రూల్స్ మారిస్తే మరిన్ని  మెడికల్‌‌‌‌ సీట్లు మనకే

రూల్స్ మారిస్తే మరిన్ని  మెడికల్‌‌‌‌ సీట్లు మనకే

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియ జూన్‌‌‌‌లో మొదలు కానుంది. ఈలోపు కౌన్సెలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తే తెలంగాణ స్టూడెంట్లకు లబ్ధి చేకూరుతుందని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం అన్ని రకాల విద్యా సంస్థల్లో 15 శాతం కన్వీనర్ కోటా సీట్లను ఇరు రాష్ట్రాల స్టూడెంట్ల కోసం కేటాయించాలి. రెండు రాష్ట్రాల స్టూడెంట్స్ నుంచి అప్లికేషన్లు తీసుకొని, ఎవరికి మెరిట్ ఉంటే వారికి సీట్లు కేటాయించాలి. గత పదేండ్లుగా ఇదే పద్ధతిలో ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేశారు. విభజన చట్టంలోని ఈ క్లాజ్ గడువు గతేడాదితో పూర్తయింది. ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి, అన్ని సీట్లను తెలంగాణ స్టూడెంట్లకే కేటాయించొచ్చని అధికారులు చెబుతున్నారు. జూన్‌‌‌‌లో కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే రూల్స్ మార్చాలని సూచిస్తున్నారు.

20 కాలేజీల్లో 1,950 సీట్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం 26 ప్రభుత్వ, 27 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 2022 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఉమ్మడి కోటా కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రారంభించిన మెడికల్ కాలేజీల్లోనూ ఉమ్మడి కోటాను అమలు చేయడంపై విమర్శలు రావడంతో, గతేడాది కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు అన్ని కొత్త కాలేజీల్లో ఉమ్మడి కోటాను అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన 5 ప్రభుత్వ, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోనే ఉమ్మడి కోటా కొనసాగుతోంది. ఈ 20 కాలేజీల్లో కలిపి 1,950 కన్వీనర్ కోటా సీట్లు ఉన్నాయి. ఇందులో 292 సీట్లను (15%) ఉమ్మడి కోటా కింద భర్తీ చేస్తున్నారు. ఏటా ఇందులో మెజార్టీ సీట్లు ఏపీ స్టూడెంట్లకే దక్కుతున్నాయి. ఈసారి నిబంధనల్లో మార్పులు చేస్తే ఆ సీట్లన్నీ తెలంగాణ స్టూడెంట్స్‌‌‌‌కే దక్కుతాయని అధికారులు చెబుతున్నారు.

పెరగనున్న సీట్ల సంఖ్య..

రాష్ట్రంలో ప్రస్తుతం 53 మెడికల్ కాలేజీల్లో కలిపి 8,490 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మరో 8 ప్రభుత్వ కాలేజీల కోసం గతేడాది మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌మెంట్ నేషనల్‌‌‌‌ మెడికల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (ఎన్‌‌‌‌ఎంసీ)కు దరఖాస్తు చేసింది. ఒక్కో కాలేజీలో వంద సీట్లు ఇవ్వాలని కోరింది. ఒకవేళ ఈ కాలేజీలకు ఎన్‌‌‌‌ఎంసీ పర్మిషన్ ఇస్తే మరో 800 సీట్లు అందుబాటులోకి వస్తాయి. అలాగే, కొన్ని ప్రైవేటు కాలేజీలు కూడా తమ కాలేజీల్లో సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు ఎన్‌‌‌‌ఎంసీ పర్మిషన్ కోరాయి. వాటికి కూడా అనుమతి వస్తే మొత్తం సీట్ల సంఖ్య 9,500కు పెరిగే అవకాశం ఉంది. అయితే, రాష్ట్రంలో గత రెండేండ్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాల కొరత, ఇతర సమస్యలు ఉన్నాయి. వీటిపై ఇప్పటికే ఎన్‌‌‌‌ఎంసీ నోటీసులు కూడా ఇచ్చింది. ఆ సమస్యలను గడువులోగా సరిదిద్దకపోతే, కొన్ని కాలేజీల్లో సీట్ల సంఖ్యలో కోత పెట్టే ప్రమాదం ఉందని మెడికల్ ప్రొఫెసర్లు హెచ్చరిస్తున్నారు.