టీచర్లను సర్దుబాటు చేస్తుండ్రు .. విద్యార్థులకు తీరనున్న కష్టాలు

  • జిల్లాలో ఉపాధ్యాయుల కొరతను అధిగమించేందుకు చర్యలు
  • అవసరమున్న స్కూళ్లలో 131 మంది నియామకం
  • 392 అకాడిమిక్ ఇన్​స్ట్రక్టర్ల పోస్టుల కోసం సర్కార్ ప్రతిపాదనలు

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లను సర్దుబాటు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అవసరమున్న స్కూళ్లలో టీచర్లను తాత్కాలికంగా నియమించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్​ జిల్లాలో ఉపాధ్యాయులు ఉన్నచోట విద్యార్థుల సంఖ్య లేదు.. స్టూడెంట్లు ఉన్నచోట సరిపడా టీచర్లు లేని పరిస్థితి ఉంది. 

ఇటీవల డీఎస్సీ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాల విడుదల, రిక్రూట్​మెంట్ ​ప్రాసెస్ ​పూర్తయ్యేవరకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తుండంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఆయా పాఠశాలల్లో అవసరానికిమించి (మిగులు) ఉన్న టీచర్లను అవసరమున్న బడుల్లో సర్దుబాటు చేస్తున్నారు. వీరందరినీ తత్కాలికంగా ఆయా పాఠశాలల్లో నియమించే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది.

131 మంది సర్దుబాటు..

ఉపాధ్యాయులు లేక సతమతమవుతున్న పాఠశాలలకు సర్దుబాటు చర్యలతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి. ఇటీవల జిల్లాలో ఆయా పాఠశా లల్లో సర్ ప్లస్ ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఎంఈవోలు, ప్రాధానోపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకున్న విద్యాశాఖ అధికారులు సర్దుబాటు జాబితాను సిద్ధం చేశారు. 92 మంది ఎస్జీటీ,39 మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 131 మంది టీచర్లను సర్దుబాటు కింద పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం టీచర్ల పోస్టులు 3004 ఉండగా ప్రస్తుతం 2,349 మంది పనిచేస్తున్నారు. 655 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. త్వరలో డీఎస్పీ ద్వారా 299 పోస్టులు భర్తీ కానున్నాయి.

392 వీవీల పోస్టులు మంజూరు చేయాలని..

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చేందుకు సర్కార్ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ఈ విద్యా సంవత్సరానికి అకడమిక్ ఇన్​స్ట్రక్టర్లుగా విద్యావలంటీర్ల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. గతంలో పనిచేసిన వలంటీర్లను కరోనా సమయంలో తొలగించగా, అప్పటి నుంచి మళ్లీ నియమించలేదు. తాజాగా వారిని అకడమిక్ ఇన్‍స్ట్రక్టర్లుగా అవకాశం కల్పించి విద్యాబోధన కుంటుపడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

Also Read : ఎస్‌బీఐ చైర్మన్​గా పగ్గాలు చేపట్టిన గద్వాల్​ బిడ్డ

అకడమిక్ ఇన్​స్ట్రక్టర్లుగా నియమితులైన వారికి నెలకు రూ.15,600 జీతం చెల్లించనుంది. ఇటీవల కొన్ని జిల్లాల్లో వీరిని నియమించుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో ఆదిలాబాద్ జిల్లాలో సైతం 396 అకడమిక్ ఇన్​స్ట్రక్టర్ పోస్టులు మంజూరు చేయాలని కోరుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి జిల్లా అధికారులు ఇటీవల లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరిన్ని పాఠశాలల్లో టీచర్ల కొరత తీరనుంది. 

సర్దుబాటు చేస్తున్నాం..

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల డీఎస్పీ నిర్వహించింది. అయితే ఆ పోస్టులతో పాటు పాఠశాలల్లో అవసరమున్న చోట టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం. విద్యార్థుల సంఖ్య కంటే ఎక్కువగా స్కూళ్లలో 131 మంది టీచర్లు ఉన్నట్లు గుర్తించాం. వీరితో పాటు 392 అకడమిక్ ఇన్​స్ట్రక్టర్ పోస్టులు కావాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశాం. అనుమతి వచ్చిన వెంటనే నియామకాలు చేపడుతాం. 

టి. ప్రణిత, డీఈవో ఆదిలాబాద్