- 2015లో ఇండ్ల రెగ్యులరైజ్ కోసం డబ్బులు కట్టిన దరఖాస్తుదారులు
- రెగ్యులర్ చేస్తరా.. డబ్బులు వెనక్కిస్తారా అని డిమాండ్
- కొనసాగుతున్న రెగ్యులరైజ్ ప్రాసెస్
ఖమ్మం/ సత్తుపల్లి, వెలుగు: ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదల ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్ కోసం ప్రాసెస్ కొనసాగుతోంది. మరోవైపు జీవో 59 ప్రకారం.. 2015లో తాము పెట్టిన దరఖాస్తులను ప్రభుత్వం రిజెక్ట్ చేసిందని, అప్పుడు ప్రభుత్వానికి డీడీ ద్వారా కట్టిన ఫీజును తిరిగి ఇవ్వలేదంటూ పలువురు దరఖాస్తుదారులు చెబుతున్నారు. నిషేధిత భూముల జాబితాలో ఉన్న కారణంగా అప్పట్లో రెగ్యులరైజ్ చేయకుండా తిరస్కరించారని, ఇప్పుడు వాటిని రెగ్యులరైజ్ చేయాలని, లేదంటే తాము కట్టిన ఫీజు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
2015లో జీవో 59
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో జీవో 59ను ప్రభుత్వం అమలు చేసింది. దరఖాస్తుతో పాటు మార్కెట్ విలువలో 25 శాతం డీడీ తీసి అప్లై చేసుకోవాలని సూచించడంతో చాలా మంది ఫీజు చెల్లించారు. అధికారుల ఫీల్డ్ సర్వే లో రెగ్యులరైజేషన్ కు అప్లై చేసుకున్న స్థలాలు ప్రభుత్వ నిషేధిత భూముల జాబితాలో (అసైన్డ్ భూములు, రిజర్వ్ ఫారెస్ట్ భూములు, కోర్టు కేసులు, కుంట, శిఖం, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడం, భూదాన్ పట్టా, దేవాదాయ, వక్ఫ్) ఉండడంతో కొన్ని వందల అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. అయితే అడ్వాన్స్ కింద చెల్లించిన డీడీ ఫీజును మాత్రం తిరిగివ్వలేదు.
వాటిని అప్పట్లో తహసీల్దార్ల అకౌంట్లలో జమ చేసి, దాదాపు మూడు నెలల పాటు ఉంచారు. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు. అప్పటినుంచి లబ్ధిదారులు తమ డబ్బులు తిరిగివ్వాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇలా జిల్లాలో కొన్ని వందల మంది లబ్ధిదారులకు చెందిన రూ.కోటికి పైగా ప్రభుత్వ ఖజానాలో ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
కొనసాగుతున్న సర్వే
ప్రస్తుతం రెగ్యులరైజేషన్ సర్వే కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 2 వేల మంది లబ్ధిదారులకు 59 జీవో ప్రకారం రూ.50 కోట్ల వరకు డిమాండ్ నోటీసులను అధికారులు అందించారు. వాటిలో దాదాపు 90 శాతానికి పైగా ఎక్కువ ఫీజు ఉందనే కారణంతో డబ్బులు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం హైవ్యాల్యూ ప్రకారం నోటీసులను అందించిన వారికి ఫీజును రివైజ్ చేస్తున్నారు. సత్తుపల్లికి చెందిన ఒక లబ్దిదారుడికి రెండు నెలల కింద రూ.23 లక్షలు చెల్లించాలని డిమాండ్ నోటీస్ రాగా, తాజాగా ఇంటికి వచ్చిన అధికారులు రివైజ్డ్ లిస్ట్ ప్రకారం కేవలం రూ.రెండున్నర లక్షలు చెల్లిస్తే చాలంటూ వివరించారు. దీంతో తగ్గిన మొత్తాన్ని చెల్లించేందుకు ఆ లబ్ధి దారుడు ఒప్పుకున్నా, అందుకు అధికారికంగా మాత్రం డిమాండ్ నోటీసు ఇవ్వకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన విధంగా డబ్బులు కట్టిన తర్వాత రెగ్యులరైజ్ చేయకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అదే టైంలో ఇప్పటికే మొదటి విడత చెల్లించిన వారు మాత్రం తాము ముందుగా కట్టడం వల్ల ప్రభుత్వం తగ్గించిన మొత్తాన్ని నష్టపోయామా అని ఆలోచనలో పడ్డారు. తమకు కూడా ప్రభుత్వం ఫీజు తగ్గించి రెగ్యులరైజ్ చేయాలని అడుగుతున్నారు.
2015 లో కట్టిన డీడీలు వెనక్కి ఇవ్వండి
2015లో కూడా ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం డీడీ లు కట్టి దరఖాస్తు చేసుకున్నాం. ఆ తర్వాత దరఖాస్తులు రిజెక్ట్ చేసినా డబ్బు తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ రెగ్యులరైజేషన్ పేరుతో పెద్ద మొత్తంలో డిమాండ్ నోటీసులు జారీ చేశారు. గతంలో మేము చెల్లించిన డీడీని మాకు ఇచ్చి పెద్ద మొత్తంలో కొత్తగా ఇచ్చిన డిమాండ్ నోటీసులను రివైజ్ చేయాలి. గాదె అరుణ, ద్వారకాపురి కాలనీ, సత్తుపల్లి
నోటీసులు వెనక్కి తీసుకోవాలి: సీపీఎం
కూసుమంచి, వెలుగు: పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజ్కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని సీపీఎం నాయకులు కర్ణబాబు డిమాండ్ చేశారు. గురువారం కూసుమంచి తహసీల్దారు మీనన్ కు వినతిపత్రం అందించారు. నాయకన్‌గూడెంలో హైస్కూల్ వెనుక150 కుటుంబాలకు ప్రభుత్వం రైగ్యులరైజ్పేరుతో రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు చలానా చెల్లించాలని నోటీసులు ఇచ్చిందని ప్రభుత్వమే ఉచితంగా రెగ్యులరైజ్‌చేయాలని డిమాండ్ చేశారు.