
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్న ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసును పటాన్ చెరుకు తరలింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. మూడు నెలల కిందే సర్కారు ఉత్తర్వులు ఇవ్వగా.. వెనక్కి తీసుకోవాలని సంగారెడ్డిలో ప్రజా సంఘాలు, లోకల్ లీడర్లు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్ తరలింపును వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్లారు. పరిశీలించిన కోర్టు రిజిస్ట్రేషన్ ఆఫీసు తరలింపుపై స్టే విధించడంతో పాటు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లేకపోవడంతో కోర్టు స్టే ఇచ్చిందని పిటిషనర్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు.
మొదటి నుంచీ వివాదమే
ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసును పటాన్ చెరుకు తరలిస్తున్నట్లు మార్చి 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచి వివాదం మొదలైంది. సంగారెడ్డి లోకల్ లీడర్లు, ప్రజా సంఘాలు వ్యతిరేకించగా... పటాన్ చెరుకు చెందిన లీడర్లు మంచి నిర్ణయమని స్వాగతించారు. నిబంధనలకు విరుద్ధంగా మార్చారని ఒకరు ఆరోపించగా.. రూల్స్ ప్రకారమే వచ్చిందని మరొకరు వాదించారు. ఇలా దాదాపు నెలరోజుల పాటు వివాదం కొనసాగింది. చివరికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హైకోర్టును వెళ్లగా స్టే రావడంతో ప్రభుత్వం అయోమయంలో పడింది.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఉత్తర్వుల్లోనే..
పటాన్ చెరులో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పలుమార్లు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీశ్‌రావు, కేటీఆర్‌ను కలిశారు. వారి ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సబ్ రిజిస్ట్రార్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇదే ఉత్తర్వుల్లోనే కందిలో ఉన్న ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసును కూడా పటాన్ చెరుకు మారుస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదే వివాదానికి కారణమైంది. ఏప్రిల్ 1న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పటాన్ చెరులో ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో ఉన్న పంచాయతీరాజ్ డీఈఈ ఆఫీసు భవనంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను ప్రారంభించారు. అయితే పనులు పెండింగ్‌లో ఉండడంతో అధికారులు కందిలో ఉన్న ఉమ్మడి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసు భవనంలోనే పటాన్ చెరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఉత్తర్వులపై కోర్టు స్టే ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ ఆఫీసే కాదు.. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తరలింపుపై కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.