నెలాఖరులోగా ధరణి అప్లికేషన్లు క్లియర్​..!

నెలాఖరులోగా ధరణి అప్లికేషన్లు క్లియర్​..!
  •     ఖమ్మం జిల్లాలో ఇంకా 11 శాతం పెండింగ్ 
  •     భద్రాద్రిలో 25 శాతం పెండింగ్ 
  •     ఎన్నికల పనులతో ఆలస్యమైందంటున్న ఆఫీసర్లు 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధరణి దరఖాస్తుల క్లియరెన్స్ ​ప్రక్రియ నెలాఖరులోగా కంప్లీట్ కానుంది. ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనల మేరకు యుద్ధప్రాతిపదికన అప్లికేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు​, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక కారణంగా ఇప్పటికే ఆలస్యం జరిగిందని అంటున్నారు. 

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు దాదాపు 90 శాతం ధరణి దరఖాస్తులను ఆఫీసర్లు క్లియర్​ చేశారు. మరో 10 శాతం పెండింగ్ ఉన్నా.. వాటిలో తహసీల్దార్ల స్థాయిలోనే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.  ఖమ్మం జిల్లాలో మొత్తం 78,710 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకు 57,101 (73 శాతం) దరఖాస్తులను పరిష్కరించగా, 13,269 (27 శాతం) అప్లికేషన్లను రిజక్ట్ చేశారు. మరో 8,340 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. వీటిలో పట్టాదారు పాస్​ బుక్​లో డేటా కరెక్షన్​కు సంబంధించినవి 6,069 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. 

రికార్డు, క్షేత్రస్థాయిలో తేడా..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు 13,438 ధరణి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు దాదాపు10వేల దరఖాస్తులను ఆఫీసర్లు క్లియర్​ చేశారు. దాదాపు 6,100 అప్లికేషన్లను పరిష్కరించగా, 3,900 రిజక్ట్​ అయ్యాయి. 3,438 దరఖాస్తులు ఇంకా పెండింగ్​లో ఉన్నాయి. ప్రస్తుతం పెండింగ్​లో ఉన్న వాటిలో 1,705 దరఖాస్తులు తహసీల్దార్​ స్థాయిలో, 802 ఆర్డీవో స్థాయిలో, 951 కలెక్టర్​ స్థాయిలో ఉన్నాయి. రెండు వారాల్లోగా వీటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు చర్యలు చేపట్టారు. పెండింగ్​లో దరఖాస్తుల్లో ప్రధానంగా పాస్ బుక్ డేటా కరెక్షన్​లే అధికంగా ఉన్నాయి. రికార్డుల్లో ఒకలా, క్షేత్రస్థాయిలో మరో విధంగా భూమి తేడాలు ఉండడంతో కొంత ఇబ్బంది కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.  ఎన్నికల కోడ్ తో ప్రక్రియ ఆలస్యమైందని అంటున్నారు. 

ఇంకా వస్తున్న అప్లికేషన్లు..

ఒకవైపు ప్రభుత్వం ప్రత్యేకంగా దరఖాస్తులను తీసుకొని క్లియర్ చేస్తున్నప్పటికీ, ఇంకా ధరణికి సంబంధించిన సమస్యలే అధికారుల దగ్గరకు ఎక్కువగా వస్తున్నాయి. ఎన్నికల కోడ్​ ముగిసిన తర్వాత జరిగిన ప్రజావాణిలో కూడా ఎక్కువ సంఖ్యలో ధరణి రిలేటెడ్​ ఫిర్యాదులు వచ్చాయి. ఇది నిరంతర ప్రక్రియని, పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను పరిష్కరించిన తర్వాత మిగిలిన దరఖాస్తులను కూడా పరిష్కరిస్తామని అధికారులు వెల్లడించారు. 

తహసీల్దార్ ఆఫీస్​కు ఖమ్మం కలెక్టర్

మధిర: చింతకాని మండల తహసీల్దార్ ఆఫీస్​ను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి పెండింగ్ దరఖాస్తులు, రిజిస్ట్రేషన్ స్లాట్​ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి పెండింగ్​ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్​ను ఆదేశించారు. 

పెండింగ్​ అప్లికేషన్ల పరిశీలన

అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ గురువారం సందర్శించారు. ధరణి పెండింగ్​ దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని సూచించారు. రికార్డు రూమ్​ ని పరిశీలించి, తగు సూచనలు చేశారు.