై ఏకంగా ఓ సినిమానే తీశారు! ‘గురువాయూర్​ కేశవన్’ పేరుతో భరతన్​ 1977లో తీసిన సినిమా చాలా హిట్టయ్యింది.

ప్రత్యేక లక్షణాలుంటేనే…

కేరళలో ఏనుగుల్ని అడవుల్లో పట్టుకుని ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారు. కొన్ని సందర్భాల్లో అస్సాం, బీహార్​ లాంటి దూర ప్రాంతాల నుంచీ తెస్తారు. పాత కాలంలో మహారాజులు, సంపన్నవంతులు నిర్మించిన దేవాలయాల్లోనే ఏనుగులను పోషించేవారు. ఆ గుడుల్లోనే ఏనుగులతో ఉత్సవాలు, ఊరేగింపులు జరిపేవారు. క్రమేపీ ఏనుగుల్ని దేవుడి సేవకు ఉపయోగించడమనేది కేరళలో సంప్రదాయంగా మారింది. ఏనుగుల్ని టింబర్ డిపోల్లో, గుడుల్లో ఉపయోగించుకుంటారు. అయితే.. ప్రతి ఏనుగుకీ దేవుడి సేవ చేసే ఛాన్స్​ రాదు. ఆ భాగ్యం దక్కాలంటే ప్రత్యేక లక్షణాలు ఉండాలి.

అవి..

ముఖం మీద మూపురాలు వేర్వేరుగా, సమాన ఎత్తులో ఉండాలి.
చెవులు విశాలంగా వింజామరను పోలినట్లు ఉండాలి.
కళ్లు తేనె రంగులో మెరుస్తుండాలి.
దంతాలు పొడవుగా, పైకి మొనదేలి ఉండాలి.
తొండం నేలను తాకేంత పొడవుగా ఉండాలి.

శ్రీవారి సేవలో..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆస్థానంలో ఎనిమిది ఏనుగులు ఉన్నాయి. తిరుమల గోశాలలో మహాలక్ష్మి, పద్మజ; తిరుపతి గోశాలలో వైష్ణవి, లక్ష్మి, అవనిజ, పద్మావతి, రేవతి; తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ గోశాలలో శ్రీనిధి  ఉన్నాయి. ఇవి ఆయా గుళ్ల పరిధిలో నిత్య వాహన సేవల్లో తరిస్తున్నాయి. మహాలక్ష్మి వయసు 56 ఏళ్లు. అన్ని ఏనుగుల కన్నా పెద్దది. శ్రీనిధి వయసు 12 ఏళ్లు. చిన్నది. ఇవి రోజూ ఉదయం తిరుమల ఆలయ మహాద్వారం వద్ద దర్శనమిస్తాయి.

సాయం సంధ్యా సమయంలో పుర వీధుల్లో జరిగే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప తిరుచ్చి వాహన ఊరేగింపులో పాల్గొంటాయి. పురాణాల ప్రకారం గజాలంటే ఐశ్వర్యానికి గుర్తు. శ్రీమహా విష్ణువు దేవేరి అయిన శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టవాహనం ఏనుగు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వర వైభవ, సిరి సంపదలకు సూచికలూ ఇవే. ఒక్కో ఏనుగు ఆలనా పాలనకు టీటీడీ ఏటా సుమారు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు ఖర్చు పెడుతోంది.

రోజుకు రెండున్నర లక్షల సంపాదన!

గురువాయూర్​లో 50 ఏళ్లపాటు దేవుడికి సేవలు అందించిన పద్మనాభన్​ కన్నుమూశాడు. 1954లో శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చి అక్కడే ఉండిపోయాడు. ఇన్నేళ్ల సర్వీసులో ఏ రోజునా ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని భక్తులందరూ తలచుకున్నారు. ఇంతకీ ఎవరీ పద్మనాభన్​ అంటే కేరళ ఆలయ సంప్రదాయాల ప్రకారం దేవుడి ఊరేగింపులో పాల్గొనే ఏనుగు. దీన్ని భక్తులు ‘గజరత్నం’గా పిలుచుకుంటారు.

ఒట్టప్పాలం(పాలక్కాడ్)కి చెందిన ఈపీ బ్రదర్స్​ ఈ ఏనుగును 1954లో దేవుడికి సమర్పించారు. త్రిసూర్​ పూరమ్​ ఉత్సవంలో పద్మనాభన్​దే స్పెషల్​ ఎట్రాక్షన్​. దాదాపు 50 వరకు ఏనుగులు ఇందులో పాల్గొంటాయి. వాటికి లీడర్​ ఈ గజరత్నమే. త్రిసూర్​ పూరమ్​ సమయంలో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహాన్ని ఈ ఏనుగుపైనే ఊరేగించేవారు. 60 ఏళ్లు వచ్చేవరకు పద్మనాభన్​కి చాలా డిమాండ్​ ఉండేది. రోజూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేది. అద్దెకు ఇవ్వడం ద్వారా రోజుకు రెండున్నర లక్షల రూపాయల వరకు దేవస్థానానికి రాబడి ఉండేదట! 2004లో పాలక్కాడ్​ జిల్లాలోని నెన్మారలో జరిగిన వెళ్లంగి ఉత్సవంలో పాల్గొన్నందుకు రెండు లక్షల పాతిక వేల రూపాయలు రెంట్​ వచ్చినట్లు చెబుతారు. టెంపుల్​ ఫెస్టివల్స్​కి వెళ్తే రోజుకి రూ.55 వేలు, ప్రత్యేక సందర్భాలకు వెళ్తే లక్ష అద్దె వసూలు చేసేది దేవస్థానం. ఇంతకుముందు గురువాయూర్​ దేవస్థానంలో సేవలందించిన కేశవన్​ అవతారంగా పద్మనాభన్​ని భావిస్తారు. ఇది 83 ఏళ్ల వయసు వచ్చేవరకు ఊరేగింపుల్లో పాల్గొనేది. వయసు పెరగడంతో ఫారెస్ట్​ డిపార్టుమెంట్​ అభ్యంతరం చెప్పింది. నెల్లాళ్లుగా అనారోగ్యంతో బాధపడి చివరికి కన్నుమూసింది.

వేలాది మంది భక్తులు, రాష్ట్ర మంత్రులు పద్మనాభన్​ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఫారెస్ట్​ చట్టాల ప్రకారం.. ముందుగా పోస్ట్​మార్టమ్​ చేసి, ఎర్నాకుళం జిల్లా కొడనాడు అటవీ ప్రాంతంలో దహనం చేశారు. భక్తులు ‘నారాయణ, నారాయణ’ మంత్రం జపిస్తుండగా గంధపు చెక్కలతో అంత్యక్రియలు జరిపారు.

see also: ఈ బ్యాగ్‌తో కరోనాను చంపొచ్చు